సీబీఐ ముందుకు కేజ్రీవాల్ - విచారణతో ఆగేనా, ఏం జరుగుతోంది..!!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఢిల్లీలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసారు. కేజ్రీవాల్ కు సంఘీభావంగా ఆయనతో పాటుగా పంజాబ్ ముఖ్యమంత్రి వెళ్లనున్నట్లు సమాచారం.
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది. దీని పై ఇప్పటికే కేజ్రీవాల్ సీరియస్ గా స్పందించారు. సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సీబీఐ విచారణకే పరిమితం అవుతుందా, ఏం చేయనుందనే ఉత్కంఠ మొదలైంది.

కేజ్రీవాల్ విచారణ: ఆప్ కన్వీనర్..ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాసేపట్లో సీబీఐ ముందు హాజరు కానున్నారు. దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి.. సీబీఐ ఆయన్ను ప్రశ్నించనుంది. మద్యం విధానం రూపకల్పనపై విచారణ చేయనుంది. మద్యం పాలసీపై కేబినెట్ ముందు ప్రతిపాదించాల్సిన ఫైల్ కనిపించటకపోవటం పైన సీబీఐ ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది.
మద్యం పాలసీకి సంబంధించి న్యాయపరమైన అభిప్రాయాలతో మంత్రివర్గం ముందుకు రావాల్సిన ఫైల్ రాలేదని సీబీఐ చెబుతోంది. దీని పైన కేజ్రీవాల్ నుంచి సమాచారం రాబట్టే ఛాన్స్ ఉంది. మద్యం వ్యాపారులు..ప్రధానంగా సౌత్ గ్రూపు ఈ పాలసీ రూప కల్పనలో లాబీయింగ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. వీటి పైన ప్రధానంగా కేజ్రీవాల్ ను విచారించే అవకాశం కనిపిస్తోంది.
కేజ్రీ కౌంటర్ ఎటాక్: ఇప్పటికే తనకు సీబీఐ నోటీసులు ఇవ్వటం పైన కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ ప్రచారం చేస్తున్నట్లుగా అసలు మద్యం పాలసీలో కుంభకోణమే లేదని తేల్చి చెప్పారు. అవకతవకలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయినా దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాల్లో అబద్ధాలు చెప్తున్నాయని ఆరోపించారు.
రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కి వేసేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను అసాధారణ రీతిలో వినియోగిస్తున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరెస్టు చేసిన వారిని థర్డ్ డిగ్రీ ప్రయోగించి మరీ అకారణంగా హింసిస్తున్నారని మండిపడ్డారు. ఏడాది నుంచి విచారణ జరుపుతున్నా ఇంతవరకూ ఎలాంటి అవకతవకలను గుర్తించలేదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
విచారణలో ఏం జరగనుంది: ప్రధాని మోదీకి నేను రూ.వెయ్యి కోట్లు ఇచ్చానని చెప్తా. అప్పుడు మీరు ప్రధానిని అరెస్టు చేస్తారా అంటూ దర్యాప్తు సంస్థలను కేజ్రీవాల్ ప్రశ్నించారు. రూ.100 కోట్ల స్కామ్ జరిగినట్టు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. వందల సంఖ్యలో సోదాలు చేసినా ఎలాంటి సొమ్మును గుర్తించలేదని చెప్పారు.
గోవా ఎన్నికల ప్రచారంలో తాము ఆ సొమ్మును వినియోగించామని ఎలా చెబుతారంటూ కేజ్రీవాల్ నిలదీసారు. అటు, కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ శాసనసభను సోమవారం ప్రత్యేకంగా సమావేశపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ కేసులో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. ఇప్పుడు కేజ్రీవాల్ విచారణ పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications