లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం మధ్యాహ్నం పెనువిషాదం చోటుచేసుకుంది. భారత ఆర్మీకి చెందిన ఓ వాహనం అదుపుతప్పి సుమారు 200 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది ఆర్మీ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బందేర్వా-చంబా హైవేపై ఉన్న ఖన్ని టాప్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బుల్లెట్ ప్రూఫ్ ఆర్మీ వాహనంలో 17 మంది ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్నారు.
అసలేం జరిగింది?
అందుకున్న సమాచారం ప్రకారం, సైనికులతో వెళ్తున్న వాహనం దోడా ప్రాంతంలోని ఎత్తైన పర్వత రహదారిపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలుపు వద్ద వాహనం అదుపు తప్పి నేరుగా లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది జవాన్లు వీరమరణం పొందారు. ప్రమాదంలో గాయపడిన ఏడుగురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని వెంటనే సమీపంలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు.

సహాయక చర్యలు ముమ్మరం
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మరియు ఆర్మీ రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. లోయ చాలా లోతుగా ఉండటం, వాతావరణ పరిస్థితుల వల్ల సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగింది. అయినప్పటికీ, క్రేన్లు, ఇతర పరికరాల సాయంతో వాహనంలో చిక్కుకున్న వారిని వెలికితీశారు.
ఉన్నతాధికారుల దిగ్భ్రాంతి
ఈ ఘటనపై సైన్యాధికారులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉంటూ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, అనంతరం వారి స్వగ్రామాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో ఆర్మీ తన ఆధీనంలోకి తీసుకుని విచారణ చేపట్టింది. రహదారిపై ఉన్న మంచు లేదా సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications