ఇండియా కూటమికి కొత్త ఫ్రెండ్..! నెక్ట్స్ వైఎస్సార్సీపీయేనా ?
ఎస్ఐఆర్ పై సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలో ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తూ విపక్ష ఇండియా కూటమి ఇవాళ భారీ ఎత్తున నిరసనలకు దిగింది. ఇందులో ఇండియా కూటమిని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీతో పాటు ఎస్పీ, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ వంటి పార్టీల ఎంపీలు తరలివచ్చారు. వీరితో పాటు ఓ కొత్త పార్టీ కూడా ఇండియా కూటమితో తొలిసారి జత కలిసింది. అదే ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(BJD) .
సీఈసీ, ఎస్ఐఆర్ అక్రమాలకు వ్యతిరేకంగా ఈరోజు ఢిల్లీలో ప్రతిపక్షాలు నిర్వహించిన నిరసన ప్రదర్శనకు బీజేడీకి చెందిన ఇద్దరు ఎంపీలు, మానస్ మంగరాజ్, సులతా డియో, అలాగే మాజీ ఎంపీ ముజిబుల్లా ఖాన్ తరలివచ్చారు. దీంతో తొలిసారి ఇండియా కూటమితో బీజేడీ చేయికలిపినట్లయింది. ఒడిశాలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరుసగా గెలుస్తూ వచ్చిన నవీన్ పట్నాయక్.. కేంద్రంలో మాత్రం బీజేపీకి మద్దతుగా నిలిచేవారు. కానీ ఎన్డీయేలో మాత్రం చేరకుండా దూరంగానే ఉండేవారు. దీంతో బీజేడీ.. ఎన్డీయేకు అనధికార మిత్రపక్షంగా కొనసాగింది. కానీ గత ఎన్నికల్లో ఆ ప్రభావం పడి బీజేడీ ఓడిపోయి బీజేపీ గెలవడంతో నవీన్ పట్నాయక్ రూటు మార్చినట్లు తెలుస్తోంది.

మరోవైవు బీజేడీ తరహాలోనే గత కొన్నేళ్లుగా అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఎన్డీయేకు అనధికార మిత్రపక్షంగా కొనసాగుతూ, పార్లమెంట్ లో, రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్న వైఎస్సార్సీపీ కూడా గత ఎన్నికల్లో నష్టపోయింది. ఈ ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి తమను పక్కా ప్లాన్ తో ఓడించారన్న కోపం ఆ పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికలసంఘం వివాదాలపై తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. అలాగే పార్టీ నేత శైలజానాథ్ సైతం సీఈసీ జ్ఢానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఇండియా కూటమిలో వైఎస్సార్సీపీ చేరవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేడీ ఇండియా కూటమి ఆందోళనల్లో పాల్గొనడంతో వైఎస్సార్సీపీ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది.













Click it and Unblock the Notifications
