వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Asteroid impact: భూమిని గ్రహ శకలం ఢీకొడితే కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండవు. అప్పుడు మనుషులు ఏం తిని బతకాలి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గ్రహ శకలం

ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టిందని అనుకోండి. ఆ తర్వాత కొన్ని ఏళ్ల వరకు సూర్యరశ్మి భూమిని చేరుకోకుండా దట్టమైన ధూళి మేఘాలు కమ్ముకుంటాయి. దీంతో ప్రపంచం మొత్తంగా వ్యవసాయం కుప్పకూలుతుంది.

ఆ గ్రహ శకలం నేరుగా మనవైపే వస్తున్నట్లు ముందే మనకు తెలుస్తుంది. కానీ, దాని దారిని మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు.

మొదట ఆ గ్రహ శకలం ఢీకొట్టిన వెంటనే భూమిపై అగ్నికీలలు ఎగసిపడతాయి. చెరువులు, నదుల్లో చనిపోయిన చేపలు పైకి తేలుతూ కనిపిస్తాయి. చాలావరకు పశు సంపదను మన రైతులు కోల్పోతారు. కొన్ని రోజుల తర్వాత గాలి చల్ల బడుతుంది. దీనితోపాటుగా ప్రపంచం మొత్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. దీంతో పంటలు దెబ్బతింటాయి. మొత్తంగా మన ఆహార గొలుసు ఛిన్నాభిన్నం అవుతుంది.

ఈ విధ్వంసాన్ని తట్టుకొని మీరు నిలబడగలిగారు అనుకోండి. గత అనుభవాలు నేర్పిన పాఠాలతో కొత్త ఆహార వ్యవస్థలను అభివృద్ధిచేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి?

విధ్వంసం తర్వాత మనం ఎలా స్పందిస్తామో అనే ప్రశ్నను చూసి పూర్తిగా నిరాశావాదంతో మాట్లాడుతున్నారని అనుకోకూడదు. అదే సమయంలో విపత్తుల గురించి భయపెట్టే ప్రయత్నంగానూ చూడకూడదు.

నిజానికి మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే దిశగా చేసిన కసరత్తుగా దీన్ని పరిగణించాలి. అంటే కాలంలో వెనక్కి ప్రయాణించి.. ఆనాటి పరిస్థితులకు దారితీసిన అన్ని అంశాలను బెరీజు వేసుకోవడం లాంటిది. పెద్దపెద్ద కార్పొరేట్ నాయకులు, సైనిక వ్యూహకర్తలు ఇలాంటి అంశాలపై అధ్యయనం చేస్తుంటారు. ఎందుకంటే భవిష్యత్తు కోసం ఎలా సన్నద్ధం కావాలో దీని ద్వారా వారికి అవగాహన వస్తుంది.

కాబట్టి పరిస్థితులు ఎలా ఉండబోతాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఆ గ్రహశకలం ఢీకొట్టి నేటికి ఒక ఏడాది పూర్తయింది. మనం ఎలా బతికి బట్టకట్టగలిగామో చూద్దాం.

డైనోసర్

చరిత్ర నేర్పిన పాఠం

ఒక గ్రహ శకలం ఢీకొట్టినప్పుడు ఏం జరుగుతుంది? లాంటి అంశాలను తెలుసుకోవాలని అనుకున్నప్పుడు గతంలో ఇలాంటి ఘటనలను పరిశీలించాలి. దాదాపు 6.6 కోట్ల ఏళ్ల క్రితం నేటి మెక్సికో పరిసరాల్లో చిక్స్‌ల్యూబ్ గ్రహ శకలం భూమిని ఢీకొట్టింది. ఆనాడు మెక్సికో తీరంలోని ఈ భూభాగం మొత్తం ప్లాస్మాతో నిండిపోయింది. దాదాపు 2400 కి.మీ. పరిధిలో నీరు మొత్తం ఆవిరైంది. గ్రహశకలం ఢీకొట్టినప్పుడు గాల్లోకి లేచిన ధూళి ప్రపంచం మొత్తం మేఘాలుగా కమ్ముకుంది. ఆనాడు మొత్తంగా 25 ట్రిలియన్ టన్నుల ధూళి వాతావరణంలో కలిసింది. దీంతో సూర్యరశ్మి భూమిని చేరుకోవడం కష్టమైంది.

ఆ విపత్తు నుంచి చాలా డైనోసార్లు తప్పించుకోలేకపోయాయి. కానీ, గుహలు, గొయ్యిల్లో జీవించిన మన పూర్వీకుల్లాంటి క్షీరదాలు మాత్రం బతికిబట్టకట్టాయి. ఇప్పుడు మనం కూడా కొంత సమయం వరకు అలానే గుహల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, అప్పటి మనషుల ప్రాణాలు కాపాడింది జీవన శైలి మార్పులు మాత్రమే అనుకుంటే పొరపాటే. వారు తమ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకున్నారు.

భూకంపాలు, అగ్ని కీలలు, సునామీల నుంచి అప్పుడు కూడా కొన్ని డైనోసార్లు బయటపడి ఉండొచ్చు. అయితే, ఆ తర్వాత తినడానికి వాటికి ఏమీ దొరకలేదు.

కానీ, మన పూర్వీకులు మాత్రం కీటకాలు, గింజలు, తక్కువ సూర్యరశ్మిలో జీవించే మొక్కలను ఆహారంగా తీసుకుని మనుగడ సాగించారు. ఇలానే, ప్రస్తుత పక్షులకు పూర్వీకులైన చిన్న థెరోపాడ్ డైనోసార్లు కూడా బతికిబట్టకట్టాయి.

ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, మనం అత్యవసర సమయాల కోసం ముందుగానే ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని స్పష్టం అవుతోంది. ప్రచ్ఛన్న యుద్ధం పతాక స్థాయికి చేరుకున్నప్పుడు అమెరికా కాంగ్రెస్ ముందు అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈజిప్టు పిరమిడ్లలో దాదాపు 3,000ఏళ్లపాటు భద్రంగా ఉన్న ఒక రకమైన గోదుమ ''బల్గర్ వీట్’’ నిల్వలను పెంచుకోవాలని వారు ప్రతిపాదించారు. మరోవైపు కాంప్‌బెల్ సూప్ కాన్లు, జనరల్ ఫుడ్స్ టాంగ్ డ్రింక్ మిక్స్, జనరల్ మిల్స్ మల్టీపర్పస్ ఫుడ్ (ఫోర్టిఫైడ్ డీహైడ్రేటెడ్ విజిటెబుల్స్, సోయ్ గ్రిట్స్) నిల్వలను కూడా అప్పట్లో విపరీతంగా పెంచారు.

అదే సమయంలో అందరికీ దశాబ్దంపాటు సరిపోయేలా ఆహారాన్ని నిల్వచేయడంలోనూ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుత ''డ్రైడ్ ఫుడ్’’ నిల్వలతో మనం ప్రపంచం మొత్తానికి ఐదేళ్లపాటు ఆహారాన్ని అందించొచ్చని అంచనాలు ఉన్నాయి.

అయితే, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒక ఏడాదికి అవసరమైన 1.6 బిలియన్ టన్నుల చొప్పున ఆహారాన్ని ఇప్పుడు పండించేందుకు ప్రభుత్వాలు లేదా ఐరాస చర్యలు తీసుకుంటే.. వెంటనే మన మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అది కూడా ఒక విపత్తు అవుతుంది. కాబట్టి గ్రహ శకలం ఢీకొట్టిన తర్వాత ఆహారాన్ని కొత్తగా ఎలా పండించుకోవాలో మనం అన్వేషించాల్సి ఉంటుంది.

భూగర్భం

భూగర్భంలో పంటలు

జపాన్‌లోని నాగసాకి నగరంపై అమెరికా అణు బాంబు వేసినప్పుడు, సొరంగాల్లో తలదాచుకున్న ప్రజలు బతికిబట్టకట్టగలిగారు. ముఖ్యంగా గని ద్వారానికి దూరంగా ఉండేవారు అక్కడి సురక్షితంగా ఉండగలిగారు. 20ఏళ్ల అకికో టకకురా కేసును దీనికి ఉదాహరణగా చెప్పుకొచ్చు. బాంబు పడిన ప్రాంతానికి ఆమె 300 మీటర్ల పరిధిలో ఉండేటప్పటికీ బ్యాంక్ ఆఫ్ జపాన్ నాగసాకి విభాగంలో ఒక భూగర్భ సదుపాయంలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకోగలిగారు.

అంకారా, బీజింగ్, మాస్కో, మాంట్రియాల్ లాంటి ప్రాంతాల్లో భారీగా భూగర్భ సదుపాయాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా టర్కీలోని నెవసెషిర్ ప్రావిన్స్‌లో పెద్ద భూగర్భ నెట్‌వర్క్ మనకు కనిపిస్తుంది. దాదాపు 2,500ఏళ్ల క్రితమే ఇక్కడ ఇలాంటి సదుపాయాలు ఉండేవి. వీటిని బైజాంటైన్ దురాక్రమణల ముప్పు నడుమ గ్రీకులు మరింతగా విస్తరించారు.

బ్రిటన్‌లోనూ ఇలాంటి భూగర్భ సదుపాయాలు మనకు చాలా కనిపిస్తాయి. లండన్, న్యూక్యాజిల్, గ్లాస్గో, లివర్‌పూల్ ఇలా చాలా నగరాల్లో భూగర్భ సదుపాయాలు కనిపిస్తాయి. మరోవైపు నొట్టింగ్హమ్, ఎడిన్‌బరా, స్టాక్‌పోర్ట్ లాంటి నగరాల్లోని భూగర్భ రక్షణ కేంద్రాలు ఉన్నాయి.

ఈ భూగర్భ సదుపాయాలు మనషులకు ఆశ్రయం ఇవ్వగలవు. మరోవైపు వీటిని పోషకాహార పంటలు పెంచేందుకూ ఉపయోగించుకోవచ్చు. సూర్యరశ్మి లేకపోయినా, గాలి సరిగా ఆడకపోయినా సరైన విధానాలతో ఇక్కడ కూడా మనం పంటలు పండించుకోవచ్చు. ఈ దిశగా కొన్ని పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఉదాహరణకు పారిస్‌లోని ఆరు చ.కి.మీ. ప్రాంత పరిధిలో విస్తరించిన ఒక భూగర్భ సదుపాయంలో సైక్లోపోనిక్స్ సంస్థ పుట్టగొడుగులను పెంచుతోంది. మరోవైపు లండన్‌లోనూ భూగర్భ సదుపాయంలో ఈ సంస్థ కొన్ని కూరగాయలను పండిస్తోంది.

సూర్యరశ్మి పూర్తిగా లేనప్పుడు, లేదా తక్కువగా ఉండేటప్పుడు కొన్నిరకాల మొలకలు (స్ప్రౌట్స్), మైక్రోగ్రీన్స్, వైట్‌గ్రాస్, వైట్ ఆస్పర్‌జస్, రూబార్బ్, పుట్టగొడుగులు లాంటి మొక్కలను పండించుకోవచ్చు. స్ప్రౌట్స్ నుంచి విటమిన్లు, కొవ్వులు, ఫైబర్లు మన శరీరానికి అందుతాయి. మైక్రోగ్రీన్లు కూడా అంతే, వీటి నుంచి కారం, చేదు, తీపి లాంటి రుచులను మనం ఆస్వాదించొచ్చు.

అయితే, ఇదేమీ శాశ్వత పరిష్కారం కాదు. భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి.

పుట్టగొడుగు

భోజనం ఎలా?

ఇప్పటికి గ్రహ శకలం ఢీకొని వారం రోజులు గడిచాయి. భూగర్భ సదుపాయం నుంచి బయటకు వచ్చి చూస్తే, గుర్తుపట్టలేనంతగా పరిస్థితులు మారిపోతాయి. పచ్చగా ఉండే ప్రాంతాలన్నీ ఎండిపోవడం కనిపిస్తుంది. చుట్టుపక్కల వాతావరణంలో ధూళి దట్టంగా కనిపిస్తుంది. మనం అప్పుడే ఇతర భూగర్భ కేంద్రాల్లోని తలదాచుకున్న ప్రజలతో కలవాల్సి ఉంటుంది. ఆహారం సరఫరాపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

పుట్ట గొడుగుల్లో క్లోరోప్లాస్ట్‌లు ఉండవు. ఈ క్లోరోప్లాస్ట్‌లు కార్బన్ డైఆక్సైడ్‌ను గ్లూకోజ్‌గా మారుస్తుంటాయి. ఇవి లేకపోవడం వల్ల పెద్దగా ఈ మొక్కలకు సూర్యరశ్మి అవసరం లేదు. కొంచెం వేడి, గాలిలో తేమ, సేంద్రీయ పదార్థం ఉంటే సరిపోతుంది. గ్రహశకలం ఢీకొట్టిన తర్వాత పరిస్థితుల్లోనూ వీటిని పెంచుకోవచ్చు.

అయితే, పుట్టగొడుగుల నుంచి మనకు క్యాలరీలు పెద్దమొత్తంలో అందవు. అదే సమయంలో చాలా పుట్టగొడుగులు విషపూరితమైనవి కూడా. మనుషులకు హానిచేసే చాలా విష పదార్థాలను ఇవి ఉత్పత్తి చేస్తుంటాయి. అయితే, వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన భూగర్భ కేంద్రాల్లో, సొరంగాల్లో పెంచుకోవచ్చు.

సంతులిత ఆహారాన్ని మనం తీసుకోవడం కొంచెం కష్టమే. అయితే, ఇది అసాధ్యం మాత్రం కాదు. మరోవైపు ఆ విపత్తు నుంచి బయటపడిన జింకలు, పశువులు, మేకలు, కోళ్లు లాంటి వాటిని మనం ఆహారంగా తీసుకోవచ్చు.

మనకు అవసరమైన విటమిన్లు ఈ, ఏ, బీ12 లాంటి వాటిని పారిశ్రామికంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే, విటమిన్ కే లేదా డీ లను పొందడం కొంచెం కష్టమే. ప్రస్తుతం విటమిన్ డీలను గొర్రె జుట్టు నుంచి పొందే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు పోషకాలను పువ్వులు, ఆకులు, చెట్లలోని భిన్న భాగాల నుంచి పొందొచ్చు. ఉదాహరణకు ''పైన్ నీడిల్ టీ’’ మొక్కలను తీసుకోండి. వీటి నుంచి నారింజ పళ్ల కంటే ఎక్కువ మొత్తంలో విటమిన్ సీ దొరుకుతుంది. అలానే ''నెటెల్ టీ’’లో విటమిన్ ఏ, సీ, కే లభిస్తాయి. డండెలియన్ టీ నుంచి పొటాషియం లభిస్తుంది.

అణు దాడులపై అధ్యయనానికి సిద్ధంచేసిన కంప్యూటర్ మోడల్స్‌తో గ్రహ శకల దాడుల పరిస్థితులను అంచనా వేయొచ్చు. ముఖ్యంగా భూమధ్య రేఖ వద్ద సగటు కంటే 40 శాతం తక్కువగా సూర్యరశ్మి వచ్చే అవకాశముందని, అందే ధ్రువాల దగ్గర అయితే, ఇది ఐదు శాతానికి పడిపోతుందని అంచనాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను తట్టుకొని బీట్‌రూట్‌లు మనుగడ సాగించగలవు. మరోవైపు క్యారెట్, క్యాబేజీ, బంగాళా దుంపలు, కొన్ని రకాల బీన్స్‌ను కూడా కొన్నిచోట్ల పండించుకునే అవకాశం ఉండొచ్చు.

బంగాళా దుంపలు, గోదుమ, బార్లీ, వరి, మొక్కజొన్న, సోయా లాంటి పంటలను మాత్రం ఉష్ణమండల ప్రాంతాల్లో పండించేందుకు ప్రయత్నించొచ్చు. అక్కడే మనకు కర్ర పెండలం, పాలకూర లాంటివి కూడా పండించుకోవచ్చు. దీని కోసం మనం పెద్ద గ్రీన్‌హౌస్‌లను నిర్మించాల్సి ఉంటుంది. కర్రలు, పాలిమర్ ఫిల్మ్, గులకరాళ్లతో వీటిని నిర్మించుకోవచ్చు.

నాచు

ఆ తర్వాత..

నేడు నదులు, చెరువుల్లో పెద్దయెత్తున నాచు కనిపిస్తుంటుంది. అయితే, దీన్నే మనం విపత్తుల సమయంలో అవకాశంగా మలచుకోవాలి. ముఖ్యంగా క్లోరెల్లా, నానోక్లోరోప్సిస్, ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు అమ్లాలను వీటి నుంచి మనం పొందొచ్చు. పైగా ఇవి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. చిక్స్‌ల్యూబ్ గ్రహశకలం ఢీకొట్టిన తర్వాత అక్కడ ఫైటోప్లాంక్టన్లు మళ్లీ త్వరగానే వచ్చినట్లు ఒక పరిశోధన పత్రం వెల్లడించింది.

ముఖ్యంగా మూతపడిన స్విమ్మింగ్ పూల్స్, ట్యాంకులు, చెరువులు, నదుల్లో మనం నాచు మొక్కలను పెంచుకోవచ్చు. వీటి ద్వారా మనకు అవసరమైన పోషకాలను పొందే వీలుంటుంది. వ్యవసాయ భూముల నుంచి వచ్చే నీటిలోని ఎరువుల వల్ల నాచు పెరుగుతుందని అందరికీ తెలిసిందే. అయితే, వేలకొద్దీ నాచుల్లో కొన్ని మనుషులు, జంతువులకు హానిచేస్తాయి. అయితే, భవిష్యత్‌లో వీటిని మన అవసరానికి తగినట్లుగా ఉపయోగించుకొనే విధానాలు మనకు అందుబాటులోకి రావొచ్చు.

మరోవైపు పెట్రోలియం, నాచురల్ గ్యాస్, సీవో2, మొక్కల్లోని తినడానికి ఉపయోగపడని భాగాల నుంచి మనం కృత్రిమ ప్రోటీన్లు, గ్లూకోజ్, కొవ్వులను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ మూడు మనకు కావాల్సిన మైక్రోన్యూట్రియంట్లు. గత ఏడాడి సీవో2 నుంచి గ్లూకోజ్ ఉత్పత్తి చేయగలిగే విధానాన్ని అభివృద్ధి చేసిన ముగ్గురు పరిశోధకులకు నాసా అవార్డులు అందించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ఈ విధానాలు తోడ్పడే అవకాశముంది.

యుద్ధాలు, ఆర్థిక సంక్షోభం లాంటి సమయాల్లో ప్రజలకు అత్యవసరమైన సేవలవైపు మన వనరులను మళ్లిస్తారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాలో 66 శాతం ఆటోమొబైల్స్ కేవలం విమానాల ఉత్పత్తిపైనే దృష్టిసారించాయి. 2020లో కోవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పుడు కూడా చాలా సంస్థలు ఇలానే వైద్యపరమైన ఉత్పత్తులు తయారుచేయడంపై దృష్టిసారించాయి.

ఇలానే బ్రిటన్‌లోని చాలా బయోఫ్యూల్ రిఫైనరీలు, పేపర్‌ మిల్స్‌లను మనం ఆహారంగా తీసుకునే షుగర్లను బయోమాస్ నుంచి ఉత్పత్తి చేయించడంపై దృష్టి సారించేలా చేయొచ్చు. ఈ పనికి పేపర్ మిల్స్ సరిగ్గా సరిపోతాయని ఒక పరిశోధన పత్రం ఇటీవల వెల్లడించింది.

హైడ్రోకార్బన్లను వ్యాక్స్‌లు, జీర్ణం కాగలిగే కొవ్వులుగా మనం మార్చుకోవచ్చు. ఇలా చేయడం ఇదేమీ తొలిసారి కాదు. 1910లో రసాయన శాస్త్రవేత్త ఆర్థర్ఓ ఇమాహుసేన్ ''పారాఫిన్ అయోడేషన్’’ పద్ధతిలో బొగ్గు నుంచి బటర్‌ను ఉత్పత్తి చేశారు. ముఖ్యంగా జర్మనీలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో ఆయన ఈ విధానాన్ని ఆవిష్కరించారు.

చైనాలోని చాంగ్‌కింగ్‌లో ఒక కొత్త కర్మాగారం కూడా బ్యాక్టీరియా నుంచి 20,000 టన్నుల ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయగలిగింది. ఈ ప్రోటీన్‌ ఉత్పత్తికి కేవలం మీథేన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఉంటే చాలు. దీన్ని మనం చేపలకు ఆహారంగా పెట్టొచ్చు. దీనిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా మనుషులు కూడా ఆహారంగా తీసుకోవచ్చు.

బహుశా ఇది అంత రుచికరంగా అనిపించకపోవచ్చు. కానీ, మనుగడ సాగించేందుకు ఇది సరిపోతుంది. ఇలానే బ్రెడ్, బీర్, కిమ్చి, టెంపే, సోయా సాస్, వైన్, చీస్, సిట్రిక్ ఆమ్లం, ఇథనాల్, పెన్సిల్‌లను కూడా మనం ఉత్పత్తి చేసుకోవచ్చు.

సముద్రం

సముద్రంలో ఏం జరుగుతుంది?

గ్రహశకలం దాడి తర్వాత, సముద్రంలో ఏం అవుతుందో అంచనా వేయడం కాస్త కష్టమే. అయితే, ఆమ్ల స్థాయిలు పెరగడం, ఆహారపు గొలుసులు కుప్పకూలడం లాంటివి జరగొచ్చు.

ప్రస్తుతం మనకు సముద్రాల నుంచి వచ్చే క్యాలరీలు 2 శాతం కంటే తక్కువే ఉన్నాయి. అయితే, నౌకల్లో 22 శాతం మాత్రమే చేపల వేటకు ఉపయోగిస్తున్నారు. అవసరమైనప్పుడు యుద్ధ విమాన నౌకలు, కంటైనర్ షిప్‌లు, టగ్ బోట్లు, యాచెట్‌లు కూడా చేపల వేటకు ఉపయోగించొచ్చు.

సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పటికీ సముద్రపు నాచు ఉత్పత్తి అవుతుంది. అలానే వకామే, కెల్ప్, ఎమీ-సునోమటా లాంటి నాచులు కూడా మనకు పోషకాలు అందించగలవు.

ఆల్చిప్పల నుంచి మనకు ఐరన్ అందుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా ప్రాంతాల ప్రజలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఆ ఆల్చిప్పలను భిన్న వాతావరణ పరిస్థితుల్లో పెంచుకోవచ్చు. వీటికి వ్యాధుల ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. మరోవైపు శార్డైన్, ఆంకోవీస్ లాంటి చేపల నుంచి విటమిన్ డీ అందుతుంది. ఇవి వేగంగా తమ సంఖ్యను కూడా పెంచుకోగలవు.

భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని సముద్ర జీవుల వ్యవస్థలు మనుగడ సాగించగలవనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.

భూమిపై ఇలా..

ఇటీవల భూమివైపుగా కదులుతున్న గ్రహ శకలం డైమోర్ఫస్‌ను నాసా దిశ మార్చేలా చేసింది. మళ్లీ చెక్స్‌ల్యూబ్ పరిమాణంలోని గ్రహ శకలం భూమిని ఢీకొట్టే అవకాశం 0.000001 శాతమేనని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే, అలాంటి విపత్కర పరిస్థితులకు మనం సిద్ధం కావాల్సిన పనిలేదని అనుకోకూడదు.

ఇక్కడ గ్రహశకలాలు మాత్రమే మనకు పొంచివున్న ముప్పుగా పరిగణించకూడదు. వాతావరణ మార్పులు, బయో-టెర్రర్, సూక్ష్మ జీవులు, సూపర్ వోల్కనోలు ఇలా చాలా ముప్పులు మనల్ని వెంటాడుతున్నాయి.

భవిష్యత్‌లో మనం వ్యవసాయం చేసే విధానాలు పూర్తిగా మారిపోవచ్చు. ఇక్కడ కేవలం గ్రహ శకలం ఢీకొనడం అనే పరిణామాన్ని ఉదాహరణగా తీసుకొని పరిస్థితులు ఎలా మారొచ్చో వివరించాను. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి పరిస్థితులకైనా మనం సిద్ధంగా ఉండాలి.

(ఫుడ్ రీసెర్చ్ ప్లాట్‌ఫార్మ్ ''బ్లాక్ అల్మనాక్’’ వ్యవస్థాపకుల్లో ఫిలిప్ మాఘన్ ఒకరు. ఆయన రచయిత, పరిశోధకులు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Asteroid impact: If the Earth is hit by an asteroid, crops will not grow for a few years. Then what should people eat and live?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X