టీవీ ప్రోగ్రాంలు చూసి ఆధారాల్లేకుండా హత్య చేశాడు!
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని బసబనగుడి ప్రాంతంలో చోటు చేసుకున్న మహిళ దారుణ హత్య కేసును నగర పోలీసులు 36గంటల్లో ఛేదించారు. తనపై క్షుద్రపూజలు చేస్తుందనే నెపంతో, ఆర్థిక సహాయం చేయని కారణంగానే ఆ మహిళను ఆమె అల్లుడు హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు నిందితుడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోంలూరులో స్టాక్ బ్రోకింగ్ కంపెనీలో పని చేస్తూ మొహమ్మద్ అఖిల్ ఎర్ రెహమాన్(38) నీలసంద్రలోని ఆర్కే గార్డెన్ సౌత్ క్రాస్ వీధిలో నివాసం ఉంటున్నాడు. అయితే, అతని అత్త సయీద్ ఉన్నీసా(54) మొహమ్మద్ బ్లాక్‌లోని ఖాజా వీధిలో ఉండే తన ఇంట్లో శనివారం రాత్రి రక్తమడుగులో విగతజీవిగా పడివుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

'ఈ హత్య కేసులో నిందితుడు ఎలాంటి సాక్ష్యం విడిచిపెట్టలేదు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన మా సిబ్బంది నిందితుడు ఆమె అల్లుడేనని తేల్చారు' అని డీసీపీ సౌత్ డాక్టర్ శరణప్ప తెలిపారు. మొదట మృతురాలి భర్త అఫ్జల్ అహ్మద్‌ను అనుమానించి దర్యాప్తు కొనసాగించామని, ఎందుకంటే వారిద్దరూ మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఉండేదని మరో అధికారి తెలిపారు. అయితే, అతను నిందితుడు కాదని తేలిన తర్వాత మరో కొణంలో విచారణ చేశామని తెలిపారు.
మృతురాలి కూతురుకు సమన్లు జారీ చేసి, ఆమె భర్తను విచారించినట్లు తెలిపారు. ఈ సమయంలోనే నిందితుడ్ని తేల్చేశామని చెప్పారు. అయితే, నిందితుడు ఎలాంటి సాక్ష్యం లేకుండా హత్యను ఎంతో చాకచక్యంగా చేశాడని పోలీసు అధికారి చెప్పారు. తమ విచారణలో భాగంగా కుడిచేతిపై చేతివేళ్ల ముద్రలు ఉన్నాయని గుర్తించి.. ప్రశ్నించగా అతని నుంచి సరైన సమాధానం రాలేదని చెప్పారు. దీంతో అతడే నిందితుడని విచారణ కొనసాగించామని, చేతి వేళ్ల ముద్రలు పరీక్షించగా అవి మ్యాచ్ అయ్యాయని తెలిపారు.
తమదైన శైలిలో విచారించగా నిందితుడు రెహమాన్ తన నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. తన అత్త తనకు ముందు నుంచి ఆర్థిక సాయం చేసేదని, అయితే గత కొద్ది నెలలుగా తనకు డబ్బు మొత్తానికే ఇవ్వడం లేదని నిందితుడు తెలిపాడు. అంతేగాక, తనను దుబాయ్ వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని ఒత్తిడి చేసేదని, తనకు తన భార్యా, పిల్లలను వదిలేసి అంతదూరం వెళ్లడం ఇష్టం లేదని చెప్పాడు.
షేర్లలో డబ్బులు పెట్టిన నష్టపోయిన తనకు తన అత్త డబ్బులు పంపించకపోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నానని, అంతేగాక, తాను పైకి రాకుండా ఏవో క్షుద్రపూజలు తనపై చేస్తుందని అనుమానించానని నిందితుడు రెహమాన్ తెలిపాడు. ఈ నేపథ్యంలోనే ఆరు నెలల క్రితమే ఆమెను అంతం చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపాడు. నేరాలకు సంబంధించిన కార్యక్రమాలను టీవీల్లో చూసేవాడినని, వాటిలోతోనే ఆధారాల్లేకుండా హత్య చేయడం ఎలాగో తెలుసుకున్నానని చెప్పాడు.
తన అత్తను చంపాలని నిర్ణయించుకుని గత శనివారం సాయంత్రం ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వెళ్లానని చెప్పాడు. అప్పుడు ఆమె నిద్రిస్తుండటంతో తలగడతో ఆమెను చంపే ప్రయత్నం చేశానని, ఆమె అడ్డుకోవడంతో ఓ ఇస్త్రీ పెట్టెతో తలపై మోది హత్య చేసినట్లు తెలిపాడు. అంతేగాక, తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు పొడిచినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆధారాల్లేకుండా చేశానని, రక్తపు మరకలున్న ఆమె దుస్తులను కూడా విప్పేసినట్లు తెలిపాడు.












Click it and Unblock the Notifications