Delhi Election Results 2025: కల్కాజీ నుంచి ఢిల్లీ సీఎం అతిషి విజయం
Delhi Election Results 2025: దేశంలో ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అతిషి తని కల్కాజీ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రమేష్ బిధూరిని 900కు పైగా ఓట్లతో ఓడించారు. మొదటి నుంచి వెనుకంజలో ఉన్న అతిషి.. చివరి రౌండ్ లో పుంజుకుని విజయం సాధించారు. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఇతర ప్రముఖులు తమ తమ స్థానాల్లో బీజేపీ చేతిలో ఓడిపోయినా ఆమె విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అల్కా లాంబా మూడో స్థానంలో నిలిచారు.
ప్రతిష్ఠాత్మకమైన న్యూఢిల్లీ స్థానంలో పర్వేశ్ వర్మ చేతిలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోగా.. మనీష్ సిసోడియాను జంగ్ పురా నియోజకవర్గంలో బీజేపీకి చెందిన తర్విందర్ సింగ్ మార్వా ఓడించారు. మరోవైపు సౌరభ్ భరద్వాజ్ కూడా గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. దుర్గేష్ పాఠక్ రాజిందర్ నగర్ నుంచి, సోమనాథ్ భారతి, మాల్వియా నగర్ నుంచి, సత్యేంద్ర జైన్ షకుర్ బస్తీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

అతిషి మీడియాతో మాట్లాడుతూ.. ఆప్ ఓటమి పార్టీకి ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు కల్కాజీ ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. బాహుబలికి వ్యతిరేకంగా పనిచేసిన తమ బృందాన్ని తాము అభినందిస్తామన్నారు. ప్రజల ఆదేశాన్ని అంగీకరిస్తున్నామని.. తాను గెలిచానని, కానీ ఇది వేడుకలు జరుపుకునే సమయం కాదన్నారు. బీజేపీ నియంతృత్వం, గూండాయిజానికి వ్యతిరేకంగా యుద్ధం కొనసాగిస్తామని ఆమె అన్నారు. ఎన్నికలకు ముందు అతిషి, రమేష్ బిధూరి మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. మూడు సార్లు ఢిల్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేష్ బిధూరి.. అతిషి ఇంటి పేరు గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యం తీవ్ర దుమారం రేపింది. బిధూరి వ్యాఖ్యలకు స్పందించిన అతిషి.. బీజేపీ నాయకుడు తన తండ్రిని దూషించడం ద్వారా ఓట్లు కోరుతున్నారని విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications