మోడీని చంపేందుకు రెడీగా ఉండండి: కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత రాజా పటేరియా.. ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రధాని మోడీని చంపేందుకు అంతా సిద్ధంగా ఉండాలంటూ పటేరియా వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. దీంతో మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా.. పటేరియాపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

మోడీని చంపేందుకు రెడీగా ఉండాలంటూ కాంగ్రెస్ నేత
మోడీ ఎన్నికలను ముగించేస్తారు. ప్రాంతాలు, కులాలు, భాషలు ఆధారంగా విభజిస్తారు. దళితులు, గిరిజనులు, మైనార్టీల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. మీరు రాజ్యాంగాన్ని కాపాడాలనుకుంటే.. మోడీని చంపేందుకు సిద్ధం కండి. అతడ్ని ఓడించండి అని పన్నా జిల్లాలోని పవాయి పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు రాజా పటేరియా.
కాంగ్రెస్ పార్టీకి గాంధీ పేరు చెప్పే అర్హత ఉందా?
పటేరియా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ కావడంతో బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీకు ఇలాంటి ప్రేమేనే పంచాలని చెబుతున్నారా? అని చురకలంటిస్తున్నారు. మహాత్మాగాంధీ పేరు చెప్పే అర్హత కూడా ఇప్పటి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. అంతేగాక, పటేరియాపై కేసు నమోదుకు ఆదేశించారు మధ్యప్రదేశ్ హోంమంత్రి మిశ్రా.
కాంగ్రెస్ అసలు రూపం ఇదేనంటూ సీఎం చౌహాన్
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పటేరియా వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. రాజకీయంగా కాంగ్రెస్ ప్రధాని మోడీని ఎదుర్కోలేకే.. ఆయనను చంపాలని చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అసలు ముఖం ఇదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పటేరియాపై ఎఫ్ఐఆర్ నమోదవుతుంది,చట్టం తన పని తాను చేస్తుందని సీఎం చౌహాన్ స్పష్టం చేశారు.
మోడీని చంపాలని అనలేదంటూ పటేరియా
రాహుల్ గాంధీ కోరుకుంటున్న ప్రేమ ఇదేనా? అని ప్రశ్నించారు బీజేపీ నేత హెహజాద్ జైహింద్. పటేరియా వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అయితే, తన వ్యాఖ్యలపై విమర్శలు వస్తుండటంతో పటేరియా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తాను మోడీని ఫినిష్ చేయాలని చెప్పింది రాజకీయంగానే కానీ, భౌతికంగా కాదని పటేరియా తెలిపారు.












Click it and Unblock the Notifications