త్రిపుర హింస, వైపరీత్యాల సాయం.. ప్రధాని మోడీతో దీదీ మమత భేటీ
దీదీ మమతా బెనర్జీ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా 96వేల 605 కోట్లు రావాల్సి ఉందన్నారు. "BSFకు విస్తృత అధికారాలు ఇచ్చినట్లయితే అది శక్తి మంతం అవ్వడమే కాకుండా రాష్ర్టంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికైనా దీని పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు సరిహద్దు భద్రతా దళం అధికార పరిధి విస్తరణపై మోదీతో మమత చర్చించారు. ఈ విషయాన్ని భేటీ అనంతరం మమతే స్వయంగా తెలిపారు. మోడీతో భేటీ తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్ళానన్నారు. బెంగాల్‌లో బీఎస్ఎఫ్ ప్రాదేశిక పరిధి పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరినట్లు చెప్పారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయొద్దని ప్రధాని మోదీకి సూచించినట్లు తెలిపారు.
కోవిడ్ వ్యాక్సినేషన్,కేంద్ర నిధుల విషయమై కూడా మోడీతో చర్చించినట్లు మమత తెలిపారు. త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు దాడి చేసిన విషయాన్ని మోదీ దృష్టి తీసుకెళ్లినట్లు చెప్పారు. వచ్చే ఏడాది బెంగాల్‌లో జరగనున్న గ్లోబల్ బిజినెస్ మీట్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించినట్లు మమత తెలిపారు. పంజాబ్ ఎన్నికల్లో నేతలందరూ బిజీగా ఉన్నారన్న మమతా.. ప్రధాని అపాయింట్మెంట్ తప్ప మరొకరిది తాను కోరలేదని స్పష్టం చేశారు.

నెలాఖరులో ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలుస్తానని చెప్పారు.ఇక, ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తమ మద్దతు కావాలని కోరితే తప్పకుండా ఇస్తామని మమత ఈ సందర్భంగా తెలిపారు. అక్టోబర్‌లో భారత్-పాకిస్థాన్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికార పరిధిని కేంద్ర ప్రభుత్వం విస్తరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ సరిహద్దుల నుంచి భారత దేశంవైపు 50 కిలోమీటర్ల పరిధిలో భద్రతా బలగాల సోదాలు నిర్వహించేందుకు, అనుమానితులను అరెస్టు చేసేందుకు, వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు అధికారం ఇస్తూ బీఎస్‌ఎఫ్ చట్టాన్ని సవరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు అనుమతి లేకుండానే ఈ అధికారాలను వినియోగించవచ్చు. అంతకుముందు నిబంధనల ప్రకారం కేవలం 15 కిలోమీటర్ల పరిధిలోనే బీఎస్ఎఫ్‌కు అధికారం ఉండేది. తాజా అధికార పరిధి పెంపు నిర్ణయాన్ని మమత వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత వారం పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.












Click it and Unblock the Notifications