బ్రహ్మోస్‌కు తాత!: భారత్ కొత్త 'గేమ్'.. శత్రుదేశాల గుండెల్లో గుబులు షురూ!
India Missile Test: భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. బ్రహ్మోస్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన ఒక కొత్త క్షిపణిని పరీక్షించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరీక్ష ఆగస్టు 20-21, 2025 తేదీలలో హిందూ మహాసముద్రంలో జరగనుంది. ఈ క్షిపణి పరీక్ష గురించి ముందుగా వైమానిక దళానికి హెచ్చరికగా NOTAM(Notice to Airmen) జారీ చేయడం ద్వారా ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరీక్ష విజయవంతమైతే అది పాకిస్థాన్ సహా ఇతర శత్రు దేశాలకు ఒక బలమైన హెచ్చరికగా మారుతుంది.
NOTAM అంటే ఏమిటి?
NOTAM అనేది విమానయాన కార్యకలాపాలకు సంబంధించిన ఒకహెచ్చరిక లేదా సమాచారం. భారత ప్రభుత్వం ఆగస్టు 20-21 తేదీల కోసం NOTAM జారీ చేసిందంటే.. ఆ నిర్దేశిత సమయంలో, ప్రాంతంలో ఎలాంటి విమానాలు ప్రయాణించకూడదని సూచన. ఈ సారి ఒడిశా తీరం నుంచి సుమారు 4,790 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతం డేంజర్ జోన్‌గా ప్రకటించబడింది. గతంలో మే 23-24 తేదీలలో కూడా అండమాన్, నికోబార్ దీవుల చుట్టూ ఇలాంటి NOTAM జారీ చేయబడింది.

ఏ క్షిపణిని పరీక్షించబోతున్నారు?
ఈ క్షిపణి ఏదని అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇది బ్రహ్మోస్ కంటే శక్తివంతమైనదని అంచనా వేస్తున్నారు. ఈ పరీక్ష కోసం జారీ చేసిన NOTAM ప్రకారం.. దీని పరిధి 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండవచ్చని.. ఇది ఒక సుదూర బాలిస్టిక్ క్షిపణి కావచ్చని భావిస్తున్నారు. ఇది అగ్ని సిరీస్‌లోని కొత్త క్షిపణి కావచ్చని కూడా రక్షణ వర్గాలు సూచిస్తున్నాయి.
సోషల్ మీడియాలో చర్చ.. క్షిపణి లక్షణాలు
సోషల్ మీడియాలో ఈ క్షిపణి గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇది భారత్ ఇప్పటివరకు పరీక్షించిన వాటిలోకెల్లా అత్యంత సుదూర పరిధి గల క్షిపణి కావచ్చని నిపుణులు, నెటిజన్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, ఈ క్షిపణి హైపర్‌సోనిక్ టెక్నాలజీతో కూడుకున్నదై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్షిపణిని భూమి, గాలి లేదా సముద్రం నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఈ కొత్త క్షిపణి మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడుతుంది. ఇప్పటికే రష్యాతో కలిసి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్‌కు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త క్షిపణి భారత్ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసి, శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించడం ఖాయం.












Click it and Unblock the Notifications