మహారాష్ట్ర సర్కార్ ఉంటుందా ? ఊడుతుందా ? శివసేన తిరుగుబాటుపై సుప్రీం కీలక తీర్పు నేడే..
మహారాష్ట్రలో గతేడాది అధికార పార్టీ శివసేనలో తలెత్తిన తిరుగుబాటులో ఆ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రేను వ్యతిరేకిస్తూ ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో శివసేన మరో గ్రూపు ఏర్పడింది. ఈ గ్రూపు బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో పార్టీని ధిక్కరించి వేరు కుంపటి పెట్టుకున్న సీఎం షిండే సహా ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఉద్ధవ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ప్రకటించేందుకు సిద్ధమైంది.
శివసేనలో తిరుగుబాటుపై దాఖలైన ఎనిమిది పిటిషన్లపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు రాజ్యాంగబద్ధతపై ఇవాళ తీర్పు వెలువరించబోతోంది. ఈ తీర్పులో ఒకవేళ షిండే తిరుగుబాటు అక్రమమని తేలితే ఆయనతో పాటు శివసేన నుంచి ఆయన చీల్చిన మొత్తం 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడబోతోంది. అదే జరిగితే షిండే సీఎం పదవి కోల్పోవడం ఖాయం. అంటే మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. దీంతో ఈ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వీ వాదించగా.. ఏక్ నాథ్ షిండే వర్గం తరఫున హరీష్ సాల్వే, నీరజ్ కౌల్, మహేష్ జెఠ్మలానీ వాదించారు. ఇవాళ సుప్రీంకోర్టు వెలువరించే తీర్పుపై ఉద్ధవ్, షిండే ఇరు వర్గాల్లోనూ ధీమా నెలకొంది. తమకు ప్రస్తుతం 288 మంది సభ్యుల అసెంబ్లీలో 184 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని షిండే వర్గం చెప్తుండగా.. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశగా సుప్రీంకోర్టు తీర్పు ఉంటుందని ఆశిస్తున్నట్లు ఉద్ధవ్ వర్గం తెలిపింది.












Click it and Unblock the Notifications