వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగవంత్ మాన్: కమెడియన్, పొలిటీషియన్... కాబోయే పంజాబ్ సీఎం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నేత భగవంత్ మాన్ పేరును ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ముందుగానే ప్రకటించింది. దిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆయన పేరును ప్రకటించారు.

ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

''పంజాబ్ ఆమ్ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎంపికైన సర్దార్ భగవంత్ మాన్‌కు అభినందనలు. పంజాబ్ మొత్తం ఆప్ వైపే ఆశగా చూస్తోంది. ఇది చాలా పెద్ద బాధ్యత. పంజాబీల ముఖాలపై భగవంత్ మాన్ నవ్వులు తీసుకొస్తారని నాకు నమ్మకం ఉంది'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Bhagwant Mann

ఒక కమెడియన్‌గా, రాజకీయ నాయకుడిగా భగవంత్ మాన్‌కు ప్రజల్లో గుర్తింపు ఉంది. పంజాబ్‌లోని సంగ్రూర్ నియోజకవర్గం నుంచి ఆప్ తరఫున ఆయన వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పంజాబ్ ఆప్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

2014లో పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన ఆప్‌కు స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతున్నారు. ఆ పార్టీకి ఆయనే అతిపెద్ద బలం, బలహీనత కూడా.

భగవంత్ మాన్ ఎవరు?

''ఆయనకున్న ప్రత్యేక లక్షణం ఏంటంటే ఫోన్ నంబర్లన్నీ గుర్తు పెట్టుకుంటారు. వార్తాపత్రికలు, రేడియోలతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోని సమస్యలు తెలుసుకునేందుకు పొద్దున్నే లేచి జిల్లా వార్తా పత్రికలను చూస్తారు. రేడియోలో క్రికెట్ కామెంటరీ వినడం ఆయన చిన్ననాటి అలవాటు. ఆ అలవాటును ఆయన ఇప్పటికీ మార్చుకోలేదు'' అని మాజీ జర్నలిస్ట్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మంజీత్ సింగ్ సిద్ధూ వెల్లడించారు.

పంజాబ్‌ రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లా షీమా మండి సమీపంలోని సతోజ్ గ్రామంలో 1973 అక్టోబర్ 17న భగవంత్ మాన్ జన్మించారు. ఆయన తండ్రి మోహిందర్ సింగ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి హర్‌పాల్ కౌర్ గృహిణి.

డిగ్రీ చదువుతూ ఆయన కామెడీ రంగంలోకి ప్రవేశించారు. సంగ్రూర్‌లోని సునామ్ షహీద్ ఉద్ధమ్ సింగ్ కాలేజీలో చదువుతున్న సమయంలో కవితలు, కామెడీ విభాగాల్లో పలు పోటీల్లో విజేతగా నిలిచారు. ప్రొఫెషనల్ కమెడియన్‌గా మారారు.

ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఆయన బీకామ్‌లో చేరారు. కానీ కామెడీ రంగంలో బిజీగా మారడంతో చదువును మధ్యలోనే ఆపేశారు. 1992 నుంచి 2013 వరకు 25 కామెడీ ఆల్బమ్‌లను రికార్డు చేశారు. 5 ఆడియో టేపులను కూడా విడుదల చేశారు. 1994 నుంచి 2015 వరకు 13 హిందీ సినిమాల్లో నటించారు.

ఇంద్రజిత్ కౌర్‌తో ఆయనకు వివాహం జరిగింది. ఆయనకు ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఇంద్రజిత్ కౌర్ అమెరికాలో ఉంటున్నారు. తన తల్లితో కలిసి భగవంత్ సతోజ్ గ్రామంలో నివసిస్తున్నారు.

గురు గ్రంథ సాహిబ్‌ను చివరి గురువుగా సిక్కులు ఎందుకు భావిస్తారు? అందులో ఏం రాసి ఉంది?

రాజకీయాల్లోకి...

చిన్నతనం నుంచే భగవంత్ ఉపన్యాసాల్లో ధాటిని ప్రదర్శించేవారు. సమాజం, రాజకీయాల్లోని సమస్యలను భగవంత్ తన కళ ద్వారా ప్రదర్శించేవారని మంజీత్ సింగ్ సిద్ధూ చెప్పారు.

2009-10 సమయంలో వార్తాపత్రికలకు కాలమ్స్ రాయడం ప్రారంభించారు. ఫజిల్కా ప్రాంతంలో బాలికలు వింత వ్యాధులకు గురవుతున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. తాగునీటి సమస్య కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలుసుకున్న ఆయన, మిత్రుల సహాయంతో ఆ ప్రాంతంలో ఆ సమస్యను తీర్చేందుకు కృషి చేశారు.

ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమస్యను మీడియా దృష్టికి తెచ్చారు. 2011లో ప్రకాశ్ సింగ్ బాదల్ మేనల్లుడు, అప్పటి ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ అకాలీ దళ్‌ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఒక సమావేశంలో మన్‌ప్రీత్ బాదల్‌ను కలిసిన భగవంత్ మాన్ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు.

రాజకీయ ప్రయాణం

రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన భగవంత్ మాన్ "నా కామెడీ ద్వారా నేను ఒక రకంగా రాజకీయ, సామాజిక వ్యాఖ్యానాలు చేస్తున్నాను. ఇప్పుడు ఆ బురదను శుభ్రం చేయాలంటే బురదలోకి దిగాలని నాకు అనిపించింది. అందుకే ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాను'' అని అన్నారు.

కాలేజీ రోజుల్లో వామపక్షాల భావజాలానికి ప్రభావితుడైనా, ఆయన ఏ పార్టీలో చేరలేదు. 2011 మార్చిలో మన్‌ప్రీత్ బాదల్‌ పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్‌ (పీపీపీ)ని స్థాపించినప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. పీపీపీ వ్యవస్థాపక నాయకులలో ఒకరయ్యారు.

2012లో పీపీపీ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత తన పార్టీ వ్యవస్థాపకుడు మన్‌ప్రీత్ సింగ్ బాదల్ కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేయగా, ఆయన మాత్రం కాంగ్రెస్ పట్ల ఆసక్తి చూపించలేదు.

2014లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 4 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అప్పటి నుంచి ఆయనే పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీకి కీలక నేతగా మారారు.

8 మే 2017న భగవంత్ మాన్‌ను ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్ యూనిట్ ప్రెసిడెంట్‌గా నియమించింది. కానీ ఆయన వెంటనే రాజీనామా చేశారు. డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ అకాలీ నాయకుడు బిక్రమ్ సింగ్ మజిథియాపై ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, మరికొందరు నేతలు ఆరోపణలు చేశారు.

అయితే, మజిథియా దీనిపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో ఇరు పార్టీల నేతలు రాజీకి వచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ మజిథియాకు క్షమాపణలు చెప్పడం ఇష్టంలేని భగవంత్ మాన్, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

2017 అసెంబ్లీ ఎన్నికలలో భగవంత్ మాన్ జలాలాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో 1,11,111 ఓట్లతో తిరిగి ఎన్నికయ్యారు.

మద్యం వివాదం

రాజకీయ నాయకులు తరచూ అవినీతి, బంధుప్రీతి, మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటారు. కానీ పదేళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న భగవంత్ మాన్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ ...ఆయన నిత్యం మద్యం సేవించి ఉంటారని.

ఆప్ తిరుగుబాటు నేత యోగేంద్ర యాదవ్ 2015లో ఈ విషయాన్ని చెప్పారు. 2014 జులైలో పార్టీ ఎంపీల సమావేశం జరుగుతోందని, భగవంత్ మాన్ తన పక్కన కూర్చున్నారని, ఆయన దగ్గర మద్యం వాసన వచ్చిందని యాదవ్ వెల్లడించారు.

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా భగవంత్ మాన్ పై ఇవే ఆరోపణలు చేశారు.

భగవంత్ మాన్ నుంచి మద్యం వాసన వస్తున్నందున తన సీటు మార్చాల్సిందిగా ఆప్ తిరుగుబాటు నాయకుడు హరిందర్ సింగ్ ఖల్సా అప్పటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కి లిఖితపూర్వక విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్‌లో ఆయన ప్రసంగాలు చేసినప్పుడు మద్యం మత్తులో ఉన్నారంటూ అధికార బీజేపీ సభ్యులు పలుమార్లు ఆరోపించారు. ఒకసారి పార్లమెంటులో చర్చ సందర్భంగా భగవంత్ మాన్ మాట్లాడుతుండగా, ఒక బీజేపీ ఎంపీ ఆయన దగ్గరికొచ్చి వాసన చూస్తున్న వీడియో వైరల్ అయ్యింది.

అయితే, భగవంత్ మాన్, ఆయన మద్దతుదారులు మద్యం ఆరోపణలను పలుమార్లు ఖండించారు. జనవరి 1, 2019 నుంచి తాను మద్యం ముట్టబోనని తన తల్లికి ప్రమాణం చేసి చెప్పానని బర్నాలలో జరిగిన పార్టీలో భగవంత్ మాన్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bhagwant Mann: Comedian, politician future Punjab CM
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X