2019 ఎన్నికలే టార్గెట్: డిసెంబర్ 1 నుంచి బీజేపీ పాదయాత్ర
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో ఐదురాష్ట్రాల ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా... బుధవారం రోజున మధ్యప్రదేశ్, మిజోరాంలలో పోలింగ్ జరిగింది. డిసెంబర్ 7న తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రజలతో మమేకం అవ్వాలన్న ఆలోచనలో ఉంది. అంతేకాదు 2019 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా కార్యకర్తల్లో జోష్‌ను పెంచేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి మండలంలో 10 కిలోమీటర్ల మేరా పాదయాత్రకు ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ.
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కమలం పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రతి మండలంలో 10 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించేందుకు కమలనాథులు రెడీ అవుతున్నారు. ఈ పాదయాత్ర ప్రతి మండలంలో మొదలై పట్టణ ప్రాంతాలవరకు సాగేలా ప్లాన్ చేస్తున్నారు. తద్వారా ఇటు గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు పట్టణాల్లో ఉన్న ప్రజలతో కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు కమలనాథులు. ఈ పాదయాత్రలో ఆయా ప్రాంతాల నుంచి 50 -60 మంది ముఖ్య నాయకులు పాల్గొని ప్రజలను కలుసుకుంటారు.

డిసెంబర్ 1 నుంచి ఈ పాదయాత్రలు ప్రారంభమై డిసెంబర్ 15న ముగుస్తాయని తెలుస్తోంది. ఇందుకోసం ప్రతి మండలంలో ఒక గ్రూపును ఇప్పటికే నియమించడం జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రతి రోజు ఒక కొత్త వ్యక్తి గ్రూపును నడిపే బాధ్యత తీసుకుంటారని కమలం పార్టీ పేర్కొంది. ఈ పాదయాత్రలో పాల్గొనే ప్రజలకు వారి భోజనవసతులు ఏర్పాటు కూడా గ్రూపు సభ్యులే తీసుకుంటారని పార్టీ సభ్యులు చెప్పారు. ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు సమాచారం. ముందుగానే నిర్ణయించిన ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలై ఎక్కడైతే పాదయాత్ర ముగుస్తుందో అక్కడ రాత్రి బస చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని సమాచారం.












Click it and Unblock the Notifications