Alla Nani: మాజీ మంత్రి ఆళ్ల నాని ఇక లేరు-గుండెపోటుతో హఠాన్మరణం..!
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత ఆళ్ల నాని (Alla Nani) కన్నుమూశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్రంలో సేవలందించిన ఆయన ఇవాళ విశాఖలో గుండెపోటు కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఏలూరులో ఆయన అనుచరులు, రాజకీయ పార్టీల్లో విషాదం నెలకొంది. రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరున్న ఆళ్లనాని మరణంతో ఆయన సొంత నియోజకవర్గం ఏలూరులోనూ విషాదఛాయలు నెలకున్నాయి. నాని హఠాన్మరణంపై పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని.. 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2004 ఎన్నికల్లో తొలిసారి ఇక్కడి నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో మరోసారి గెలిచిన ఆళ్ల నాని.. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత 2013లో జగన్ స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో 2014లో ఆళ్ల నానిని జగన్.. పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. అనంతరం 2017లో ఎమ్మెల్సీని చేసి మండలికి కూడా పంపారు. 2019 ఎన్నికల్లో తిరిగి ఏలూరు అసెంబ్లీ సీటు నుంచి గెలిచి జగన్ కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి , డిప్యూటీ సీఎం అయ్యారు.

Deeply saddened by the passing of Shri Alla Kali Krishna Srinivas (Alla Nani), former Deputy Chief Minister of Andhra Pradesh. His dedicated public service and contribution to the state will always be remembered. Heartfelt condolences to his family, supporters and admirers. May… pic.twitter.com/FA24VbHC4E
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 15, 2026
గత అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయిన ఆళ్ల నాని.. అనంతరం 2024 ఆగస్టులో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2025 ఫిబ్రవరిలో టీడీపీలో చేరిన ఆళ్ల నాని అప్పటి నుంచీ అదే పార్టీలో కొనసాగుతున్నారు. అలా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా అంచెలంచెలుగా ఎదిగిన ఆళ్ల నాని..ఇవాళ ఉన్నట్లుండి గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ ఆయన తుది శ్వాస విడిచారు. కాపు సామాజిక వర్గంలో పట్టున్న నేత కూడా అయిన ఆళ్ల నాని మరణం గోదావరి జిల్లాల్లో, ఏపీ రాజకీయాల్లో తీరని లోటుగా భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications
