సీఎం కొడుక్కి సమన్లు, ఈసారి మిస్ అయితే అంతే, ఏమనుకుంటున్నారు? కోర్టు సీరియస్!
సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న కేసులో బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ కుమరుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయానిధి స్టాలిన్ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధికి బెంగళూరు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.
తదుపరి విచారణకు ఉదయనిధి స్టాలిన్ హాజరుకావాల్సి ఉంది. లేదంటే కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సోమవారం ఈ సమన్లు జారీ చేశారు. ఏప్రిల్ 24వ తేదీన తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ బెంగళూరు కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే ఉదయానిధి స్టాలిన్ న్యాయవాదులు ఆయన హాజరుకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోర్టుకు మనవి చేసే అవకాశం ఉంది.

హాజరుకాకపోవడంపై అభ్యంతరం: గత సారి బెంగళూరు ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లు ప్రకారం ఉదయనిధి స్టాలిన్ సోమవారం కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. లేదా న్యాయవాది ద్వారా హాజరు నుండి మినహాయింపు పొంది ఉండాలి. అయితే తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ ఆ రెండింటిలో ఏ ఒక్కటి కూడా చేయలేదు.
ఈ నేపథ్యంలో కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే తదుపరి విచారణ సమయంలో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ కు సమన్లు జారీ చేసి విచారణను వాయిదా వేసింది. కాగా ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులు వెంకటేష్, మధుకర్ రామలింగం, అద్వాన్ వారి న్యాయవాదుల ద్వారా కోర్టుకు హాజరయ్యారు.

సనాతన ధర్మాన్ని కించపరిచేలా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై పరమేష్ అనే వ్యక్తి బెంగళూరు కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. అందువల్ల, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153 (రెచ్చగొట్టడం) మరియు సెక్షన్ 298 (మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం) మరియు సెక్షన్ 500 (పరువు నష్టం) కింద తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ పై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.
ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం వివాదాస్పద ప్రకటనకు సంబంధించి ఉదయనిధి స్టాలిన్ సహా నలుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. సెప్టెంబరు 2023లో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం సామాజిక న్యాయం యొక్క ఆలోచనకు వ్యతిరేకం, దానిని నిర్మూలించాలి అని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ వ్యాఖ్యలతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయనకు వ్యతిరేకంగా పలు ఫిర్యాదులు దాఖలు అయ్యాయి.












Click it and Unblock the Notifications