బెంగళూరులో మనోళ్లకు ఆస్తులు ఉన్నాయా ?, ఇలా చేస్తే సరిపోతుంది, ఏం చెయ్యాలంటే ?
బెంగళూరు నగరంలో ఆస్తి పన్నులు వసూలు చేసేందుకు బీబీఎంపీ పలు కసరత్తులు చేస్తోంది. వేలాది కోట్ల రూపాయల వాణిజ్య పన్ను బకాయిలను సేకరించి అభివృద్ధి పనులకు వినియోగించాలని బీబీఎంపీ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. లేకుంటే ప్రభుత్వం మంజూరు చేసే వరకు బీబీఎంపీ వెయ్యి కళ్లతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైయ్యింది.
బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు బెంగళూరు సిటీలోని ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం బెంగళూరు సిటీలో దాదాపు రూ 2 వేల కోట్లకు పైగా వాణిజ్య భవనాల నుంచి రావలసిన పన్ను పెండింగ్‌లో ఉంది. పన్ను వసూళ్లకు మినహాయింపులు ఇవ్వాలని బీబీఎంపీ ఆలోచిస్తోంది. బెంగళూరు నగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది.

బెంగళూరులో మౌలిక సదుపాయాలు కల్పించడం, ట్రాఫిక్ వ్యవస్థ నిర్వహణ సహా అనేక సవాళ్లు ఉన్నాయి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి పనులు చేపట్టేందుకు బీబీఎంపీకి తక్షణం నిధులు కావాలి. కానీ పన్నులు వసూలు కాకపోవడంతో బీబీఎంపీ ఖజానా ఖాళీ అవుతోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి అయిన తర్వాత పన్నుల వసూళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
డీసీఎం ఆదేశాలతో పన్ను వసూలు చేసేందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చేందుకు బీబీఎంపీ ముందుకు వచ్చింది. ఇందుకోసం తుది ఆమోదం కోసం సిద్దరామయ్య ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. బీబీఎంపీ ప్రధాన ఆదాయ వనరు అయిన వాణిజ్య భవనాల నుండి పన్ను కావడంతో అధికారులు ఆ పన్నులు వసూలు చెయ్యాలని ఆశలు పెట్టుకున్నారు.
బెంగళూరు నగరంలో ఇన్ని భవనాలు ఉన్నప్పటికీ చాలా భవనాలకు కోట్లాది రూపాయల పన్ను బకాయిలు ఉన్నాయి. దీంతో ఆశించిన స్థాయిలో పన్ను వసూలు కావడం లేదు. పన్ను చెల్లింపుదారులకు మూడు ప్రధిపాదనలతో మినహాయింపులు ఇవ్వాలని బీబీఎంపీ ఆలోచిస్తోంది. అపరాధ పన్ను చెల్లింపుదారులకు వడ్డీ లేదా పెనాల్టీని మాఫీ చేయడం కార్పొరేషన్ యొక్క మొదటి ప్రతిపాదన.
2వ ప్రతిపాదన ఏమిటంటే డిఫాల్టర్లపై రెట్టింపు వడ్డీ కాకుండా ఒకే పెనాల్టీ లేదా వడ్డీ విధించడం. 3వ ప్రతిపాదన పన్ను చెల్లింపుదారు నుండి వడ్డీ లేదా జరిమానా మాత్రమే వసూలు చేయడం. ఈ మూడు ప్రతిపాదనలను సిద్దరామయ్య ప్రభుత్వానికి సమర్పించారు. మరి ప్రభుత్వం దేనికి అంగీకరిస్తుందో వేచి చూడాలి అంటున్నారు బీబీఎంపీ అధికారులు. మినహాయింపులు ఇవ్వడం ద్వారా బకాయి ఉన్న పన్ను వసూలు చేయాలన్నది బీబీఎంపీ ఆలోచన.
ప్రస్తుతం 198 వార్డులున్న బీబీఎంపీ ప్రతి ఆర్థిక సంవత్సరానికి తన సొంత బడ్జెట్‌ను సమర్పిస్తోంది. ఈ బడ్జెట్ రాష్ట్రం నుండి వచ్చే ఆదాయం, కేంద్రం నుండి వచ్చే గ్రాంట్లతో పాటు బీబీఎంపీ వసూలు చేస్తున్న ఆస్తి పన్ను వసూళ్ల ద్వారా బడ్జెట్ నిర్ణయించబడుతుంది. గత ఏడాది మార్చి 2వ తేదీన బీబీఎంపీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి 11,163.97 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను సమర్పించింది.

బీబీఎంపీ బడ్జెట్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఇందుకు పన్ను వసూళ్లు కూడా పక్కాగా జరగాలి. అయితే బకాయి పన్నులు వసూలు చేయడం బీబీఎంపీకి సవాలుతో కూడుకున్న పని. పన్ను బకాయిలు అధికంగా ఉన్న భవనాల ముందు బ్యానర్లు వేయడం, దండోరా వేయించడం, వాటికి తాళాలు వేయడం వంటి కార్యకలాపాలను బీబీఎంపీ ఇంతకాలం చేస్తోంది.
అయితే దీని నుంచి కూడా బీబీఎంపీకి పన్ను వసూళ్లు ఏమాత్రం పెరగలేదు. పన్నును బీబీఎంపీ ఇలాగే వదిలేస్తే లేనిపోని సమస్యలు వస్తాయని అధికారులు అంటున్నారు. బీబీఎంపీ బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన ప్రకటనల ప్యానెల్‌లు/హోర్డింగ్‌ల ద్వారా గ్రాంట్ వస్తుంది. అయితే అక్రమ ప్రకటనలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు కూడా చాలాసార్లు బీబీఎంపీ అధికారులను హెచ్చరించింది. మొత్తం మీద బెంగళూరులో పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్ను వసూలు చెయ్యడానికి బీబీఎంపీ అధికారులు రంగం సిద్దం చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications