ఐటీ హబ్ లో ఒక్క కేసులో పేరు డిలీట్, రూ. 55 లక్షలు లంచం, ఆ కేసు ఏదంటే?
బెంగళూరు నగరాభివృద్ధి అథారిటీ (బీడీఏ) అక్రమ భూవ్యవహారాలు, బీడీఏ సైట్ల అక్రమాల కేసులకు సంబంధించి నమోదు అయిన కేసులో నిందితుల పేర్లను తప్పించి వారిని రక్షించడానికి ఏకంగా రూ. 55 లక్షలు నొక్కేసిన ఓ పోలీసు భాగోతం బయటకు వచ్చింది. ఒక్క కేసులోనే రూ. 55 లక్షలు చేతివాటం చూపించిన హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ బెంగళూరు అడిషనల్ పోలీసు కమీషనర్ డాక్టర్ చంద్రగుప్త ఆదేశాలు జారీ చేశారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై బెంగళూరు సీసీబీ విభాగం డీసీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హెడ్ కానిస్టేబుల్ యతీష్‌ను సస్పెండ్ చేయడంతోపాటు అదనపు కమిషనర్‌ను సస్పెండ్ చేశారు. దీనిపై శాఖాపరమైన విచారణకు కూడా బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్ల క్రితం బీడీఏ అధికారులు, కొందరు బ్రోకర్లపై అక్రమ భూ లావాదేవీలకు సంబంధించి బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి.

ఈ కేసును తరువాత బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణ చేపట్టారు. ఆ కేసులో కొంతమంది నిందితుల నుంచి డబ్బులు తీసుకుని చార్జిషీట్‌లో తన పేరును వదిలిపెట్టేందుకు యతీష్ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ సమాచారం అందుకున్న బెంగళూరు సీసీబీ విభాగం డీసీపీ వెంటనే అదనపు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.దీంతో అంతర్గత స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అదనపు కమిషనర్ బెంగళూరు సీసీబీ విభాగం డీసీపీని ఆదేశించారు.
ఈ కేసు దర్యాప్తు అధికారితో పాటు కొందరు అధికారుల నుంచి వివరణ తీసుకున్న బెంగళూరు సీసీబీ విభాగం డీసీపీ నిందితుల తరపున హెడ్ కానిస్టేబుల్ యతీష్ రూ. 55 లక్షలు డబ్బులు రాబట్టేందుకు ప్రయత్నించారని నిర్ధారించారు. ఈ సమాచారం ఆధారంగా బెంగళూరు నగర అదనపు కమిషనర్ క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేశారు. దాని ప్రకారమే యతీష్ ను సస్పెండ్ చేశారని బెంగళూరు సీసీబీ పోలీసు వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications