ఇండియన్ అమెజాన్.. Aravalli పర్వతాలకు పెనుముప్పు: మైనింగ్ కోసం ధారాదత్తం!
ఆరావళి పర్వత శ్రేణులకు తీవ్ర ముప్పు ఏర్పడింది. అరావళి పర్వత శ్రేణులపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించినప్పటి నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చుట్టుపక్కల భూమి నుండి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కొండలను మాత్రమే అరావళి పర్వతాలుగా పరిగణించాలనే కేంద్రం ప్రతిపాదించింది. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నిర్ణయం పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.
నాలుగు రాష్ట్రాల్లో లక్షలాది హెక్టార్లల్లో విస్తరించిన ఈ ఆరావళి పర్వత పంక్తులకు ఇండియన్ అమెజాన్ ఫారెస్ట్ గా గుర్తింపు ఉంది. ఈ పర్వత శ్రేణులు పశ్చిమ, వాయువ్య రాష్ట్రాలకు పెట్టనికోట. ఇక్కడి భూగర్భజలాలు, వాతావరణం, ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తోంది. కాలుష్య నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అరావళి పర్వత శ్రేణిలో దేన్ని చేర్చాలనే దానిపై ప్రస్తుతం వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అరావళి భవిష్యత్తుపై ఏం జరగబోతుందనేది ఆందోళనకంగా మారింది.

గుజరాత్ నుండి ఢిల్లీ వరకు..
గుజరాత్, రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వరకు దాదాపు 690 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ఆరావళి పర్వతశ్రేణులు.. భారత ఉపఖండంలో పురాతన పర్వతాల్లో ఒకటి. ఆరావళి కొండల నిర్వచనాన్ని నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త ప్రతిపాదనలను తెరమీదికి తెచ్చింది. చుట్టుపక్కల భూమి నుండి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కొండలను మాత్రమే అరావళి పర్వతాలుగా పరిగణించాలని ప్రతిపాదించింది. దీన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది.
అరావళిపై భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి?
అరావళి ప్రాంతంలో 100 మీటర్ల పరిధిలో ఎటువంటి మైనింగ్ గానీ, ఇతర పరిరక్షణ చర్యలపై పరిమితిపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఆరావళి రేంజ్ ను నిర్ధారించడానికి పర్వత పాదం నుండి 100 మీటర్ల పరిధిని లెక్కలోకి తీసుకుంటారు. ఈ ప్రాంతంలో ఎటువంటి తవ్వకాలు లేదా ఇతర కార్యకలాపాలకు అనుమతి ఉండదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ దిశగా చర్యలు తీసుకుంది.
అరావళి ప్రాంతంలో మైనింగ్‌కు సంబంధించి కఠినమైన, స్పష్టమైన నిబంధనలను అమలు చేయడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం అని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ చెబుతున్నారు. అరావళి రీజియన్ పరిధిలో మైనింగ్‌కు కఠినమైన, స్పష్టమైన నిబంధనలను రూపొందించడమే ఈ పిటిషన్ల ప్రధాన లక్ష్యం అని ఆయన వివరించారు. దీని పరిధిలోకి వచ్చే నాలుగు రాష్ట్రాలు అరావళికి ఒకే విధమైన నిర్వచనాన్ని నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని మంత్రి వెల్లడించారు.
ఈ ప్రాంతాన్ని జాగ్రత్తగా మ్యాపింగ్ చేయాలని, మైనింగ్ ఎక్కడ చేయాలి, దానిని ఎలా నియంత్రించాలి అనే నిబంధనలను కలిగి ఉండే స్పష్టమైన నిర్వహణ ప్రణాళికను రూపొందించాలని కూడా కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది. వివిధ ప్రభుత్వ రికార్డులు, మ్యాపుల కారణంగా ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడమే దీని ఉద్దేశ్యం. గతంలో ఈ గందరగోళం తరచుగా వివాదాలు, కోర్టు కేసులకు దారితీసింది.
ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి..
వీటిని తొలగించితే ఇష్టారాజ్యంగా మైనింగ్ సాగుతుందనే ఆందోళన పర్యావరణవేత్తల్లో వ్యక్తమౌతోంది. అరావళి పర్వత శ్రేణుల ప్రాముఖ్యత ఏమిటనేది దాని ఎత్తులో కాకుండా అది చూపే ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వ పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు. ఈ పర్వత శ్రేణులు సహజ నీటి సేకరణ వ్యవస్థలుగా పనిచేస్తాయని, వీటి రాతి నిర్మాణం వర్షపు నీటిని నెమ్మదిగా భూమిలోకి ఇంకనివ్వడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని, ఈ జలవనరులు రాజస్థాన్‌లోని అనేక పట్టణాలకు, అలాగే ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, అల్వార్ వంటి పెద్ద నగరాలకు ప్రధాన వనరుగా ఉంటోందని అంటున్నారు.
విస్తృతమైన మైనింగ్, పర్వత శ్రేణుల నరికివేత ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని, ఇది దీర్ఘకాలిక భూగర్భ జల నష్టానికి దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు. అరావళి పర్వత శ్రేణుల రేంజ్ ను తగ్గించితే మున్ముందు థార్ ఎడారి మరింత వేగంగా విస్తరించే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. ఈ పర్వతపంక్తుల వల్ల డెజర్టైజేషన్ అనేది తగ్గిందని, అవే లేకపోతే ఎడారి విస్తరిస్తుందని చెబుతున్నారు. ఇండో-గంగా ప్లెయిన్స్ లల్లో ఇసుక తుఫానులు, తీవ్రమైన వేడి కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications