జేపీ నడ్డాకు చేదు అనుభవం... ప్రభుత్వంపై నేతల విమర్శలు
భారతీయ జనతాపార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురైంది. బీహార్ పర్యటనలో భాగంగా అక్కడి విద్యార్థులు జేపీ నడ్డా వాపస్ జావో అంటూ నినాదాలు చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో రెండు రోజులపాటు జరుగనున్న బీజేపీ ఫ్రంట్‌ల సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఆయన వచ్చారన్న విషయం తెలుసుకున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) కార్యకర్తలు సదస్సు జరుగుతున్న ప్రాంతం దగ్గరకు వచ్చి తమ నిరసనలు తెలియజేశారు. ఈ క్రమంలో వారు నడ్డాను అడ్డుకున్నారు.
జేపీ నడ్డా వాపస్ జావో అంటూ గట్టిగా నినాదాలు చేస్తుండటంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. జాతీయ విద్యా విధానం-2020ని వెనక్కి తీసుకోవాలని, పాట్నా విశ్వవిద్యాలయానికి కేంద్ర హోదా కల్పించాలని నినాదాలు చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారందరినీ చెదరగొట్టారు. అనంతరం, జేపీ నడ్డా కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు ఆయన పాట్నాలో రోడ్ షో నిర్వహించారు. జేడీయూ నేత నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ పర్యటనలో నిరసనలు ఎదుర్కోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఇంటిలిజెన్స్ వైఫల్యంతో ఏం జరుగుతుందో ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందని రాష్ట్ర బీజేపీ నేతలు నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి అధ్యక్షుడైన వ్యక్తి కార్యక్రమానికి హాజరవుతుంటే సాదాసీదాగా ప్రభుత్వం పరిగణించిందని, కనీసం విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఏం చేయబోతున్నారు? తదితర విషయాలపై అవగాహన లేకుండా ప్రవర్తించిందని మండిపడ్డారు. చిన్న చిన్న సంఘటనలు మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రభావం చూపుతాయన్నారు.












Click it and Unblock the Notifications