బెంగళూరు రూపురేఖలు మారిపోతున్నాయ్..!!
సిలికాన్ సిటీ.. బెంగళూరులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. నగరం రూపురేఖలు మారిపోనున్నాయి. దీని పరిధి మరింత విస్తృతం కాబోతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర పరిపాలన వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం.
నగర పాలనలో వికేంద్రీకరణను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) స్థానంలో కొత్తగా ఏర్పడిన గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) ఆధ్వర్యంలో అయిదు మున్సిపల్ కార్పొరేషన్‌ల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా స్థానిక పరిపాలనను మెరుగుపరచడం, దిగువ స్థాయి అధికార యంత్రాంగానికి మరిన్ని అధికారాలు కల్పించడం, బెంగళూరు నగరంలో పౌర సేవలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ముసాయిదాకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు.
ఈ ముసాయిదా ప్రణాళిక ప్రకారం సెంట్రల్ బెంగళూరు కార్పొరేషన్‌లో శివాజీ నగర్, శాంతి నగర్, పులకేశి నగర్, చిక్‌పేట్, గాంధీనగర్, చామరాజపేట్ ప్రాంతాలు ఉండనున్నాయి. నగర శివార్లలో ఉన్న ప్రాంతాలు తూర్పు, పశ్చిమ, ఉత్తర లేదా దక్షిణ బెంగళూరు కార్పొరేషన్‌ల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
రాజరాజేశ్వరి నగర్, యశ్వంత్‌పూర్, మహాదేవపుర, కేఆర్ పురం వంటి నియోజకవర్గాల పరిధి అధికంగా ఉండటం వల్ల వాటిని రెండు లేదా అంతకంటే ఎక్కువ మున్సిపల్ కార్పొరేషన్‌లకు కేటాయించారు. గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ యాక్ట్, 2024 ఏప్రిల్ 24వ తేదీన నోటిఫై అయింది.
ఈ చట్టం మనుగడలోకి రావడంతో ఆటోమేటిక్ గా బీబీఎంపీ యాక్ట్ రద్దయింది. గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ అథారిటీ (GBA) ప్రకారం.. గరిష్టంగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేయడానికి వీలుంది. ఇందులో భాగంగా తొలిదశలో అయిదు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి.
నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 120 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. ముసాయిదాపై ప్రజలు తమ అభ్యంతరాలు లేదా సూచనలు తెలియజేయడానికి ప్రభుత్వం 30 రోజుల గడువు ఇచ్చింది. అభ్యంతరాల గడువు ముగిసిన తర్వాత, గవర్నర్ ఆమోదం పొందిన తరువాత ఆగస్టు 25 నాటికి తుది నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పునర్వ్యవస్థీకరణ తరువాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications