మమత బెనర్జీకి మంచి ఛాన్స్- బెంగాల్ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులు వీళ్లే
పశ్చిమ బెంగాల్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. కీలకమైన నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి హసిరాణి రథ్, రెజినగర్ స్థానం నుంచి సఖరవ్ సర్కార్‌ను బరిలోకి దించుతున్నట్లు పార్టీ నాయకత్వం వెల్లడించింది. ఈ రెండింటికీ అక్టోబర్ 6వ తేదీన పోలింగ్ జరుగనుంది. 9న ఓట్లను లెక్కిస్తారు. బుధవారం నాటికి అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఐ తమ అభ్యర్థులను ప్రకటించాయి. తృణమూల్ తిరుగుబాటు అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో నిల్చోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నందిగ్రామ్.. ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం. ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి ఆయా పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఖాళీ చేసిన స్థానం కావడం వల్ల ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక్కడ గెలిచి బీజేపీకి షాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది.. తృణమూల్. ఈ రెండింట్లోనూ జెండా పాతితే, అటు బీజేపీ, ఇటు తిరుగుబాటుదారులకు చెక్ పెట్టే మంచి అవకాశం మమత బెనర్జీకి లభించింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజులకే హత్యకు గురైన సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ తల్లి హసిరాణికి టికెట్ ఇచ్చారు సువేందు అధికారి. ఆమె ఎంపికతో బెంగాల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈస్ట్ మేదినీపూర్ జిల్లా చండీపూర్ కు చెందిన 62 ఏళ్ల హసిరాణి రథ్‌కు రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉంది. గతంలో ఆమె తృణమూల్ లో పనిచేశారు కూడా. సువేందు అధికారితో ఉన్న సుదీర్ఘ అనుబంధం కారణంగా బీజేపీలో చేరారు.
సువేందుతో హసిరాణి కుటుంబానికి సుమారు రెండు దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఆయన రాజకీయ ఎదుగుదలలో మొదటి నుంచీ రథ్ కుటుంబమే ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చింది. 2020 డిసెంబర్లో సువేందు టీఎంసీని వీడి బీజేపీలో చేరినప్పుడు.. ఆమె కుటుంబ సభ్యులంతా కమలం పార్టీలో చేరారు. 2024 లోనే ఆమె భర్త కన్నుమూశారు. ఆ తర్వాత చంద్రకాంత్ రథ్ ను తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు సువేందు.
అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే చంద్రకాంత్ హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఆయన తల్లే బీజేపీ తరఫున నందిగ్రామ్ లో పోటీలో నిలిచారు. దీంతో నందిగ్రామ్ ఉపఎన్నికల బరిలో మొత్తం అయిదుమంది అభ్యర్థులు నిలిచినట్టయింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, ఆ పార్టీ చీలికవర్గం, కాంగ్రెస్, సీపీఐ మధ్య పోటీ నెలకొంది. టీఎంసీ తరఫున మమతా బెనర్జీ వర్గం సంచితా ప్రధాన్‌ను ఎన్నికల బరిలోకి దించింది. టీఎంసీ రెబెల్ వర్గం తరఫున మహ్మద్ ఎతేషాముల్ హక్ పోటీలో నిలిచారు. కాంగ్రెస్- మిలన్ ప్రధాన్, సీపీఐ- శాంతి గోపాల్ గిరి పోటీపడుతున్నారు.














Click it and Unblock the Notifications
