భగ్గుమంటోన్న బీజేపీ- రాత్రికి రాత్రి దేశవ్యాప్త నిరసనలకు పిలుపు..!!
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థిితులు నెలకొన్నాయి. ప్రస్తుతం చైనాతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటోన్న పరిస్థితుల్లో తాజాగా- పాకిస్తాన్ సైతం భారత్‌పై మాటల తూటాలను సంధిస్తోంది. దీనిపై భారత్ ఎదురుదాడికి దిగింది..ధీటుగా బదులిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య నామమాత్రంగా ఉన్న దౌత్య సంబంధాలను మరింత బలహీనపర్చినట్టయింది.
పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఘాటుగా విమర్శలను సంధించడం దీనికి కారణమైంది. అమెరికన్ సైనికుల ఎదురుకాల్పుల్లో హతమైన అంతర్జాతీయ ఉగ్రవాది, అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌తో ప్రధాని మోదీని పరోక్షంగా పోల్చారు. ఒసామా బిన్ లాడెన్ చనిపోయినప్పటికీ.. గుజరాత్‌లో ఆ కసాయి ఇంకా బతికే ఉన్నాడని, అతను భారత ప్రధానిగా పని చేస్తోన్నారని బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు.

అక్కడితో ఆగలేదాయన. మోదీ ప్రధాని అయ్యే వరకు తమ దేశంలోకి రాకుండా అమెరికా నిషేధించిందని గుర్తు చేశారు. ప్రధానిగా ఎన్నికైన తరువాతే ఆయన ప్రవేశం లభించిందని పేర్కొన్నారు. మోదీ భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహించట్లేదని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తోన్నట్లు కనిపిస్తోందని బిలావల్ భుట్టో అన్నారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కూడా ఆర్ఎస్ఎస్‌కే పని చేస్తోన్నారని వ్యాఖ్యానించారు.
దీని పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం వెలువడింది. రాష్ట్రశాఖ నాయకులు ఇందులో పాల్గొనాల్సి ఉంటుందని సూచించింది. బిలావల్ భుట్టో వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్ఠిబొమ్మలను దగ్ధం చేసేలా ఆయా రాష్ట్రాల బీజేపీ నాయకులు ప్లాన్ వేసుకున్నారు.

బిలావల్ భుట్టో ఉపయోగించిన భాష అనాగరికంగా ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇది రాజనీతిజ్ఞత అనిపించుకోదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించదని, దానికి పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. గ్లోబల్ లీడర్ ప్రధాని మోదీని విమర్శించేంత స్థాయి బిలావల్ భుట్టోకు లేదని హితబోధ చేస్తోన్నారు. మోదీకి వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యలతో ప్రపంచ వేదికలపై పాకిస్తాన్ ప్రతిష్ఠ మరింత తగ్గిందని అన్నారు.












Click it and Unblock the Notifications