కీలక ఆదేశాలను జారీ చేసి కేంద్ర ప్రభుత్వం..!!
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన పుణ్యస్థలంలో అపురూపమైన రామమందిరం నిర్మితమైంది.
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య సిద్ధమైంది. అయోధ్యాపురి మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలన్నింటినీ కూడా విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.

ఈ పరిస్థితుల్లో- కేంద్ర ప్రభుత్వం మీడియా సంస్థలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలకు సంబంధించిన ఎలాంటి దుష్ప్రచారాన్ని విశ్వసించవద్దని, వాటిని ప్రమోట్ చేయవద్దని సూచించింది. అయోధ్య రామమందిరంతో ముడిపడి ఉన్న ఎలాంటి నకిలీ వార్తలను వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పోస్ట్ చేయొద్దని పేర్కొంది.
అధికారికంగా నిర్ధారించని, రెచ్చగొట్టడం, నకిలీ వార్తలు గానీ, మెసేజీలు గానీ ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పోస్ట్ అవుతున్న విషయం సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చాయని, అలాంటి వాటిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది. మత సామరస్యానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కంటెంట్ ఉన్న వార్తలను ప్రచురించవద్దని స్పష్టం చేసింది కేంద్రం.
ఇలాంటి తప్పుడు, నకిలీ, తారుమారు చేసే వార్తలను ప్రచురించడం, ప్రసారం చేయడం మానుకోవాలని వార్తాపత్రికలు, టెలివిజన్ న్యూస్ ఛానెల్లు, డిజిటల్ న్యూస్ అవుట్‌లెట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సూచించింది. మత సామరస్యానికి భంగం కలిగించే వార్తలను ప్రసారం చేయకుండా అడ్డుకోవాల్సిన నైతిక బాధ్యత మీడియా సంస్థలపై ఉందని కేంద్రం గుర్తు చేసింది.
వార్తలను ప్రసారం చే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అటువంటి స్వభావం గల సమాచారాన్ని హోస్ట్ చేయకుండా, ప్రదర్శించకుండా లేదా ప్రచురించకుండా సహేతుకమైన ప్రయత్నాలు చేయాలని సూచించింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్-1995 కింద ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలు, ప్రెస్ కౌన్సిల్ యాక్ట్- 1978 ప్రకారం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించొద్దని కోరింది.
ఆయా చట్టాల్లోని అంశాలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్- 2021లో కూడా పొందుపరిచామని గుర్తు చేసింది. మత ఘర్షణలకు సంబంధించిన విజువల్స్, రెచ్చగొట్టే పదజాలం, ఒక మతానికి మద్దతు పలికేలా లేదా రెచ్చగొట్టే వైఖరిని ప్రోత్సహించడం.. నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.












Click it and Unblock the Notifications