ఓటు వేయకపోతే అరెస్ట్? పథకాలు కట్!: సుప్రీం రియాక్షన్
భారత ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేయాలన్న లక్ష్యంతో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. దేశంలో ప్రతి పౌరుడు ఓటు వేయడం తప్పనిసరి చేయాలని, ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలను నిలిపివేయడంతో పాటు కఠిన శిక్షలు విధించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రజాస్వామ్యంలో పౌరులను బలవంతంగా పోలింగ్ కేంద్రాలకు పంపలేమని స్పష్టం చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ఓటు వేయని వారిపై ఆంక్షలు విధిస్తేనే పోలింగ్ శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై సీజేఐ ఘాటుగా స్పందించారు. "ఒకవేళ పౌరుడు ఓటు వేయడానికి వెళ్లకపోతే మనం ఏం చేయగలం? అతన్ని అరెస్టు చేయాలని మేం పోలీసులను ఆదేశించాలా?" అని ప్రశ్నించారు. చట్టబద్ధమైన పాలన ఉన్న దేశంలో బాధ్యతాయుతమైన ఓటరుగా ఉండాలని ఆశించడం వేరని, కానీ శిక్షాత్మక చర్యలతో వారిని లొంగదీసుకోవడం వేరని కోర్టు అభిప్రాయపడింది.

ఇది అవగాహన అంశం.. నిర్బంధం కాదు!
ఓటు హక్కు వినియోగం అనేది ప్రజల్లో ఉండాల్సిన అవగాహన (Public Awareness) మీద ఆధారపడి ఉంటుందే తప్ప, చట్టబద్ధమైన నిర్బంధం కాదని కోర్టు పేర్కొంది. ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలను బలోపేతం చేయాలని, శిక్షలు విధిస్తామంటే అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో పట్టణ ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ శాతంపై సీజేఐ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, అది వ్యవస్థాపక మార్పుల ద్వారా జరగాలే తప్ప కోర్టు ఆదేశాల ద్వారా కాదని స్పష్టం చేశారు.
చట్టసభల పరిధిలోని నిర్ణయం
ఈ పిటిషన్ పూర్తిగా 'విధానపరమైన నిర్ణయం' (Policy Matter) కిందకు వస్తుందని, దీనిపై ఏదైనా మార్పులు చేయాలంటే అది కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంటు మాత్రమే చేయగలవని న్యాయమూర్తులు పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేస్తూ, పిటిషనర్ తన సూచనలను సంబంధిత అధికారులకు లేదా శాసన వ్యవస్థకు పంపుకోవచ్చని సూచిస్తూ అజయ్ గోయెల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును కొట్టివేసింది.














Click it and Unblock the Notifications