వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాత్మా గాంధీ మ్యాగజైన్‌లో వీర్ సావర్కర్‌ను కీర్తిస్తూ వ్యాసాలు...బీజేపీపై విమర్శలు ఎందుకు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రారంభించిన ఒక మ్యాగజైన్‌లో గాంధీతో సమానంగా వినాయక్ దామోదర్ సావర్కర్‌ను స్తుతిస్తూ తీసుకొచ్చిన ప్రత్యేక ఎడిషన్ వివాదానికి కేంద్ర బిందువైంది.

''అంతిమ్ జన్’’ పేరుతో గాంధీ స్మృతి & దర్శన్ సమితి (జీఎస్‌డీఎస్) ఈ మ్యాగజైన్‌ను ప్రచురిస్తుంది. తాజా ఎడిషన్‌లో సావర్కర్ గురించి దీనిలో కథనాలు వచ్చాయి.

అయితే, తాజా ఎడిషన్‌ను మేధావులు, గాంధేయవాధులు విమర్శిస్తున్నారు. గాంధీతో సమానంగా సావర్కర్‌ను ప్రస్తావించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఈ అంశంలో జీఎస్‌డీఎస్‌ వ్యవహరించిన తీరుపై గాంధీ మునిమనమడు తుషార్ గాంధీ విమర్శలు చేశారు. గాంధీజీ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి గురించి గొప్పగా చెప్పడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

1948లో గాంధీ హత్యకు గురైన తర్వాత ఆరో రోజు సావర్కర్‌ను ముంబయిలో పోలీసులు అరెస్టు చేశారు. గాంధీజీ హత్యతో ఆయనకు సంబంధముందని పోలీసులు ఆరోపణలు మోపారు.

కానీ, ఫిబ్రవరి 1949లో ఈ కేసుతో సావర్కర్‌కు సంబంధం లేదని విడిచిపెట్టేశారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీతో సమానంగా సావర్కర్ కూడా పోరాడారని మ్యాగజైన్‌ కమిటీ వైస్-చైర్మన్, బీజేపీ దిల్లీ విభాగం మాజీ అధిపతి విజయ్ గోయల్ అన్నారు.


విజయ్ గోయల్ కథనం ఇదీ


''ఒక్క రోజు కూడా జైలులో గడపని వారు, ఎలాంటి చిత్రహింసలు అనుభవించని వారు, దేశం కోసం ఎలాంటి సేవ చేయని వారు.. సావర్కర్ లాంటి స్వాతంత్ర్య సమరయోధుడిని విమర్శిస్తున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో, చరిత్రలో సావర్కర్ పాత్ర గాంధీతో సమానమైనది’’అని విజయ్ గోయల్ రాసుకొచ్చారు.

''భారత స్వాతంత్ర్యం కోసం వీర్ సావర్కర్ ఎంతో కృషి చేశారు. దేశం లోపల, వెలుపల కూడా విప్లవ కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకున్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రచారాలు చేపట్టారు. సావర్కర్‌ను చూసి భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం 1910లో ఆయనకు జీవిత ఖైదు విధించింది. 1911లోనూ మరోసారి జీవిత ఖైదు విధించారు. ఒకే వ్యక్తికి రెండు సార్లు జీవిత ఖైదు విధించడం ప్రపంచ చరిత్రలో అదే తొలిసారి కావొచ్చు’’అని ఆయన రాశారు.


ఆ కథనం చివరన ''ప్రస్తుతం భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇలాంటి సమయంలో సావర్కర్ లాంటి స్వాతంత్ర్యోద్యమకారులను గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం’’అని పేర్కొన్నారు. అప్పట్లో నాసిక్ కలెక్టర్ హత్యకు శిక్షగా సావర్కర్‌ను కాలాపానీకి పంపిన విషయాన్ని కూడా విజయ్ గోయల్ ప్రస్తావించారు.

ఆ మ్యాగజైన్‌లో మొత్తంగా 12 ఆర్టికల్స్‌ను ప్రచురించారు. ''ఏక్ చింగారీ థె సావర్కర్ (సావర్కర్ మెరుపు లాంటివారు), గాంధీ ఔర్ సావర్కర్‌ కా సంబంధ్ (గాంధీ, సావర్కర్‌ల మధ్య సంబంధం), వీర్ సావర్కర్ ఔర్ మహాత్మా గాంధీ (వీర్ సావర్కర్, మహాత్మా గాంధీ), దేశ్ భక్త్ సావర్కర్ (దేశ భక్తుడు సావర్కర్) లాంటి శీర్షికలతో ఈ కథనాలు ప్రచురితం అయ్యాయి.

ఈ అంశంపై స్పందించాలని విజయ్ గోయల్‌ను బీబీసీ కోరింది. అయితే, ఈ వార్త రాసే సమయానికి ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

మ్యాగజైన్‌లో సావర్కర్‌పై డాక్టర్ కన్నయ్య త్రిపాఠి కూడా ఒక కథనం రాశారు. ఆయనతో బీబీసీ మాట్లాడింది. ''ఈ దేశంలో చాలా అంశాలపై విమర్శలు చేస్తుంటారు. అందుకే వీర్‌ సావర్కర్ లాంటి గొప్ప వ్యక్తులను మనం తటస్థ కోణంలో చూడాలి. ఒకవేళ విమర్శలు వస్తే, వాటిని ఆహ్వానించాలి కూడా’’అని కన్నయ్య అన్నారు.

గాంధీ సిద్ధంతాలను ప్రచారం చేసే మ్యాగజైన్‌లో సావర్కర్‌పై ఎడిషన్ ఎందుకు తీసుకొచ్చారు? అని త్రిపాఠిని బీబీసీ ప్రశ్నించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ''అంతిమ జన్ మ్యాగ్‌జైన్‌లో గాంధీకి సంబంధించిన చాలా వివరాలు పబ్లిష్ అయ్యాయి. ఇప్పుడు సావర్కర్ కూడా గాంధీతో సంబంధాల్లో భాగానే చూపించాం. ఇక్కడ గాంధీ, సావర్కర్‌లను రెండు ధ్రువాలుగా చూడకూడదు. వారిద్దరి లక్ష్యం జాతీయవాదమే. వారిద్దరూ దేశం కోసమే పోరాటం చేశారు’’అని ఆయన చెప్పారు.

మహాత్మా గాంధీ హత్య కేసులో సావర్కర్‌పై వచ్చిన ఆరోపణల గురించి కూడా త్రిపాఠి స్పందించారు.

''ఆ ఆరోపణలు నిజమైతే సావర్కర్‌ను ఎప్పుడో ఉరితీసేవారు. వాటిలో నిజం లేదు. నాథురాం గాడ్సేకు మాత్రమే శిక్ష పడింది. సావర్కర్‌పై వచ్చినవన్నీ ఆరోపణలే. వాటికి ఎలాంటి ఆధారాలూ లేవు. స్వాతంత్ర్యం విషయానికి వస్తే, గాంధీ, సావర్కర్‌ల లక్ష్యం ఒక్కటే. మేం వారిని మతాల కోణంలో చూడాలని అనుకోవడం లేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, ఈ మ్యాగజైన్‌లో సావర్కర్‌పై ప్రత్యేక ఎడిషన్ తీసుకురావడం చూసి తాను ఎలాంటి ఆశ్చర్యానికీ గురికాలేదని గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ అన్నారు.

తుషార్ గాంధీ

తుషార్ గాంధీ ఏం అన్నారు?

''అధికారంలో ఎవరు ఉంటారో.. వారి చేతుల్లోనే అన్ని సంస్థలూ ఉంటాయి. గాంధీకి సంబంధించిన సంస్థలు కూడా దీనికి మినహాయింపు కాదు. ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను. ప్రభుత్వ విధానాలు ఇప్పుడు అన్నింటిలోనూ కనిపిస్తున్నాయి’’అని తుషార్ గాంధీ అన్నారు.

''ఇప్పుడు ప్రభుత్వం అన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే ఈ మ్యాగజైన్‌ను చూసినప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు. బాపూ సిద్ధాంతాల కోసం పనిచేయాల్సిన సంస్థే.. బాపూ రక్తపాతానికి కారణమైన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సావర్కర్‌ను స్తుతిస్తోంది’’అని ఆయన అన్నారు.

''ఇలాంటివి భవిష్యత్‌లో మరిన్ని జరుగుతాయి. ఇలాంటివి ఊహించుకుంటేనే చాలా బాధనిపిస్తోంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

''దీని గురించి గాంధీకి సంబంధించిన అన్ని వేదికలపైనా మాట్లాడతాను. ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా తమ భావాలను వెల్లడించే హక్కు రాజ్యాంగం మనకు కల్పిస్తోంది. ఈ విషయంలో నాకు కొన్ని అవరోధాలు కచ్చితంగా వస్తాయి. కానీ, నేను చెప్పాలని అనుకునేది చెప్తాను’’అని ఆయన అన్నారు.

''సావర్కర్‌కు సంబంధించిన నిజాలు అందరికీ తెలియాలి. ఒకవేళ సావర్కర్ కూడా బాపూ అంత గొప్ప వ్యక్తి అయితే, తనను క్షమించాలని బ్రిటిషర్లకు సావర్కర్ ఎందుకు అన్ని లేఖలు రాశారు? బ్రిటిషర్ల నుంచి పింఛను ఎందుకు తీసుకున్నారు? స్వాతంత్ర్యోద్యమంలో అమరులైన ఎవరి కుటుంబాలూ పింఛను తీసుకోలేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

విమర్శకులు ఏం అంటున్నారు?

ఈ అంశంపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) జాతీయ అధికార ప్రతినిధి, ప్రొఫెసర్ సుబోధ్ కుమార్ మెహ్తా స్పందించారు. ''నేడు గాంధీజీ ఆత్మ ఎంతో బాధపడి ఉంటుంది. గాంధీ అహింసావాదాన్ని ప్రచారం చేసేందుకు ఏర్పాటుచేసిన జీఎస్‌డీఎస్ నేడు ఇలాంటి మ్యాగజైన్ తీసుకొచ్చింది. ఇది గాంధీ సిద్ధాంతాలను ఎగతాళి చేయడమే’’అని ఆయన వ్యాఖ్యానించారు.

https://twitter.com/subodhprof01/status/1548341908875149312

''ఈ విషయంలో కొంచెం పశ్చాత్తాప పడినా.. ముందు ఈ మ్యాగజైన్‌ను తీసుకొచ్చిన వారు దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పాలి. తమ పదవులకు వారు రాజీనామా చేయాలి. ఇలాంటివి వదిలేస్తే, రేపు హిట్లర్, ముస్సోలినీలను కూడా స్తుతిస్తారు’’అని ఆయన అన్నారు.

https://twitter.com/omthanvi/status/1548126941810950144

మరోవైపు మ్యాగజైన్‌లోని కొన్ని పేజీలను సీనియర్ జర్నలిస్టు ఓమ్ థాన్వీ కూడా ట్వీట్ చేశారు. ''గాంధీ హత్యకు కుట్రపై విచారణకు ఏర్పాటుచేసిన జస్టిస్ కపూర్ కమిషన్.. దీనిలో సావర్కర్‌తోపాటు ఆయన గ్రూప్‌కు సంబంధముందని తేల్చింది. కానీ, ఇప్పుడు గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే జీఎస్‌డీఎస్‌ ఏకంగా సావర్కర్‌ను స్తుతిస్తూ మ్యాగజైన్ ప్రచురించింది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

''బీజేపీ అబద్ధాలు చెబుతోంది’’

మహాత్మ గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు ఏర్పాటైన గాంధీ పీస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కుమార్ ప్రశాంత్ కూడా ఈ అంశంపై స్పందించారు.

''ప్రతి ఒక్కరికీ అబద్ధాలు చెప్పే, చరిత్రను వక్రీకరించే హక్కు ఉంటుంది. బీజేపీ ఈ హక్కును పూర్తిగా వినియోగించుకుంటోంది. తాజా మ్యాగజైన్ దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు రచయిత అశోక్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ''గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయాల్సిన సంస్థే ఇలాంటి మ్యాగజైన్ తీసుకుని రావడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. వారు సావర్కర్‌ను కూడా గాంధీ స్థాయిలో చూపించాలని చూస్తున్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

''అసలు ఆ మ్యాగజైన్ నాణ్యత గురించి మనం మాట్లాడుకోవడం దండగ. ఎందుకంటే వైస్ ఛైర్మన్ విజయ్ గోయల్ ఎన్నో తప్పులు చేశారు. ఆయన రాసిన 500 పదాల ఆర్టికల్‌లో 1906లో శ్యామప్రసాద్ ముఖర్జీ, సావర్కర్‌ కలిశారని రాశారు. అప్పటికీ శ్యామప్రసాద్ ముఖర్జీ వయసు ఐదేళ్లు మాత్రమే. గాంధీజీ హత్య గురించి మాట్లాడుతూ.. సావర్కర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పారు. కపూర్ కమిషన్ నివేదిక గురించి ఆయన మరచిపోయారా?’’అని ఆయన ప్రశ్నించారు.

https://twitter.com/narendramodi/status/1530380017695334400

ఇటీవల సావర్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. భారత మాత ముద్దుబిడ్డగా సావర్కర్‌ను ఆయన పేర్కొన్నారు. అద్భుతమైన రచయిత, సంఘ సంస్కర్తగా అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Articles glorifying Veer Savarkar in Mahatma Gandhi magazine,Why criticism of BJP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X