బిజెపి భయం: నాలుగు కంపెనీలను మూసేసిన వాద్రా
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తన వ్యాపార కార్యకలాపాలకు ముగింపు పలికే దిశగా నడుస్తున్నారు. హర్యానాలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాబర్ట్ వాద్రా భూలావాదేవీలపై విచారణ జరిపిస్తామని ప్రకటించింది. దీంతో రాబర్ట్ వాద్రా రాజస్థాన్, హర్యానాల్లోని తన కంపెనీలను మూసేసే ప్రక్రియను ప్రారంభించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
రాబర్డ్ వాద్రా కంపెనీల మూసివేత ప్రక్రియపై డిఎన్ఎ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఆ వార్తాకథనం ప్రకారం - రాజస్థాన్, హర్యానాల్లో వాద్రా ఆరు కంపెనీలను స్థాపించారు. వాటిలో నాలుగు కంపెనీలను మూసేసినట్లు కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పత్రాలను బట్టి తెలుస్తోంది.
లైఫ్‌లైన్ ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్‌వేవ్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, రైట్‌లైన్ అగ్రికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైమ్‌టైమ్ ప్రవేట్ కంపెనీలను మూసేశారు. ఫ్యూచర్ ఇన్‌ఫ్రా ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, బెస్ట్ సీజన్స్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను కూడా మూత వేసే దిశగా నడిపిస్తున్నట్లు సమాచారం. ఆరు కంపెనీలు కూడా 2012లో ప్రారంభమయ్యాయి.

బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ అధికారంలోకి రాగానే తన కంపెనీలను మూసివేసే ప్రక్రియను వాద్రా ప్రారంభించారు. ఈ ఏడాది మే వరకు కూడా ఆ కంపెనీలు చురుగ్గా పనిచేశాయని కార్పోరేట్ మంత్రిత్వ శాఖ పత్రాలు తెలియజేస్తున్నాయి.
వాద్రా స్థాపించిన ఆరు కంపెనీలు కూడా వ్యవసాయ సంబంధిత పరిశ్రమలే కావడం విశేషం. ఆ కంపెనీలు భూములు, వ్యవసాయ టెక్నాలజీ లావాదేవీల కార్యకలాపాలను సాగించేవే. ఆరు కంపెనీలకు కూడా వాద్రా మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. హర్యానా, రాజస్థాన్‌ల్లోని భూములను కూడా వాద్రా విక్రయిస్తున్నట్లు డిఎన్ఎ రాసింది.
హర్యానాలో వివాదాస్పద భూ లావాదేవీలపై ప్రశ్నించిన టీవీ సిబ్బందిపై వాద్రా దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో ఈ వార్తాకథనం అచ్చయింది. కాగా, వాద్రాను కాంగ్రెసు పార్టీ వెనకేసుకొచ్చింది. వాద్రా తీరుపై బిజెపి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.












Click it and Unblock the Notifications