రేప్: పరారైన ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు
గౌహతి: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటూ పరారీలో ఉన్న అస్సాం ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీ నుంచి హజో చౌక్ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న గోపీనాథ్.. తన ఇంట్లో పనిచేస్తున్న 14 ఏళ్ల మైనర్ బాలికపై రేప్ చేసినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది.
దీంతో సెప్టెంబర్ 5 నుంచి కనిపించకుండా పోయిన ఎమ్మెల్యే దాస్ సరిగ్గా 28రోజుల తర్వాత పోలీసులకు చిక్కాడు. గోపీనాథ్‌తో పాటు ఈ నేరంలో భాగం పంచుకున్న అతని బావమరదులు నలుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు ఆ బాలిక తమ డబ్బు, వస్త్రాలు చోరీ చేసిందంటూ తప్పుడు ఆరోపణలు కూడా చేశారు.
బాలికతో పాటు ఆమె తల్లి నుంచి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుని, ఎమ్మెల్యే ఏ తప్పూ చెయ్యలేదన్నట్టుగా వాటిలో రాసుకుని ఆ పత్రాల ద్వారా ముందస్తు బెయిల్ కోసం గౌహతి హైకోర్టును కూడా ఆశ్రయించారు.

ఈ ఘటనపై గోపీనాథ్ స్పందిస్తూ వాహనంలో తనతో పాటు డ్రైవర్, సెక్యూరిటీ అధికారి కూడా ఉంటారని, అలాంటప్పుడు రేప్ ఎలా సాధ్యమని ప్రశ్నించాడు. సహాయకురాలు తన ఇంట్లోనే పనిచేస్తున్నందు వల్ల నిజంగా అలాంటి దురుద్దేశమే తనకు ఉంటే, ఆ పని ఇంట్లోనే చేసి ఉండేవాడినని తెలిపాడు. అస్సాంలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు జరుగుతున్నందువల్ల ప్రత్యర్థులు తనను దెబ్బతీసేందుకు రాజకీయ కుట్ర పన్నారని ఆరోపించాడు.
కాగా, ఎమ్మెల్యే నిజంగా తప్పు చెయ్యకుంటే నెలరోజులగా ఎందుకు పరారీలో ఉన్నారని వివిధ వర్గాలు నాయకులు నిలదీస్తున్నారు. ఏ ఆధారమూ లేకుండా ఆయన బావమరదులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. దాస్‌ను ఆదివారం అరెస్ట్ చేశామని, ఆయనపై లైంగిక నేరాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications