అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు: ఎప్పుడంటే?
లక్నో: అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభోత్సవం జరగనుందని రామందిరం ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఈ వేడుకకు ఆహ్వానించనున్నారు.
'రామజన్మ భూమి ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో నిర్వహిస్తాం. జనవరి 21 నుంచి 23 వరకు కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రారంభోత్సవానికి ఆహ్వనిస్తాం. సాధువులు, ప్రముఖులను కూడా ఈ వేడుకలకు ఆహ్వానిస్తాం' అని రామమందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.

రామమందిరం ప్రారంభోత్సవంలోని ప్రధాన ఘట్టాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామన్నారు. వివిధ పార్టీల రాజకీయ నేతలను ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎలాంటి వేదిక, బహిరంగ సభ ఉండదని స్పష్టం చేశారు. ఈ వేడుకకు 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల మంది హిందూ మత పెద్దలను ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. ఆ జాబితా సిద్ధమైన తర్వాత ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నిత్య గోపాల్ దాస్ సంతకంతో వారికి ఆహ్వాన పత్రాలు పంపిస్తామని చెప్పారు.
"అయోధ్యలోని పెద్ద మఠాలలో ప్రముఖ సాధువులందరికీ వసతి కల్పించాలని ట్రస్ట్ ప్లాన్ చేసింది" అని రాయ్ చెప్పారు. ఈ 25,000 మంది సాధువులు, 10,000 మంది "ప్రత్యేక అతిధులు".. రామజన్మభూమి ఆవరణలో జరిగే పవిత్రోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.
కోవిడ్-19 మార్గదర్శకాల కారణంగా ఆలయ భూమి పూజ కార్యక్రమం ఆగస్టు 5, 2020న చాలా పరిమిత స్థాయిలో జరిగింది. ప్రస్తుతం "రాంలాలా గర్భగుడి ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడు జనవరి నెలలో 'ప్రాణ్ ప్రతిష్ఠ' గ్రాండ్ ఈవెంట్ కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి" అని ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు.
అయోధ్యలో జరిగే పవిత్రాభిషేక మహోత్సవానికి వచ్చే భక్తులకు దాదాపు నెల రోజుల పాటు ఉచితంగా భోజనం అందించాలని ట్రస్టు యోచిస్తోంది. రాయ్ చెప్పిన ప్రకారం.. ట్రస్ట్ జనవరి నెల మొత్తంలో ప్రతిరోజూ 75,000-1,00,000 మందికి ఆహారం అందిస్తుంది.












Click it and Unblock the Notifications