టీవీ న్యూస్ చానెళ్ల బ్యాన్: కేంద్రం నోటీసు పూర్తి పాఠం
హైదరాబాద్: తెలంగాణలో టీవీ9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ చానెళ్ల ప్రసారాలను నిలిపేయడంపై కేంద్రం, ట్రాయ్ ఎంఎస్‌వోలకు నోటీసులు జారీ చేశాయి. ఈ నోటీసుల పూర్తి పాఠాలు చదవండి.
కేబుల్ ఆపరేటర్లకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ
డైరెక్టర్ (డాస్) కేఎస్ రెజిమోన్ సంతకంతో జారీ
చేసిన షోకాజ్ నోటీసు ఇదీ!
సంబంధిత టీవీ చానళ్లకు కానీ, చందాదారులకు గానీ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా జూన్ 16 నుంచి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్లను మీరు నిలిపి వేసినట్లు మా మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది.
డాస్ ప్రాంతాల కోసం ట్రాయ్ 2012లో జారీ చేసిన నిబంధనల ప్రకారం.. చందాదారులకు 15 రోజుల ముందు నోటీసు ఇవ్వకుండా ఏ ఎంఎస్‌వో ఒక చానెల్‌ను నిలిపివేయకూడదు. సదరు నోటీసును స్థానిక వార్తా పత్రికల్లోనూ, టీవీ స్ర్కోలింగ్‌ల ద్వారా ముందుగా తెలపాలి.

నాన్ డాస్ ప్రాంతాల కోసం 2009లో బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సర్వీసెస్ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. చందాదారులకు కనీసం మూడు వారాల నోటీసు ఇవ్వకుండా కేబుల్ ఆపరేటర్ కానీ, మల్టీ సిస్టమ్ ఆపరేటర్ కానీ ఏ చానెల్‌ను ప్రసారం చేయకుండా నిలిపి వేయకూడదు. నిలిపి వేస్తే, అందుకు కారణాలు తెలపాలి. ఈ నోటీసును చందాదారులకు తగిన పద్ధతిలో తెలియజేయాలి.
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్స్, 1994, ఆ తర్వాత జరిగిన సవరణల ప్రకారం కేబుల్ ఆపరేటర్‌గా, ఎంఎస్‌ఓగా నమోదైన ప్రతి వ్యక్తీ, అథారిటీ జారీ చేసిన నిబంధనలు, ఆదేశాలు, ఉత్తర్వులు, మార్గదర్శక సూత్రాలను తప్పకుండా పాటించాలి.
ఎలాంటి నోటీసు ఇవ్వకుండా చానళ్ల ప్రసారాన్ని నిలిపి వేయడం అంటే కేబుల్ ఆపరేటర్లు, లేదా మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రెగ్యులేషన్ చట్టంలోని సబ్ రూల్ 16 ప్రకారం శిక్షార్హులు.
కనుక జూన్ 16 నుంచి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్లను ఎలాంటి నోటీసు లేకుండా పంపిణీ చేయకుండా నిలిపి వేసినందుకు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో కారణం చెప్పాలి. అలా నిలిపి వేయడం ట్రాయ్, కేబుల్ చట్టాలను ఉల్లంఘించినట్లే.
ఈ షోకాజ్ నోటీసు అందిన మూడు రోజుల్లోగా మీరు జవాబు ఇవ్వాలి. దానితోపాటు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (నియంత్రణ) చట్టంలోని నిబంధన 7 ప్రకారం కేబుల్ ఆపరేటర్లు తమ మెయింటినెన్స్ రిజిస్టర్ కాపీని కూడా సమర్పించాలి.
అలా చేయకపోతే ఈ విషయంలో మీరు చెప్పడానికి ఏమీ లేదని మేము భావించి, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్స్, 1994లోని సబ్ రూల్ 16 ప్రకారం మీపై చర్యలు తీసుకుంటాం.
ట్రాయ్ డిప్యూటీ అడ్వైజర్ జీఎస్ కేశ్వానీ
సంతకంతో గురువారం జారీ చేసిన నోటీసు ఇదీ!
తెలంగాణలో కేబుల్ ఆపరేటర్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 చానళ్లను జూన్ 16 నుంచి నిలిపివేసిన విషయం మా దృష్టికి వచ్చింది.
ఇలా చానళ్ల ప్రసారాలను నిలిపి వేయడానికి కారణాలు తెలుపుతూ మూడు వారాల నోటీసు ఇవ్వకుండా వాటి సిగ్నల్స్‌ను ఏ కేబుల్ ఆపరేటరూ తొలగించకూడదని ట్రాయ్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ దృష్ట్యా ట్రాయ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఈ చానళ్ల ప్రసారాలను ఎందుకు నిలిపివేశారో ఆగస్టు 11, 2014లోపు తెలపాలి.












Click it and Unblock the Notifications