పార్లమెంటరీ ప్యానెల్ నుంచి బీజేపీ ఎంపీల వాకౌట్: జైరాం రమేష్ రాజీనామా ప్రకటనతో వెనక్కి
న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాక్సిన్ స్ట్రాటజీ, జీనోమ్ సీక్వెన్స్‌పై బుధవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి బీజేపీ ఎంపీలు వాకౌట్ చేశారు. అయితే, ప్యానెల్ ఛైర్మన్ జైరామ్ రమేష్ రాజీనామా చేస్తానని ప్రకటించడంతో తిరిగి వెనక్కివచ్చేశారు.
సైన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కరోనా టీకా అభివృద్ధి, జన్యువు అమరికపై చర్చించేందుకు జరిగిన సమావేశానికి ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ వికయ్ రాఘవన్, డీజీ సీఎస్ఐఆర్ శేఖర్ ఆహ్వానించారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియపై రాజకీయం చేస్తున్నారని మండిపడుతూ బీజేపీ సభ్యులు ప్యానెల్ నుంచి వాకౌట్ చేశారు. దీంతో కొంత నాటకీయ పరిణామాలు చేసుకున్నాయి. ఆ తర్వాత బీజేపీ సభ్యులు తిరిగివస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని ప్యానెల్ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటించారు.

గత సమావేశాల్లో చర్చలకు ఈ భేటీ కొనసాగింపేనని జైరాం రమేష్ తెలిపారు. చర్చను నిలిపేసేందుకే బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారని ఆయన ఆరోపించారు. అందుకే తాను రాజీనామాకు సిద్ధపడినట్లు తెలిపారు. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చని, రాజ్యసభ ఛైర్మన్‌కు కూడా చేయవచ్చని రమేష్ అన్నట్లు ప్యానెల్ వర్గాలు వెల్లడించాయి. అయితే, సమావేశం మాత్రం ఆగకూడదని రమేష్ స్పష్టం చేశారు.
'ఎజెండా శాస్త్రీయమైనది. శాస్త్రీయ పరిశోధన విభాగాలను మాత్రమే పిలిచారు. 90 నిమిషాలు సానుకూల చర్చలు జరిగాయి' అని ప్యానెల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కరోనా డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్లు భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపుతాయని సమావేశంలో చర్చించారు ఎంపీలు ఇందుకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. వ్యాక్సిన్ కేటాయింపులు, ధరల నిర్ణయం, అవసరమైన వారికి వెంటనే వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లపై చర్చించారు.












Click it and Unblock the Notifications