స్టాలిన్ క్లీన్ స్వీప్ జగన్ కు నేర్పుతున్న పాఠమిదే..! అసలు తేడా ఇక్కడే..
తాజాగా వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఇరుగుపొరుగున ఉన్న రెండు దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రా, తమిళనాడులో పూర్తి భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఇద్దరు యువ ముఖ్యమంత్రుల పాలనతో ఇరు రాష్ట్రాలు అనుసరించిన విధానాలతో జనం వారికి తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పు ఒకరికి మోదాన్నీ, మరొకరికి ఖేదాన్నీ మిగిల్చింది. అయితే ఇందుకు దారి తీసిన కారణాలు మాత్రం భవిష్యత్తులో ప్రభుత్వాలు నడపాలనుకునే ప్రతీ రాజకీయ పార్టీకి కచ్చితంగా పాఠమే.
తమిళనాడులో జరిగిన లోక్ సభ ఎన్నికల్ని డీఎంకే నేతృత్వంలోని ఇండీ కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేసి పారేసింది. మొత్తం 39 సీట్లతో పాటు పొరుగున ఉన్న పుదుచ్చేరి సీటులోనూ ఏకపక్షంగా విజయం సాధించింది. దీంతో అధికారం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ఎంకే స్టాలిన్ ప్రభుత్వ విధానాలపై ప్రభుత్వం ఏ స్ధాయిలో సంతృప్తిగా ఉన్నారో అర్దమవుతోంది. ముఖ్యంగా సంక్షేమంతో పాటు ఉద్యోగాల కల్పన, సమ్మిళిత అభివృద్ధితో ముందుకెళ్తున్న స్టాలిన్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

మరోవైపు ఏపీలో ఐదేళ్ల క్రితం 151 సీట్ల మెజార్టీతో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో దాదాపు రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది. పూర్తిగా సంక్షేమ పాలన అమలు చేసి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన జగన్ సర్కార్ కు జనం కర్చుకార్చి వాత పెట్టారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు దింపేశారు. అంటే ఏకంగా 140 సీట్లను లాగేసుకున్నారు. అయితే ఇంతటి జనాగ్రహం వెనుక ఏముందని చూస్తే కర్ణుడి చావుకి లక్ష కారణాల్లా కనిపిస్తున్నాయి. కానీ పొరుగున ఉన్న స్టాలిన్ పాలన చూస్తే ఎక్కడ తేడా కొట్టిందో అర్థమవుతుంది.
జగన్ లా స్టాలిన్ సంక్షేమ పథకాలు ఒక్కటే నమ్ముకోలేదు. ఐదేళ్ల క్రితం లోక్ సభ ఎన్నికల్ని డీఎంకే కూటమి క్లీన్ స్వీప్ చేశాక మూడేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్నీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత ఏర్పడిన స్టాలిన్ సర్కార్ సంక్షేమంతో పాటు ఉద్యోగాల కల్పన, ప్రజారోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యం, సమ్మిళిత అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లిన తీరు.. ఈసారి ఎన్నికల సమయంలో వారు ఏం చెప్తే జనం అది నమ్మే పరిస్ధితి తీసుకొచ్చింది.
సరిగ్గా రెండు నెలల క్రితం కోయంబత్తూరులో రాహుల్ పాల్గొన్న భారీ బహిరంగసభకు హాజరైన జనాన్ని చూసి బాహుబలిగా స్టాలిన్ అభివర్ణించారు. ఈ ఒక్క సభతో జనం బీజేపీని, దాని రహస్యమిత్రపక్షం అన్నాడీఎంకేని తుంగలో తొక్కారని తేల్చేశారు. చివరికి అదే నిజమైంది. మోడీని మళ్లీ గెలిపిస్తే రిజర్వేషన్లను తీసేస్తాడని, సామాజిక న్యాయం అంటే బీజేపీకి అలర్జీ అని స్టాలిన్, రాహుల్ చెప్పిన మాటల్ని తమిళనాడు అక్షరాలా నమ్మింది.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే భారీ సంక్షేమ పథకాల జోలికెళ్లకుండా మహిళలకు నెలకు వెయ్యి సాయం, పాఠశాల విద్యార్థులకు సీఎం అల్పాహార పథకం, మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అందించారు. రాష్ట్రానికి మేం ఇది చేశాం, మీరేం చేశారో చెప్పండని స్టాలిన్ అడిగిన ప్రశ్నకు మోడీ వద్ద సమాధానమే లేదు. ఎప్పుడో ముగిసిన కచ్చతీవు సమస్యను
కెలకడం ద్వారా స్టాలిన్ ను ఇరుకుపెట్టేందుకు మోడీ చేసిన ప్రయత్నాల్నీ శ్రీలంకనూ అడ్డుకోలేవు, చైనానూ ఎదిరించలేవంటూ
సమర్ధంగా తిప్పికొట్టారు. ఇవన్నీ స్టాలిన్ నేతృత్వంలోని కూటమికి మరో అప్రతిహత విజయాన్ని కట్టబెట్టాయి.












Click it and Unblock the Notifications