బీజేపీ మేనిఫెస్టో- అమ్ములపొదిలో రామబాణాలు: కూటమికి షాక్
BJP Manifesto: దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. దీనికోసం అవసరమైన వ్యూహాలను రూపొందించుకున్నాయి.
మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన తొలి విడత పోలింగ్ షెడ్యూల్ అయింది. దీనికి అవసరమైన నామినేషన్ల ప్రక్రియ సైతం పూర్తయింది. తమిళనాడు సహా మొత్తం 13 రాష్ట్రాల్లో 89 లోక్‌సభ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశలో పోలింగ్ ముగుస్తుంది. అదే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

తొలి విడత పోలింగ్ పోలింగ్ సమీపించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేనిఫెస్టో సంకల్పపత్రను ప్రకటించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల్లో- ఉపాధి హామీ, 2036లో భారత్‌లో ఒలింపిక్స్‌ను నిర్వహించడం, మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడం, మహిళా రిజర్వేషన్ అమలు, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, మత్స్యకారుల కోసం సంక్షేమ పథకాలు ఉన్నాయి.

ఇ-శ్రమ్ ద్వారా సంక్షేమ పథకాలను లబ్దిదారులకు చేరవేయడం, యోగా అధికారిక గుర్తింపు కల్పించం, 2025 సంవత్సరాన్ని ట్రైబల్ ప్రైడ్ ఇయర్‌గా ప్రకటించడం, ప్రతి రంగంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమాన గౌరవాన్ని కల్పించడం, దేశంలో గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌ని సృష్టించడానికి సన్నాహాలు చేస్తామని బీజేపీ ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా రామాయణ మహోత్సవాలు జరుపుకొనేలా చర్యలు తీసుకోవడం, అయోధ్య నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయడాన్ని కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది బీజేపీ. అలాగే వన్ నేషన్, వన్ ఎలక్షన్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామనీ వెల్లడించింది.
రైల్వేలో వెయిటింగ్ లిస్ట్ సమస్యను తొలగించడానికి అన్ని చర్యలను తీసుకుంటామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ల తయారీ, అంతరిక్ష రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలపడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని బీజేపీ పేర్కొంది.












Click it and Unblock the Notifications