పదేళ్లలో 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన బ్యాంకులు..సగం పాపం సర్కార్ దే..!
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులన్నీ కలిపి గత పదేళ్లలో ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయల రుణాల్ని మాఫీ చేసేశాయి. అంటే తమ కస్టమర్లు తీసుకున్న ఈ రుణాల్ని వివిధ కారణాలు, ఒత్తిళ్లతో అక్షరాలా 12 లక్షల కోట్లను వదులుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంట్ లో వెల్లడించింది. దేశంలో బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు ఇదే ప్రధాన కారణమన్న చర్చ జరుగుతున్న వేళ కేంద్రం స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక అంటే గత పదేళ్లలో బ్యాంకులు మాఫీ చేసిన రుణాలపై పార్లమెంట్ లో ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. ఇందులో ఆయన ఆర్బీఐ సమాచారం మేరకు గత పదేళ్లలో అన్ని బ్యాంకులు కలిపి 12 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేశాయని తెలిపారు. ఇందులో గత ఐదేళ్లలోనే ప్రభుత్వ బ్యాంకులు అందులో సగం మొత్తం అంటే 6 లక్షల కోట్లను మాఫీ చేసినట్లు వెల్లడించారు.

ప్రభుత్వ బ్యాంకుల్లో ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే 2 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.94702 కోట్లను మాఫీ చేసింది. గత ఐదేళ్లలో మొత్తం 6.5 లక్షల కోట్ల రుణాల్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాఫీ చేశాయి. అయితే ఈ ఆర్ధిక సంవత్సరంలోనే రూ.42 వేల కోట్ల రుణాల్ని ఇవి మాఫీ చేసినట్లు తేలింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ ప్రభుత్వ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రూ.3.16 లక్షల కోట్లుగా ఉన్నాయని, ప్రైవేటు బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రూ.1.34 కోట్లుగా ఉన్నాయని కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications