బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే- కర్ణాటక నుంచి.. !!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. కూటమి నుంచి మొత్తం నలుగురు ఎంపికయ్యారు. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేట్ అయ్యారు. సానా సతీష్ పెద్దల సభకు ఎంపికకావడం వరుసగా ఇది రెండోసారి. జనసేన నుంచి ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ నామినేషన్ సైతం దాఖలు చేశారు.
తాజాగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ రాజ్యసభ, అలాగే కర్ణాటక శాసనమండలి ఎన్నికల కోసం తమ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. రాబోయే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ నుండి మహేష్ కేవత్‌ను, కర్ణాటక నుండి ప్రొఫెసర్ డాక్టర్ ఎం నాగరాజును పార్టీ అభ్యర్థులుగా ఖరారు అయ్యారు. అదేవిధంగా కర్ణాటక శాసనమండలి స్థానాల కోసం లింగరాజ్ పాటిల్, రఘు కౌటిల్య పేర్లను పార్టీ ఎంపిక చేసింది.

రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా అభ్యర్థుల ఎంపిక వేగవంతమైంది. నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు తమ పత్రాలను దాఖలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జూన్ 18న జరగనున్న ఈ ఎన్నికల్లో 10 రాష్ట్రాలకు చెందిన 24 స్థానాలకు పోటీ నెలకొంది. ఈ ఫలితాలు పార్లమెంటు ఎగువ సభలో రాజకీయ సమీకరణాలను గణనీయంగా మార్చనున్నాయి. ఎన్నికల కమిషన్ జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేయగా, నామినేషన్ల దాఖలుకు జూన్ 8వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది.
ఎన్నికలు జరగనున్న ఈ 24 స్థానాల్లో కర్ణాటక, ఏపీ, గుజరాత్ నుంచి నాలుగేసి స్థానాలు ఖాళీ అయ్యాయి. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల నుంచి మూడు, జార్ఖండ్ నుంచి రెండు చొప్పున స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల నుంచి ఒక్కో స్థానం చొప్పున ఉన్నాయి. వీటితో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోని ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికల కోసం కూడా ప్రత్యేక నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
మధ్యప్రదేశ్‌లో నామినేషన్ల ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, అలాగే పార్టీ నేత రజనీష్ అగర్వాల్ తమ నామినేషన్లను సమర్పించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో వారు ఈ పత్రాలను అధికారులకు అందజేశారు. నిర్ణీత గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాజ్యసభ స్థానాల కోసం అభ్యర్థులందరూ నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications