బీజేపీ అభ్యర్థి వాహనంపై ఇటుకలతో దాడి, గాయాలు: హింస సరికాదంటూ కేంద్రమంత్రి సీరియస్
చండీగఢ్: పంజాబ్‌లోని గిల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుచా రామ్ లాధర్‌పై దుండగులు దాడి చేశారు. ఆదివారం సాయంత్రం లాధర్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో గాయపడి ఆస్పత్రి పాలయ్యారని పోలీసులు తెలిపారు. లూథియానాలోని తన నియోజకవర్గంలోని ఓ గ్రామం నుంచి ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది.
లాధర్ కారుపై కొందరు వ్యక్తులు ఇటుకలను విసిరారు. ఈ దాడిలో అతనికి గాయాలు అయ్యాయి, సంఘటన జరిగిన ప్రాంతానికి చెందిన పోలీసు అధికారి ఫోన్‌లో తెలిపారు.
లాధర్‌ను లూథియానా సివిల్ ఆసుపత్రికి తరలించామని, అతని పరిస్థితి నిలకడగా ఉందని పోలీసు అధికారి తెలిపారు. "తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి" అని పోలీసు అధికారి తెలిపారు.

63 ఏళ్ల రిటైర్డ్ బ్యూరోక్రాట్ అయిన లాధర్ 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం లూథియానా రిజర్వ్ చేయబడిన గిల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, తమ పార్టీ అభ్యర్థిపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నా బీజేపీ నేతలు. పంజాబ్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోతోందన్నారు.
పంజాబ్‌లో బీజేపీ పాపులారిటీ గ్రాఫ్ పెరుగుతోందని, ప్రత్యర్థులు బెదిరింపులకు దిగుతున్నారని కేంద్ర మంత్రి, పంజాబ్‌కు ఆ పార్టీ ఇంచార్జ్ గజేంద్ర సింగ్ షెకావత్ మండిపడ్డారు. సోమవారం లూథియానా జిల్లాలో పార్టీ అభ్యర్థి సుచా రామ్ లాధర్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు.
నాగరిక సమాజంలో హింస ఆమోదయోగ్యం కాదని షెకావత్ అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని, మా నాయకులను, కార్యకర్తలను హింసాత్మకంగా బెదిరింపులకు గురికానివ్వబోమని ఆయన అన్నారు.
భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థులు హింసతో కాకుండా ఓట్లతో పోరాడాలని షెకావత్ సవాల్ విసిరారు. ఈ సంఘటనలు అన్ని చోట్లా బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారని, తీవ్ర నిరాశతో ఉన్న ప్రత్యర్థులు ఇప్పుడు హింసను ఉపయోగించి వారిని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని షెకావత్ ఆరోపించారు.
ప్రభుత్వ అధికారులు, పోలీసులు తమ విధులను చట్ట ప్రకారం నిర్వహించాలని, ఎవరికీ భయపడవద్దని షెకావత్ కోరారు. ప్రజలను రక్షించడానికి మీరు ఉన్నారని, ప్రస్తుత కాలంలో మీపై అదనపు బాధ్యత ఉందని, వారు తమను తాము ఎవరి ప్రభావానికి గురికాకూడదని స్పష్టం చేస్తూ అధికారులను కోరారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టంచేశారు. ఫిబ్రవరి 20న పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10 ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications