Exit Poll Results 2026: అసోంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!
అసోంలో బీజేపీ నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలెయెన్స్ (ఎన్‌ఈడీఏ) కూటమి వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా మెజార్టీకి 64 స్థానాలు కావాలి. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 68-72 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 22-26 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఎన్‌ఈడీఏ కూటమిలో బీజేపీ మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (ఏజీపీ) 7-10, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) 8-9 స్థానాల్లో గెలిచే అవకాశాలున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి 90 స్థానాలకు చేరుకోవచ్చని సర్వే స్పష్టం చేసింది.
ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ 38.6 శాతం, కాంగ్రెస్ 36.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. అసోం ఎన్నికల్లో ఇతర పార్టీలైన ఏఐయూడీఎఫ్, రాయిజర్ దాల్, యూపీపీఎల్, ఏజేపీ, సీపీఐ(ఎం), ఇతరుల ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. అలాగే బీజేపీ ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వానికి 45 శాతం మద్దతిస్తున్నట్లు వెల్లడైంది. మరోవైపు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగాయ్‌కు 35 శాతం మద్దతిస్తున్నట్లు తేలింది.
అప్పర్ అసోంలో ఎన్డీఏ పటిష్టంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అలాగే మధ్య అసోంలోని నాగావ్, హూజాయ్, కర్బి అంగలాంగ్, దిమా హసావ్, దారంగ్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటా పోటీ కనిపిస్తోందని సర్వే పేర్కొంది. అలాగే ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్న లోయర్ అసోంలో ఏఐయూడీఎఫ్ గతంలో పోలిస్తే కొంత బలోపేతమయినా ఇక్కడ ఎన్డీఏ ఆధిపత్యం కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్ సర్వే తేల్చింది.

ఇక ఈ ఎన్నికల్లో అసోంలో రికార్డు స్థాయిలో 85.8 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యధికం కావడం విశేషం. రాష్ట్రంలోని 126 స్థానాలకు ఏప్రిల్ 9 న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications