ఏడేళ్ల క్రితం నాటి కేసు: యూపీ మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యపై అరెస్ట్ వారెంట్ జారీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తుండటం రాజకీయంగా సంచలనంగా మారింది. పార్టీని వీడకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీ నేతల శ్రమ వృధా అవుతోంది.
Recommended Video
కాగా, మంగళవారం మంత్రి పదవికి రాజీనామా చేసి, సమాజ్ వాదీ పార్టీలో చేరిన మాజీ మంత్రి స్వామిప్రసాద్ మౌర్యపై అరెస్ట్ వారంట్ జారీ అయింది. బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన 24 గంటల్లోనే స్వామిప్రసాద్ మౌర్యపై అరెస్ట్ వారెంట్ జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. అది కూడా ఏడేళ్ల నాటి ఒక కేసుకు సంబంధించినది కావడం గమనార్హం. .

2014లో బహుజన్ సమాజ్వాదీ పార్టీలో ఉన్న స్వామిప్రసాద్.. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై సుల్తాన్ పూర్‌లో కేసు నమోదు అయింది. అయితే 2016 అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. ఆ కేసుపై కోర్ట్ తాత్కాలికంగా స్టే విధించింది. ఎమ్మెల్యేగా గెలిచిన స్వామిప్రసాద్ బీజేపీలో చేరగా సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఆయనకు మంత్రి పదవి అప్పగించారు.
కాగా, బీజేపీ హయాంలో బడుగుబలహీన వర్గాలు ఎదగలేకపోతున్నాయంటూ ఆరోపించిన స్వామిప్రసాద్.. మంగళవారం బీజేపీని వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. మంత్రి పదవి నుంచి తప్పుకున్న 24 గంటల్లోనే స్వామిప్రసాద్ పై అరెస్ట్ వారెంట్ జారీచేశారు. జనవరి 24లోగా కోర్టులో హాజరు కావాలంటూ సుల్తాన్ పూర్‌లోని ఎంపీ, ఎమ్మెల్యేల కోర్ట్ ఆదేశించింది.
ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. యూపీలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని తాజా ఓపీనియన్ పోల్స్ ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, అధికార బీజేపీని ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు వీడారు. వీరంతా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీలోకి చేరిక ఖరారైపోయింది.












Click it and Unblock the Notifications