మళ్లీ వార్తల్లోకి ఎక్కిన ప్రశాంత్ కిశోర్: వ్యూహం ఫలించినట్టేనా? కేజ్రీవాల్‌తో.. !
న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మొన్నటిదాకా బిహార్ రాజకీయాల్లో బాగా వినిపించిన ఆయన పేరు..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తరువాత.. మళ్లీ చర్చల్లోకి వచ్చింది. దీనికి కారణం కూడా ఎగ్జిట్ పోల్సే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమ్ఆద్మీ పార్టీతో చేతులు కలిపిన ఆయన వేసిన ఎత్తుగడలు, పన్నిన వ్యూహాలు.. ఆప్‌ను వరుసగా రెండోసారి ఢిల్లీ గద్దెను ఎక్కించడానికి బాటలు వేసినట్లు తెలుస్తోంది.

ఆప్ నేత సంజయ్ సింగ్‌తో
ఆమ్ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్‌తో కలిసి ప్రశాంత్ కిశోర్ దిగిన ఓ ఫొటో.. జనతాదళ్ (సెక్యులర్)లో కలకలం రేపిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ఆమ్ఆద్మీ పార్టీతో అసోసియేట్ కావడం కలకలం రేపింది. బిహార్‌లో అధికారంలో ఉన్న జనతాదళ్(ఎస్).. బీజేపీ మిత్రపక్షంగా ఎన్డీఏ కూటమిలో కొనసాగుతోంది. అలాంటి సమయంలో- తమ పార్టీకి చెందిన ప్రశాంత్ కిశోర్.. బీజేపీ ప్రత్యర్థికి సహకరించడం అనేది నచ్చలేదు.

సీఏఏపై వ్యతిరేకత కూడా..
అదే సమయంలో- పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రశాంత్ కిశోర్ చేసిన ప్రకటనలు కూడా జేడీఎస్ చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు చిర్రెత్తుకొచ్చాయి. దీనితో ఆయనను పార్టీ నుంచి సాగనంపారు. ఆ తరువాత ప్రశాంత్ కిశోర్‌కు మంచి అవకాశాలు దక్కాయి. తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకేతో చేతులు కలిపారాయన. ఇదే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. డీఎంకేని గెలిపించే బాధ్యతను ప్రశాంత్ కిశోర్ తీసుకున్నారు.

ఏపీ తరహాలోనే ఢిల్లీలోనూ..
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక.. ప్రశాంత్ కిశోర్ వ్యూహం బాగా పనిచేసింది. ఎక్కడ? ఎలాంటి వ్యూహాలతో ప్రత్యర్థిని చిత్తు చేయాలనే అంశం మీద ఐప్యాక్ బాగా కసరత్తు చేసింది. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలను తీసుకుంది. అదే తరహా వ్యూహాన్ని ఢిల్లీలోనూ అమలు చేశారని అంటున్నారు. ఫలితంగా- ఏపీ తరహాలోనే ఢిల్లీలో కూడా ఆప్.. క్లీన్ స్వీప్ చేయొచ్చంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.

ప్రశాంత్ కిశోర్‌తో కేజ్రీవాల్ భేటీ..
ఎగ్జిట్ పోల్స్ వెలువడిన వెంటనే ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రశాంత్ కిశోర్‌ను కలిశారు. ఈ సమావేశంలో ఆప్‌కు చెందిన పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా పలువురు నేతలతో కలిసి ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక పెద్దగా రాజకీయ కారాణాలేవీ లేవని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత.. వంటి అంశాలపై చర్చించారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications