చారిత్రాత్మక ఘట్టం: లోక్‌సభలో మహిళా బిల్లు అప్‌లోడెడ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవన సముదాయం మనుగడలోకి వచ్చింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రం. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కొద్దిసేపటి కిందటే కొత్త పార్లమెంట్ భవనంలో లాంఛనంగా అడుగుపెట్టారు.
కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశించిన వెంటనే జాతీయ గీతాలాపనతో సభా కార్యకలాపాలు మొదలయ్యాయి. స్పీకర్ ఓం బిర్లా తన స్థానంలో ఆసీనులయ్యారు. ఆ వెంటనే ప్రధాని మోదీ ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సహా పలు కీలకాంశాలను ఆయన ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రమంత్రి వర్గం ఆమోదించిందనీ పేర్కొన్నారు.

దీనికి తమ ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినియంగా పేరు పెట్టినట్లు మోదీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రివర్గంలో చాలాసేపు చర్చించామని పేర్కొన్నారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు చాలాసార్లు సభ ముందుకు వచ్చిందని, దాన్ని ఆమోదింపజేసుకోవడానికి తగినంత మెజారిటీ అప్పట్లో అధికార పక్షానికి లేదని గుర్తు చేశారు.
సంపూర్ణ మెజారిటీ లేకపోవడం వల్ల మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్‌ను కల్పించాలనే ఓ కల సాకారం కాలేదని, కార్యరూపాన్ని దాల్చ లేకపోయిందని మోదీ చెప్పారు. ఇప్పుడు అదే బిల్లును ఆమోదింపజేసుకునే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. అలాంటి ఓ చక్కటి అవకాశాన్ని భగవంతుడు తనకు ఇచ్చాడని అన్నారు.
ఉభయ సభల్లో మహిళల భాగస్వామ్యంపై తమ ప్రభుత్వం నేడు కొత్తగా ఓ బిల్లును తీసుకువస్తోందని తేల్చి చెప్పారు. ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కొత్త పార్లమెంట్ భవనంలో ఈ బిల్లును ముక్తకంఠంతో సభ్యులు ఆమోదించాలని కోరారు.

మోదీ ప్రసంగం ముగిసిన తరువాత ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడారు. రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. రాజ్యంగం అనేది మనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని అన్నారు. ఆర్టికల్ 1 ప్రకారం- ఇండియా అంటే అన్ని రాష్ట్రాల యూనియన్ అవుతుందని, ఇండియా, భారత్‌కు మధ్య వ్యత్యాసం లేదని చెప్పారు.
ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యాంగాన్ని, అందులో పొందుపరిచిన అంశాలను మరింత బలోపేతం చేసేలా, సమతౌల్యాన్ని సాధించడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.
బిల్లు కాపీలేవీ తమ చేతికి అందలేదంటూ విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటి కాపీలను తమకు అందజేయాలంటూ పట్టుబట్టారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకున్నారు. బిల్లు అప్‌లోడెడ్ అయిపోయిందని ప్రకటించారు. అదే ఈ కొత్త పార్లమెంట్ టెక్నాలజీ స్పెషాలిటీ.. అంటూ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications