వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మనిర్భర్ భారత్: మోదీ చెప్పిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌ ఏమయింది, నిధులు ఎవరికి చేరాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణాంకాలలో స్వల్ప మెరుగుదల కనిపించింది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి, సుమారు 8శాతం క్షీణతను అంచనా వేయగా, ఇది 7.3 శాతం దగ్గర ఆగిపోయింది. అదే సమయంలో నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటును 1.3 శాతంగా అంచనా వేయగా, అది 1.6 శాతం నమోదైంది.

కానీ, ఈ గణాంకాల ఆధారంగా ఎకానమీ కోలుకుని, పరుగులు పెట్టే పరిస్థితి అయితే కనిపించడం లేదు.

దేశ ఆర్ధిక వ్యవస్థ ఏ స్థితిలో ఉంది, దానికి ఎలాంటి చికిత్స కావాలనేది అంచనా వేయడానికి నాలుగు కొలమానాలు ఉన్నాయి. ఒకటి జీడీపీ, రెండోది నిరుద్యోగిత రేటు, మూడోది ద్రవ్యోల్బణం, నాలుగోది ప్రజలు ఖర్చు చేసే సామర్ధ్యం.

ఈ నాలుగు కొలమానాల ఆధారంగా చూసినప్పుడు గత ఏడాదికీ, ఇప్పటికీ భారత ఆర్ధిక వ్యవస్థలో పెద్దగా మార్పు లేదు.

ఎకానమీకి చికిత్స చేసేందుకు మోదీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది కానీ, విజయవంతం కాలేదు. కాబట్టి పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యం.

కరోనా మొదటి వేవ్‌లో భారత ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టడానికి మోదీ ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించింది.

సోమవారం విడుదలైన ఆర్ధిక శాఖ గణాంకాలు జనవరి నుంచి మార్చి మధ్య కాలం నాటివి. కరోనా ప్రభావం పోయిందని ప్రజలు నిర్భయంగా రోడ్ల మీదకు వస్తున్న సమయం అది.

కరోనాను పారదోలామని ప్రభుత్వం అప్పటికే ప్రకటనలు చేసింది. అన్ని ఆర్ధిక కార్యకలాపాలపై ఆంక్షలు ఎత్తివేశారు.

అలాంటి పరిస్థితుల్లో, మోదీ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థకు ఇచ్చిన రూ.20 లక్షల కోట్ల మెగా బూస్టర్ వ్యాక్సీన్ ప్రభావం ఎంత అన్న ప్రశ్న వచ్చినప్పుడు పెద్దగా లేదు అన్న సమాధానం వస్తుంది.

మరి ప్రభుత్వం ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజ్ ఏమయింది...ఆ నిధులు ఎటు వెళ్లాయి, ప్రభుత్వం తాను ప్రకటించినట్లు ఖర్చు చేయగలిగిందా? చేస్తే వాటి ప్రభావం ఎంత?

రూ.20 లక్షల కోట్ల ఖాతా

  • 26 మార్చి 2020 - భారతదేశంలో పూర్తి లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ప్రకటించారు. కార్మికులు, పూట గడవడానికి కనీస సదుపాయాలు లేని పేదలకు ఈ పథకం ద్వారా రూ. 1.92లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక ప్రకటించారు.
  • 13 మే 2020 - మొదట రూ. 5.94 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇది చిన్న వ్యాపారాలను దృష్టిలో పెట్టుకుని సిద్దం చేసిన ప్రణాళిక. బ్యాంకింగ్ రహిత ఆర్థిక సంస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థలకు సాయం అందించడం దీని లక్ష్యం.
  • 14 మే 2020 - ఈ రోజున 3.10 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.
  • 15 మే 2020 - 1.5 లక్షల కోట్ల రూపాయల నిధులను వ్యవసాయం కోసం ప్రకటించారు.
  • 16 మే మరియు 17 మే, 2020 - నాలుగో రోజు, ఐదో రోజులలో నిర్మాణాత్మక సంస్కరణల కోసం రూ.48,100 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. బొగ్గు రంగానికి సంస్కరణ చర్యలు, మైనింగ్, ఏవియేషన్, స్పేస్ సైన్స్, విద్య, ఉపాధి, వ్యాపారాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సహాయక చర్యలు ఇందులో ఉన్నాయి.

దీనితో పాటు రాష్ట్రాలకు అదనపు సహాయం కూడా ప్రకటించారు. అదే సమయంలో, రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా రూ.8,01,603 కోట్ల సాయాన్ని ప్రకటించింది. దాన్ని కూడా ప్యాకేజీగానే పరిగణించారు.

పైన పేర్కొన్న అన్ని ప్యాకేజీలను కలపడం ద్వారా తాము రూ.20 లక్షల కోట్ల రిలీఫ్‌ ప్యాకేజీని ప్రకటించామని ప్రభుత్వం పేర్కొంది.

కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో అసలు రిలీఫ్ కలిగించే మొత్తం కేవలం రూ.4-5 లక్షల కోట్లు మాత్రమేనని ఆర్ధిక వేత్త సుభాష్ చంద్ర గార్గ్ అభిప్రాయపడ్డారు.

ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారు?

ఇవన్నీ ప్రకటనలే. కానీ గ్రౌండ్‌లో ఎంత ఖర్చు చేశారు? ఇది తెలుసుకోవాలని కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్‌తో బీబీసీ మాట్లాడింది. ఆయన అభిప్రాయం ప్రకారం ప్రకటించిన దానిలో వాస్తవానికి 10 శాతం కూడా ఖర్చు కాలేదు.

''ఆర్బీఐ ప్రకటించిన 8 లక్షల కోట్ల రూపాయల లిక్విడిటీని ప్యాకేజీలో చేర్చకూడదు. లిక్విడిటీని ఆర్బీఐ ఆఫర్ చేసింది. కానీ బ్యాంకులు వాటిని స్వీకరించలేదు.'' అన్నారు గార్గ్.

కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో అసలు రిలీఫ్ కలిగించే మొత్తం కేవలం రూ.4-5 లక్షల కోట్లు మాత్రమేనని గార్గ్ అభిప్రాయపడ్డారు.

ఇందులో ప్రభుత్వం రూ.1 నుంచి 1.5 లక్షల కోట్లను ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీ కింద వలస కార్మికుల కోసం ఖర్చు చేసింది. ఇవి కాకుండా మరికొన్ని చిన్న ఖర్చులు కలిపి రూ.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేయలేదని గార్గ్ అన్నారు.

భారత ప్రభుత్వ మాజీ చీఫ్ స్టాటిస్టిషియన్ ప్రణబ్ సేన్ కూడా సుభాష్ చంద్ర గార్గ్‌తో కొంత వరకు అంగీకరించారు.

రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే మొత్తం రూ.15 లక్షల కోట్ల వరకు ఉందని ప్రణబ్ సేన్ అభిప్రాయపడ్డారు.

దీనివల్ల మూసివేత అంచున ఉన్న చిన్నా, పెద్ద తరహా పరిశ్రమలు ఆ స్థితి నుంచి బైటపడ్డాయి. లాక్‌డౌన్ తొలగించిన తర్వాత అక్కడ పనులు ప్రారంభమవుతాయి. ఈ విషయంలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ఆర్థిక వ్యవస్థకు సహాయపడింది.

ప్రభుత్వం కేవలం రూ.5 లక్షల కోట్ల వరకే ఖర్చు చేయాల్సి వచ్చింది. అందులో 2-3 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం పేదలకు, గ్రామీణ ఉపాధి స్కీములోని వారికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కోసం ఖర్చు చేసింది.

''రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అనగానే మార్కెట్లోకి అంత మొత్తం వచ్చి పడుతుందనుకున్నారు. కానీ, అది భ్రమ. వాస్తవానికి 2.5-3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే మార్కెట్‌లోకి వచ్చాయి'' అన్నారు ప్రణవ్‌ సేన్.

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద మోదీ ప్రభుత్వం 42 కోట్ల పేదల కోసం 68 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్

కేంద్ర ప్రభుత్వం 2020 సెప్టెంబర్‌లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ యోజన కింద 42 కోట్ల మంది పేద ప్రజల కోసం 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పేర్కొంది.

ప్రభుత్వం జన్‌ధన్‌ ఖాతాలలో వేసిన మొత్తంలో పీఎం కిసాన్‌ యోజన, గ్రామీణ ఉపాధి హామీ, ప్రధాన మంత్రి గరిబ్ అన్న కళ్యాణ్ యోజనల ద్వారా వచ్చే సొమ్మును కూడా కలిపి చూపించింది.

కరోనా సెకండ్‌ వేవ్‌లో 80 కోట్ల మంది పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తున్నామని, దీని కోసం రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తామని కేంద్రం ప్రకటించింది.

''ఆహార ధాన్యాలు ఉచితంగా ఇవ్వడం మంచిదే. పేదల డబ్బు ఆదా అవుతుంది. ఆ మొత్తం వేరే అవసరాలకు ఉపయోగించుకుంటారు. మరో రూపంలో అది మార్కెట్‌లోకి వస్తుంది'' అన్నారు ప్రణబ్ సేన్.

ప్రభుత్వ పథకం వల్ల చిన్న వ్యాపారులకు ఎంత ప్రయోజనం కలిగిందో తెలుసుకోవడానికి అఖిల భారత వ్యాపారుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్‌తో బీబీసీ మాట్లాడింది.

''కష్ట సమయంలో కూడా వ్యాపారులు సప్లై చైన్‌ను కొనసాగించారు. కానీ, వారికి రిలీఫ్ ప్యాకేజ్ వల్ల పెద్దగా ప్రయోజనం లభించ లేదు.'' అన్నారాయన.

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్

సుభాష్ చంద్ర గార్గ్, ప్రణబ్ సేన్, ప్రవీణ్ ఖండేల్వాల్‌ల అభిప్రాయాలను ఆర్టీఐ నుంచి వచ్చిన సమాచారం కూడా ధృవీకరించింది.

పుణెకు చెందిన వ్యాపారవేత్త ప్రఫుల్లా సర్దా ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రకటించిన ప్యాకేజీలోని ఖర్చుల వివరాలను అందించాలని గత ఏడాది డిసెంబర్‌లో రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం కింద కోరారు.

అయితే, ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్ గ్యారెంటీ స్కీమ్ కోసం రూ.3 లక్షల కోట్లు కేటాయించామని, కానీ అందులో రూ.1.2 లక్షల కోట్లు మాత్రమే రుణంగా ఇచ్చామని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

''ఇదంతా మాయ. దీనివల్ల ఎవరికీ ఏమీ లభించలేదు'' అని ప్రఫుల్ల సర్దా బీబీసీతో అన్నారు.

ఆత్మ నిర్భర్‌ భారత్ కింద ఏ రంగంలో ఎంత ఖర్చు చేశారు అన్న దానిపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదాయపు పన్ను రీఫండ్‌ను కూడా ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ప్యాకేజీ ప్రకటించిన ఆరు నెలల తరువాత కూడా అనేక పథకాలకు సంబంధించి నియమాలను రూపొందించ లేదు. నిర్మాణాత్మక సంస్కరణలకు ఎక్కువ మొత్తం కేటాయించారు. ఇది కార్మికులకు, ఇతర చిన్న వ్యాపారులకు పెద్దగా ఉపయోగపడలేదని నిపుణులు అంటున్నారు.

కార్మికులు, చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

పరిష్కారం ఏమిటి?

''ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ఇలాంటి ప్యాకేజీలు మంచివే. ప్రజల చేతుల్లోకి డబ్బు చేరుతుంది. కానీ, విద్యుత్ సంస్థలకు నిధులు కేటాయించడం వల్ల ఉపయోగం లేదు. వ్యాపారులు, కార్మికులు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి వారి కోసం నిధులు ఖర్చు చేస్తే, వారు వాటిని ఖర్చు చేసి ఆర్ధిక వ్యవస్థకు ఊతమిస్తారు. అదే అసలైన రిలీఫ్ ప్యాకేజ్'' అన్నారు సుభాష్ చంద్ర గార్గ్.

కరోనా సెకండ్‌ వేవ్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ లేదు. కాబట్టి, సమస్య పెద్దగా లేదు. కానీ కార్మికులు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఇప్పటికీ రిలీఫ్‌ ప్యాకేజీ అవసరం అంటున్నారు ఆర్ధిక నిపుణులు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Atmanirbhar Bharat: where is the 20 lakh crore package announced by Modi and to where did the funds go
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X