అట్టుడికిన నాగ్‌పూర్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్.. అట్టుడుకుతోంది. అల్లర్లతో అతలాకుతలమౌతోంది. అర్ధరాత్రి వరకు దాడులు- ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దాదాపు 40 మంది వరకు గాయపడ్డారు. వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాడులు సాగించిన వారిలో 65 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ స్థాయి ప్రధాన కార్యాలయం కొనసాగుతోన్న నాగ్‌పూర్‌లో- మొఘల్ రాజు ఔరంగజేబ్ సమాధిని తొలగించాలనే డిమాండ్‌తో ఆందోళనలు చెలరేగాయి. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు ఈ నిరసన ప్రదర్శనలకు సారథ్యం వహించారు.

శంభాజీనగర్‌లో ఉంటుంది ఔరంగజేబ్ సమాధి. దీన్ని తొలగించాలనే డిమాండ్ కొంతకాలంగా మహారాష్ట్రలో వినిపిస్తూ వస్తోంది. ఇటీవలే విడుదలైన ఛావా సినిమా దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇందులో ఛత్రపతి శంభాజీ మహరాజ్‌ను ఔరంగజేబ్ ఎలా చిత్రహింసలు పెట్టి చంపారో కళ్లకు కట్టినట్టుగా చూపించారు.
అంతటి క్రూరుడైన ఔరంగజేబ్ సమాధి అవసరం లేదంటూ భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ మద్దతుదారులు, సానుభూతిపరులు డిమాండ్ చేస్తూ వస్తోన్నారు. ఇది కాస్త- సోమవారం రాత్రి పతాక స్థాయికి చేరుకుంది. అల్లర్లకు దారి తీసింది. దాడులు- ప్రతిదాడులకు కారణమైంది.
తొలుత నాగ్‌పూర్‌లో భజరంగ్ దళ్, వీహెచ్‌వీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. రాత్రి 9 గంటల వరకు ఇది కొనసాగింది. ఈ సందర్భంగా మహల్ ఏరియాలో రాళ్లు రువ్విన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని బైక్‌లు ధ్వంసం అయ్యాయి. దీనికి కారణమైన 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఆ రాత్రి 11 గంటల సమయంలో హసన్‌పురి ప్రాంతంలో మళ్లీ దాడులు జరిగాయి. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. కార్లు, స్కూటర్లు, బైక్‌లు, ఆటోలు.. ఇలా ఇష్టానుసారంగా కనిపించిన వాహనాలను కనిపించినట్టే తగులబెట్టారు. వాటి అద్దాలను పగులగొట్టారు.
దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నాగ్‌పూర్ పోలీసులు కర్ఫ్యూ విధించారు. కొత్వాలి, గణేష్‌పేట్, లకడ్‌గంజ్, పఛ్‌పవోలి, శాంతినగర్, సకర్‌దారా, నందన్‌వన్, ఇమామ్‌వాడా, యశోధర నగర్, కపిల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ఫ్యూ విధించారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 163 కింద పలు ఆంక్షలను విధించారు.
తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ సింఘాల్ తెలిపారు. ఈ సమయంలో ప్రజలు గుంపులుగా తిరగడం, నిరసన ప్రదర్శనలను నిర్వహించకూడదని ఆదేశించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications