పిల్లలకు కొవాగ్జిన్ టీకా.. ఫలితాలపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన
దేశంలో కరోనా మహామ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ప్రస్తుతం 18 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నవారికే వ్యాక్సినేషన్ అందుబాటలో ఉంది. ఇప్పటికే మొదటి డోసు పూర్తికాగా, రెండో డోసును కూడా అర్హులైన వారు తీసుకుంటున్నారు. అయితే తాజాగా భారత్ బయోటెక్ మరో కీలక అడుగు వేసింది. 2-18 ఏళ్ల పిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్ ఫలితాలు ఉత్తమంగా ఉన్నాయని ప్రకటించింది.

2-18 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్ టీకా..
భారత్ బయోటెక్ 2-18 ఏళ్ల పిల్లల కోసం కొవాగ్జిన్ టీకాను రూపొందించింది. ఈ టీకాను చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ టీకా ప్రయోగాల్లో ఉత్తమ ఫలితాలను కనబరిచినట్టు భారత బయోటెక్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న చిన్నారుల్లో 1.7 రేట్లు యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపింది.. తీవ్ర దుష్పరిణామాలు కూడా లేవని చెప్పింది.. పిల్లలకు ఈ కొవాగ్జిన్ సురక్షితమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని వెల్లడించింది. ఇది ప్రయోగాల్లో రుజువైందని పేర్కొంది.

రోగనిరోధక శక్తి పెంపు..
భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. పిల్లలపై నిర్వహించిన కొవాగ్జిన్ రెండు , మూడు దశల ప్రయోగాల తుది ఫలితాలను ఎంతో ఉత్తమంగా ఉన్నాయని చెప్పారు.
పిల్లలకు ఈ టీకా సురక్షితమని తెలిపారు. ప్రయోగ ఫలితాలు ఎంతో ప్రోత్సాహకంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు.పెద్దవారితో పాటు పిల్లలకు కూడా సమర్థవంతమైన, సురక్షితమైన టీకాను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని సాధించామని కృష్ణ ఎల్లా ఆనందం వ్యక్తం చేశారు.

స్పల్ప దుష్ప్రభావాలు..
భారత్ బయోటెక్ పిల్లలపై కొవాగ్జిన్ ను ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రయోగాలు జరిపింది. ఈ ట్రయల్స్ కు మొత్తం 525 మంది వాలంటీర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారిని మూడు విభాగాలుగా విభజించి ప్రయోగాలు జరిపింది. ఈ క్లినికల్ ట్రయల్స్ లో మెరుగైన ఫలితాలు కనబరిచినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా ఎల్లా వెల్లడించారు. అయితే మొత్తం 374 మంది వాలంటీర్లలో స్వల్ప దుష్ప్రభావాలు కనిపించాయని పేర్కొన్నారు. అవి ఒక్కరోజులోనే 78 శాతం మందిలో తగ్గిపోయాయని వెల్లడించారు. ఇంజక్షన్ ఇచ్చిన చోట సాధారణ నొప్పి కన్పించిందిన భారత్ బయోటెక్ తెలిపింది.

డీసీజీఐ అనుమతి..
భారత్ బయోటెక్ చిన్నారులపై ఈ ప్రయోగ ఫలితాల రిపోర్టును అక్టోబర్‌లోనే కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు అందజేసింది. వాటిని విశ్లేషించిన సబ్జెక్ట్ నిపుణుల కమిటీ అత్యవసర వినియోగానికి సిఫార్సు చేసింది. తర్వాత 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్ వినియోగించేందుకు డీసీజీఐ ఇటీవలే అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన తుది దశ ప్రయోగాల ఫలితాలను భారత్ బయోటెక్ సంస్థవిడుదల చేసింది.












Click it and Unblock the Notifications