బెంగాల్ బీజేపీలో లుకలుకలు: ఆ సామాజిక వర్గం అసంతృప్తి..వాట్సాప్ గ్రూపుల నుంచి కేంద్రమంత్రి ఎగ్జిట్..!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా పార్టీకి గట్టి పోటీనిచ్చిన బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది. ఇక మెజార్టీ స్థానాలు గెలవడంలో మతువా సామాజిక వర్గం కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే ఆ సామాజిక వర్గంకు చెందిన నేతలు బీజేపీ పట్ల గుర్రుగా ఉన్నారు. తమకు సముచిత స్థానం కల్పించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు లోలోపలనే అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులు ఇప్పుడు ఓ కేంద్రమంత్రి బాహాటంగానే తన చర్యలతో అసంతృప్తి వ్యక్తం చేయడంతో మొత్తం వ్యవహారం బయటపడింది.
మతువా సామాజిక వర్గంకు చెందిన నేత కేంద్ర నౌకాయాన, జలమార్గం, పోర్టులశాఖ మంత్రి సంతను ఠాకూర్ బీజేపీపై తన అసంతృప్తిని పరోక్షంగా బయటపెట్టారు. బెంగాల్ బీజేపీకి చెందిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో నుంచి బయటకు వచ్చి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బాన్‌గావ్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంతను ఠాకూర్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంతను ఠాకూర్ మతువా సామాజికవర్గంకు చెందిన సీనియర్ నాయకుడు. అంతేకాదు అఖిల భారత మతువా మహాసంఘంకు నాయకుడు కూడా. రాష్ట్ర బీజేపీకి చెందిన వాట్సాప్ గ్రూపుల నుంచి పలువురు మతువా సామాజిక వర్గంకు చెందిన ఎమ్మెల్యేలు ఎగ్జిట్ అవడంతో కేంద్రమంత్రిగా ఉన్న సంతను ఠాకూర్ కూడా ఎగ్జిట్ అయ్యారు.
ఈ మధ్యకాలంలో బెంగాల్ బీజేపీ పార్టీలో జరిగన మార్పులు చేర్పులు సందర్భంగా మతువా సామాజిక వర్గంకు చెందిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యేలు ఇతర నాయకులు పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. పలు జిల్లాల్లో మెజార్టీగా మతువా సామాజిక వర్గం ఉన్నప్పటికీ కనీసం జిల్లా పోస్టులు కూడా తమకు దక్కలేదనే అసంతృప్తి వ్యక్తం చేశారు.

మంగళవారం రాత్రి మతువా సామాజిక వర్గంకు చెందిన నాయకులంతా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి అసంతృప్తిని వెల్లగక్కారు. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ మతువా సామాజిక వర్గం నేతలకు తమ పార్టీలో చేరేందుకు స్వాగతం పలికింది. ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అసంతృప్తితో ఉన్న నేతలు మమత ఇచ్చిన ఆఫర్‌ను స్వీకరిస్తారా అనే చర్చ బెంగాల్ రాజకీయాల్లో జరుగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెల్చుకుందంటే అందుకు కారణం మతువా సామాజిక వర్గమే అని బీజేపీ ఎమ్మెల్యే మతువా సామాజికవర్గం నేత ముకుత్ మణి అధికారి తెలిపారు.
మతువా సామాజిక వర్గానికి చెందిన వారికి జిల్లా రాష్ట్ర కమిటీల్లో సముచిత స్థానం కల్పించాలని ఆ కమ్యూనిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారంటూ అధికారి తెలిపారు. ఇది తన స్వార్థం కోసం కాదని తమ సామాజిక వర్గం కోసమే ఈ తపనంటూ చెప్పుకొచ్చిన ఎమ్మెల్యే ముకుత్ మణి అధికారి... రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగాలని కోరుకున్నారు.
తమ డిమాండ్లపై పూర్తి క్లారిటీతో ఉన్నట్లు ముకుత్ మణి అధికారి చెప్పారు. బెంగాల్ రాష్ట్ర బీజేపీ కమిటీలో ఉపాధ్యక్ష పదవితో పాటు సెక్రటరీ పదవి కూడా మతువా సామాజిక వర్గంకు చెందిన వారికి కేటాయించాలని ఇదే విషయమై కేంద్రమంత్రి సంతను ఠాకూర్‌తో చర్చించినట్లు చెప్పారు. ఇప్పటికే ఇది బీజేపీ జాతీయ నాయకుల దృష్టికి సంతను ఠాకూర్ తీసికెళ్లినట్లు ముకుత్ మణి అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే బెంగాల్ రాష్ట్ర బీజేపీ వాట్సాప్ గ్రూప్ నుంచి తాను ఎందుకు ఎగ్జిట్ కావాల్సి వచ్చిందో అనేదానిపై ఇప్పుడే తానేమి వ్యాఖ్యానించనని చెప్పారు కేంద్రమంత్రి సంతను ఠాకూర్.
Recommended Video
రాష్ట్ర కమిటీలో మతువా సామాజిక నేతలకు ప్రాధాన్యత ఇవ్వలేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన సమయంలో తన చర్యలకు కారణాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. అంతేకాదు భవిష్యత్ కార్యచరణ కూడా ప్రకటిస్తానని వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న వారికి ఎవ్వరికీ మతువా సామాజిక వర్గం మద్దతు అక్కర్లేదనట్లుగా వ్యవహరిస్తున్నారనిపిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి ఠాకూర్. ఇదిలా ఉంటే ఠాకూర్ అసంతృప్తి సెగ బీజేపీ పెద్దలను తాకింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్‌లో ఠాకూర్‌తో మాట్లాడారు.












Click it and Unblock the Notifications