రైలు ఆపి ఘోరం: యువతిని పొదల్లోకి ఈడ్చుకెళ్లి గ్యాంగ్‌రేప్!
దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. తాజాగా రైలులో ప్రయాణిస్తున్న యువతిని రైలు ఆపి మరీ పొదల్లోకి లాక్కెళ్లి దారుణానికి ఒడిగట్టారు. బీహార్‌లోని జహానాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి తన నానమ్మ ఇంటికి వెళ్లేందుకు రైలులో ప్రయాణిస్తుండగా ఈ భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణం ప్రశాంతంగా సాగుతున్న సమయంలో.. చాకంద్, బేలా స్టేషన్ల మధ్య చేరుకోగానే కొంతమంది గుర్తుతెలియని దుండగులు అత్యవసర చైన్ లాగి రైలును ఆపారు. రైలు ఒక్కసారిగా ఆగగానే, నిందితులు యువతి ప్రయాణిస్తున్న కోచ్‌లోకి చొరబడి.. అందరూ చూస్తుండగానే ఆమెను బలవంతంగా బయటకు లాగి పట్టాల పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి ఈడ్చుకెళ్లారు.
పొదల్లోకి తీసుకెళ్లి మృగచర్య
రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి యువతిని తీసుకెళ్లిన ఐదుగురు నిందితులు.. పొదల్లో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ప్రాంతం జనసంచారం లేని అటవీ తరహా ప్రదేశం కావడంతో బాధితురాలు ప్రాణభయంతో ఎంతగా అరిచినా ఎవరూ రక్షించడానికి రాలేదు. తమ వికృత చేష్టలు ముగిసిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలు అతికష్టమ్మీద తన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిందంతా వివరించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

రంగంలోకి పోలీసులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బేలాగంజ్ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలని వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు అనుమానితులుగా భావిస్తున్న 10 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం నిందితులను గుర్తించడంలో పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.
ఎఫ్ఎస్‌ఎల్ బృందం శాస్త్రీయ విచారణ
కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న డీఎస్పీ రవి ప్రకాష్ సింగ్ స్వయంగా విచారణను పర్యవేక్షిస్తున్నారు. ఘటనాస్థలి నుంచి శాస్త్రీయ ఆధారాలను సేకరించడానికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందాన్ని రప్పించారు. రైలులో అసలు చైన్ ఎవరు లాగారు? ఆ సమయంలో నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అమానుష ఘటనతో గయా పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications