మీడియాపై జైట్లీ అసహనం, మొన్న సునంద కేసులో థరూర్...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం నాడు మీడియా పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన జైట్లీ, కాలం మారిందని, ఆధునిక సమాజంలో మీడియా పాత్ర పెరిగిందన్నారు.
ఆదివారం జస్టిస్ జెఎస్ వర్మ స్నాతక్సోతవం కార్యక్రమంలో జైట్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 2014 ఎన్నికల్లో సోషల్ మీడియా బాగా ఉపయోగపడిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విప్లవం వచ్చిందని, ప్రజలు ఐపాడ్, ట్యాబ్‌ల సహాయంతో రాత్రి వేళల్లో పత్రికలు చదువుతున్నారన్నారు.

మీడియా ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో మంచి కన్నా చెడు ఎక్కువగా చూపిస్తున్నారన్నారు. మనుషుల కష్టాలు వార్తలు కావడం లేదని, నేరాలు, వివాదాలు, అవినీతి పెద్ద వార్తలైపోయాయన్నారు.
కేవలం విధ్వంసాలను చూపేందుకే కెమెరా ఇష్టపడుతోందని విమర్శించారు. ప్రత్యేకించి నేరాలు, కాంట్రోవర్సీల పైనే మీడియా సంస్థలు ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయని, టీఆర్పీ రేటింగ్ కోసం సంచలనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
వ్యక్తిగత ప్రైవసీని గౌరవించాలన్నారు. భర్త, భార్యల మధ్య రిలేషన్ షిప్ విషయమై జాగ్రత్తగా రిపోర్టే చేయాలన్నారు. కాగా, ఇటీవల తన భార్య సునంద పుష్కర్ మృతి కేసు విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ మంత్రి శశిథరూర్ కూడా మీడియా పైన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు జైట్లీ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications