ఇంటర్ పరీక్షలు రద్దు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
2024-25 విద్యా సంవత్సరం ముగుస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే అస్సాంలో మాత్రం ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పరీక్షల కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని సంబంధించి తదుపరి చర్యలను సోమవారం జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు స్పష్టం చేశారు.
పరీక్షల రద్దుకు కారణం..
అస్సాంలో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. గత వారం అస్సాంలోని బార్పేట జిల్లాలో 9వ తరగతి ఇంగ్లీష్ వార్షిక పరీక్ష ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో లీక్ కావడంతో దానిని రద్దు చేశారు. ఈ క్రమంలోనే ఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తీవ్రదుమారం రేపింది. మార్చి 21వ తేదీన జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం లెక్కల పేపర్ లీక్ అయింది. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. దీంతో మార్చి 24 నుంచి ఈ నెల 29 వరకు జరిగే మొత్తం 36 సబ్జెక్టుల పరీక్షలన్నిటినీ రద్దు చేసినట్లు విద్యా శాఖ మంత్రి రనోజ్ పెగు ప్రకటించారు.

ఈ లీక్ ఇష్యూలో 10 జిల్లాల్లోని 15 ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకున్నారు. అంతే కాకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు మరో మూడు పాఠశాలలపై కూడా చర్యలకు ఆదేశించినట్లు మంత్రి పెగు తెలిపారు. ఆయా పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల అడ్మిషన్లను కూడా నిషేధించినట్లు వెల్లడించారు. ఇకపై ఎవరైనా లీకేజీలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు.
ఇక వరుసగా అస్సాంలో ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం పట్ల విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. విద్యా శాఖ మంత్రి పెగు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యువతరం భవిష్యత్తును కాపాడటంలో హిమాంత బిశ్వశర్మ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నాయకులు సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వరుస ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications