• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bhagawant Mann: పంజాబ్ సీఎం మద్యం మత్తులో ఉన్నందుకు విమానం నుంచి దించేశారా? ఏమిటీ వివాదం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భగవంత్ మాన్‌

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జర్మనీ నుంచి తిరుగు ప్రయాణంపై గందరగోళం, వివాదం ఏర్పడింది.

సీఎం భగవంత్ మాన్ బాగా మద్యం మత్తులో ఉండడంతో ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఆయన్ను విమానం నుంచి దించేశారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు.

దీనిపై విచారణ జరిపించాలని పంజాబ్ ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అయితే, విమానం మార్చడం వల్లే ఫ్లైట్ ఆలస్యం అయిందని ఎయిర్‌లైన్ ఆపరేటింగ్ కంపెనీ లుఫ్తాన్సా తెలిపింది.

వివాదం ఎందుకొచ్చింది?

వాస్తవానికి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సెప్టెంబర్ 11 నుంచి 18 వరకు జర్మనీ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి ఆదివారం రాత్రి తిరిగి వచ్చారు. ఆయన తిరుగు ప్రయాణం సమయంలో వివాదం చెలరేగింది.

ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి దిల్లీకి రావాల్సిన విమానం నుంచి ఆయన్ను కిందకు దించారని, దాంతో ఆయన మరో విమానంలో దిల్లీ వచ్చారని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

అయితే, పంజాబ్ ప్రభుత్వ అధికారులు ఈ వాదనలను తోసిపుచ్చారు. భగవంత్ మాన్ ఆరోగ్యం బాగా లేదని, అందుకే విమానం నుంచి దిగిపోయారని, కాస్త కుదుటపడ్డాక వేరొక విమానంలో తిరిగి వచ్చారని చెప్పారు.

ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా కమ్యూనికేషన్ విభాగం అధిపతి చందర్ సుతా డోగ్రా మాట్లాడుతూ, "ముఖ్యమంత్రికి ఆరోగ్యం బాగాలేదు. అందుకే ఆయన ముందు అనుకున్న విధంగా కాకుండా, ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి మరో విమానంలో భారతదేశానికి తిరిగి వచ్చారు" అని చెప్పారు.

https://twitter.com/iamKaran_/status/1571792276527153152

విమానం మార్చడం వల్ల ఆలస్యం అయిందని లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ కూడా ట్వీట్ చేసింది.

"ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి దిల్లీకి వచ్చే విమానం అనుకున్న సమయం కంటే ఆలస్యంగా బయలుదేరింది. రావాల్సిన విమానం ఆలస్యంగా రావడంతో, ఫ్లైట్ మార్చాల్సి వచ్చింది. అందుకే టేకాఫ్ ఆలస్యమైంది" అని లుఫ్తాన్సా తెలిపింది.

దీనిపై విచారణ జరపాలి - విపక్షాలు

ఈ విషయంలో భగవంత్‌ మాన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ వివరణ ఇవ్వాలని శిరోమణి అకాలీదళ్‌ డిమాండ్‌ చేసింది.

దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత బజ్వా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాశారు.

"సెప్టెంబర్ 17న ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో భగవంత్ మాన్‌ను లుఫ్తాన్సా విమానం నుంచి కిందకు దించేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన స్థితి బాగాలేదని, విమానయానానికి అనువుగా లేదని అంటున్నారు. ఇది, సీఎంగా భగవంత్ మాన్ గౌరవానికి విరుద్ధం. కాబట్టి ఈ విషయంపై దర్యాప్తు జరపాలి" అని బజ్వా తన లేఖలో పేర్కొన్నారు.

https://twitter.com/officeofssbadal/status/1571747588390678530

పంజాబ్ ప్రతిపక్ష పార్టీ శిరోమణి అకాలీదళ్ ప్రెసిడెంట్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ట్వీట్ చేస్తూ, "పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తాగి, నడవలేని స్థితిలో ఉన్న కారణంగా లుఫ్తాన్సా ఫ్లైట్ నుంచి కిందకు దించేశారని సహాప్రయాణికులు చెబుతున్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనివల్ల విమానం నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరిందని చెబుతున్నారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమావేశానికి హాజరు కాలేకపోయారు. ఈ రిపోర్టులు ప్రపంచవ్యాప్తంగా పంజాబీలకు అపకీర్తిని, అవమానాన్ని తెచ్చిపెట్టాయి" అని అన్నారు.

"ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భగవంత్ మాన్ గురించి వస్తున్న వార్తలపై ఆమ్ ఆద్మీ పార్టీ మౌనం వహించింది. అరవింద్ కేజ్రీవాల్ ముందుకు వచ్చి దీనిపై స్పష్టత ఇవ్వాలి. ఈ విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఇది పంజాబీలకు, దేశ గౌరవానికి సంబంధించిన అంశం" అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు.

https://twitter.com/INCDelhi/status/1571767442761994240

దిల్లీ కాంగ్రెస్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేస్తూ, పంజాబ్ సీఎం మద్యం మత్తులో ఉన్న కారణంగా విమానం నుంచి కిందకు దించేశారని ఆరోపించింది.

దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి మల్వీందర్ సింగ్ కాంగ్ స్పందిస్తూ, ఈ ఆరోపణలు నిరాధారమైనవని, అబద్ధమని మీడియాతో అన్నారు.

"ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై వస్తున్న ఆరోపణలు అవాస్తవం, నిరాధారం. రాష్ట్రంలో పెట్టుబడులు పెంచేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. దీన్ని కొందరు తట్టుకోలేకపోతున్నారు" అని కాంగ్ అన్నారు.

ఈ వివాదానికి ముందు కూడా భగవంత్ మాన్‌ మద్యం మత్తులో ఉంటారంటూ విపక్ష నేతలు విమర్శలు చేసిన సందర్భాలున్నాయి.

భగవంత్ మాన్‌

'స్పీకర్ గారూ.. భగవంత్ మాన్ పక్కన కూర్చుంటే మద్యం వాసనొస్తోంది.. నా సీటు మార్చండి’

2016లో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడు హరీందర్ సింగ్ లోక్‌సభలో తన సీటును మార్చాల్సిందిగా స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను అభ్యర్థించారు. భగవంత్ మాన్ మద్యం మత్తులో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతున్నారని ఆరోపించారు.

"భగవంత్‌ మాన్‌ దగ్గర మద్యం వాసన వస్తోంది. ఆయన పక్కన కూర్చోలేకపోతున్నాను" అంటూ హరీందర్ సింగ్ స్పీకర్‌కు లేఖ రాశారు.

2019 జనవరిలో బర్నాలాలో జరిగిన ఒక ర్యాలీ సందర్భంగా, మద్యం తాగడం మానేస్తున్నానని భగవంత్ మాన్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు.

ఆ ర్యాలీలో భగవంత్ మాన్ మాట్లాడుతూ, "భగవంత్ మాన్ రాత్రింబవళ్లు మద్యం మత్తులో తూగుతారని నా రాజకీయ ప్రత్యర్థులు తరచూ ఆరోపిస్తున్నారు. నేను కొద్దిగా తాగేవాడినని అంగీకరిస్తున్నాను. కానీ, ఇప్పుడు మానేశానని బహిరంగంగా ప్రకటిస్తున్నా. ఇకపై నన్నెవరూ నిందించలేరు" అని అన్నారు.

ఈ ప్రకటన తరువాత అరవింద్ కేజ్రీవాల్ భగవంత్ మాన్‌ను ప్రశంసిస్తూ, "మిత్రుడు భగవంత్ మాన్ నా హృదయాన్ని గెలుచుకున్నాడు. మొత్తం పంజాబ్ ప్రజల హృదయాన్నే గెలుచుకున్నారు. ప్రతి నేత ఆయనలా ఉండాలి. ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలి" అని అన్నారు.

(కాపీ: కీర్తి దుబే)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bhagwant Mann: Was the Punjab CM removed from the plane for being drunk? What a controversy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X