లేడీ సింగం, దబాంగ్ పోలీస్ ఇక లేరు: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ రాభా మృతి
గౌహతి: అస్సాం పోలీస్ విభాగంలో 'లేడీ సింగం'గా పేరు తెచ్చుకున్న మహిళా పోలీస్ అధికారి జున్‌మోనీ రాభా(Junmoni Rabha) దుర్మరణం పాలయ్యారు. నాగాన్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె జిల్లాలో పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
మోరికొలాంగ్ పోలీస్ స్టేషన్ ఔట్ పోస్టు ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఎస్ఐ జన్మోనీ రభా.. సోమవారం అర్ధరాత్రి తన ప్రైవేటు కారులో ప్రయాణిస్తుండగా.. అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న ఓ కంటైనర్ వాహనాన్ని రభా కారు బలంగా ఢీకొట్టింది. జాఖలాబంధా స్టేషన్ పరిధిలోని సరుభుగియా గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన జన్మోనీని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు. కాగా, సివిల్ దుస్తుల్లో ఉన్న ఆమె.. ఆ సమయంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారన్న విషయం తెలియరాలేదని జిల్లా ఎస్పీ తెలిపారు.
జన్మోనీ రాభా.. నాగాన్ జిల్లాలో ఎస్ఐగా విధులు నిర్వర్తించేవారు. విధుల్లో చాలా కఠినంగా వ్యవహరించేవారు. తనదైన పనితీరుతో ఆ ప్రాంతంలో లేడీ సింగం, దబాంగ్ పోలీస్‌గా పేరు తెచ్చుకున్నారు. మరోవైపు, పలువు వివాదాల్లోనూ ఆమె చిక్కుకున్నారు. అవినీతి ఆరోపణలపై గత జూన్ నెలలో ఆమె అరెస్టయ్యారు. కొంత కాలంపాటు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి విధుల్లో చేరారు. ఓ బీజేపీ ఎమ్మెల్యేతో ఆమె సంభాషణ కూడా వివాదాస్పదమైంది.












Click it and Unblock the Notifications