వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫ్రికా చీతాలను తెచ్చి భారత్‌లో సింహాల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారా.. చీతాల ప్రాజెక్టుపై వ్యతిరేకత ఎందుకు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సింహాలు

భారత్‌లో చీతాలు అంతరించిపోయినప్పటికీ మళ్లీ ఇప్పుడు వాటి సంతతి పెంచే దిశగా దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 16 చీతాలను విడిగా ఉంచారు. నమీబియా నుంచి కూడా మరో నాలుగు చీతాలను తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కులో ప్రవేశపెడతారు. అయితే, ప్రస్తుతం గుజరాత్‌కు మాత్రమే పరిమితమైన ఆసియా సింహాలను కూడా ఇదే అభయారణ్యంలో ప్రవేశపెట్టాలని ఎప్పటి నుంచో పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

ఆసియా సింహాలను పరిరక్షించే ప్రాజెక్టుపై 1985 నుంచి పనిచేస్తున్న అటవీ జంతువుల నిపుణుడు, శాస్త్రవేత్త డాక్టర్ రవి చెల్లం ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు. బయోడైవర్సిటీ కొలాబరేటివ్ నెట్‌వర్క్‌కు ఆయన కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఆఫ్రికా చీతాల వల్ల ఆసియా సింహాలపై ప్రభావం గురించి ఆయన బీబీసీతో మాట్లాడారు.

రవి చెల్లం

ఆఫ్రికా చీతాలను భారత్‌లో ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీన్ని రీ-ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్‌గా ప్రభుత్వం చెబుతుంటే.. మీరు ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్‌ అని ఎందుకు అంటున్నారు?

ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు. దీనిపై జనవరి 2020లో సుప్రీం కోర్టు ఒక ఆదేశం జారీచేసింది. ఇవి ఆఫ్రికా చీతాలు. వీటిని భారత్‌లో ప్రవేశపెట్టడాన్ని ఇంట్రడక్షన్ కిందే చూడాలి. అంతేకానీ, రీ-ఇంట్రడక్షన్‌గా చూడకూడదు అని చెప్పింది. అంటే ఇక్కడ అంతరించిపోయిన వాటిని మళ్లీ ప్రవేశపెట్టడం లేదు. కొత్త వాటిని తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కుకు ఈ చీతాలను తీసుకొస్తున్నారు. అయితే, ఆసియా సింహాలను తరలించాలని గతంలోనే మీరు సూచిస్తున్నారు. సుప్రీం కోర్టు కూడా మీరు చెప్పేదానికి మద్దతు పలికింది. నిజంగా ఇక్కడకు సింహాలను తీసుకురావడం అంత ముఖ్యమా?

మీరు సింహాల చరిత్రను చూసుకుంటే.. ఒకప్పుడు వీటి సంఖ్య 20కి పడిపోయింది. మళ్లీ ఇప్పుడు 700కు పెరిగింది. అయితే ఇవన్నీ ప్రస్తుతం గుజరాత్‌లోనే ఉన్నాయి.

అంతరించిపోయే ముప్పు ఉన్న జంతువులను ఒకే ప్రాంతానికి పరిమితం చేయకూడదని అటవీ జంతువుల పరిరక్షణ శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా వాటిని రెండు, లేదా మూడు చోట్లకు విస్తరింపజేయాలి. అప్పుడే వాటి భవిష్యత్ బావుంటుంది. ఎందుకంటే ఏదైనా మహమ్మారులు వ్యాపించినా లేదా కార్చిచ్చులు చెలరేగినా, తుపానులు వచ్చినా అన్ని ఒకేచోట ఉండటం చాలా పెద్ద ముప్పులాంటిది.

సింహాలు

ఒకవేళ రెండు, మూడు ప్రాంతాలకు వీటిని విస్తరించినా.. అన్నిచోట్లా ఇలాంటి ముప్పులు వచ్చే అవకాశం ఉంటుందిగా?

జరగొచ్చు. అనుకోనిది ఏదైనా జరగొచ్చు. కానీ, కూనోకు తరలించడం అనేది సింహాలకు ఒక జీవిత బీమా తీసుకోవడం లాంటిది.

ఒకవేళ సింహాలను కూనోకు తరలించకపోతే, వచ్చే ముప్పులు ఏమిటి?

ఆఫ్రికాలో ''సెరెంగెటి మారా’’ అనేది చాలా ముఖ్యమైన ప్రాంతం. ఇది కెన్యా, టాంజానియా దేశాల్లో వేల చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ 3,000 సింహాలు ఉన్నాయి. కానీ, 1994లో వచ్చిన కెనైన్ డిస్టెంపర్ వైరస్‌తో రెండు, మూడు వారాల్లోనే దాదాపు వెయ్యి సింహాలు చనిపోయాయి తెలుసా?

రవి చెల్లం

కానీ, ఇక్కడి పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి విపత్తులు రాకుండా ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?

దీని గురించి మనం ఏళ్లుగా మాట్లాడుకుంటున్నాం. ఆఫ్రికాలో మాత్రమే అలాంటివి జరుగుతాయి.. కానీ గుజరాత్ అలా కాదని కొందరు చెబుతున్నారు. 2018లో అలాంటి పరిస్థితులు ఇక్కడ కూడా వచ్చాయి. అప్పుడు 30 నుంచి 40 సింహాలు మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, వాస్తవానికి ఈ మృతులు చాలా ఎక్కువగా ఉండొచ్చని వార్తలు వచ్చాయి.

మరోవైపు ప్రస్తుతం భారత్‌లో ఉన్న 700 సింహాల్లో 300 అభయారణ్యాల్లో జీవించడం లేదు. అడవులకు వెలుపల, గ్రామాల్లో, పొలాల్లో ఇవి తరచూ కనిపిస్తుంటాయి. ఇవి పరిసరాల్లోని కుక్కలు, పశువులను ఆహారంగా తీసుకుంటున్నాయి. వీటికి వైద్య సదుపాయాలు కూడా అందే అవకాశం చాలా తక్కువ. కాబట్టి వ్యాధుల ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది.

2015లో భారీ వర్షాలకు ముంచుకొచ్చిన వరదల్లో ఎక్కువగా సింహాలే మరణించాయి. అందుకే సింహాలన్నీ ఒకే చోట ఉంటే ఇలాంటి ముప్పులు మరింత ఎక్కువగా ఉంటాయి.

సింహాలను వేరే ప్రాంతానికి తరలించాలనే వాదనకు సుప్రీం కోర్టు కూడా మద్దతు పలికింది. మరి ఆదేశాలను ప్రభుత్వం పాటించాల్సి ఉంటుంది కదా? మీరే చెప్పండి.

చీతా

ప్రస్తుతం గుజరాత్‌లో గిర్ అభయారణ్యంలో ఉన్న సింహాల పరిస్థితి ఎలా ఉంది?

గిర్ అభయారణ్యం పరిధిలోని సింహాలు బానే ఉన్నాయి. అయితే, లోపల ఉండే సింహాలు మాత్రమే బావుండాలి.. బయట ఉండేవి.. అలా గాలికే పోవాలి అనుకోకూడదు కదా.

ఒకవేళ బయట ఉండే సింహాలు మళ్లీ అడవిలోకి వస్తే.. అవి వ్యాధుల ముప్పును కూడా వెంట బెట్టుకొని వస్తాయి. దీంతో మరిన్ని సింహాలు మరణించే ముప్పు ఉంటుంది.

అభయారణ్యం పరిధిలోని సింహాలను బాగానే చూసుకుంటున్నారు. అందుకే వాటి సంఖ్య పెరుగుతోంది. అయితే, మిగతావాటి సంరక్షణ కూడా చూసుకోవాలి కదా.

నిజానికి ఇక్కడ సంకుచిత ఆలోచనలు బాగా ఎక్కువైపోయాయి. సింహాలకు పుట్టినిల్లుగా భావించే గుజరాత్‌లోనే అన్ని ఉండాలని ఆలోచిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?

మధ్యప్రదేశ్‌ నుంచి నర్మదా నీళ్లను గుజరాత్‌కు తెచ్చుకునేటప్పుడు ఏ సమస్యా ఎందుకు రావడం లేదు? సింహాలను పంపిస్తేనే సమస్య వస్తుందా?

చీతా

ఇప్పుడు చీతాల గురించి మాట్లాడుకుందాం. భారత్‌కు వస్తున్న చీతాలు కొత్త వాతావరణానికి అనుగుణంగా మారడానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది.

నాకు తెలిసి, దీనిలో పెద్ద సమస్యలేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడకు తీసుకొచ్చిన వాటిని జాగ్రత్తగా గమనిస్తారు. నెమ్మదిగా వీటిని సంరక్షణ కేంద్రాల్లో వదిలిపెడతారు. వెంటవెంటనే తీసుకునే చర్యలేమీ ఉండవు.

వాటి కోసం ఐదు నుంచి పది చ.కి.మీ. పరిధిలో ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుచేశారు. నాలుగు నుంచి పది వారాల పాటు వీటిలోనే మొదట చీతాలను ఉంచుతారు. వాటిలో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తున్నాయా? లాంటివి మొదట్లోనే జాగ్రత్తగా గమనిస్తారు.

మరోవైపు కూనో వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే, లెపర్డ్‌లు, సింహాలు, పులల కంటే చీతాలకు విశాలమైన ప్రాంతాలు అవసరం. ఒకటి లేదా రెండు చీతాల కోసం వంద చ.కి.మీ. స్థలం కేటాయించాల్సి ఉంటుంది. కానీ, అదే ప్రాంతాల్లో మనం 8 నుంచి 12 సింహాలు, లెపర్డ్‌లను ఉంచొచ్చు.

అంటే మీరు 50 నుంచి 60 చీతాలను పెంచాలని అనుకుంటే.. వాటికి ఎంత సువిశాల ప్రాంగణం అవసరం అవుతుందో అంచనా వేయండి. నిజానికి అంత చోటు మన దగ్గర ఉందా.

మరోవైపు మనుషులతోనూ చీతాలకు ఘర్షణ వాతావరణం తలెత్తొచ్చు. అవి ఇక్కడ మనుగడ సాగించగలవు. కానీ, వాటి సంఖ్యను పెంచుకోగలవా? అనేదే అసలు ప్రశ్న.

చీతాలను తీసుకొచ్చిన తర్వాత కొన్ని సింహాలను కూడా ఇక్కడికి తీసుకురావచ్చు కదా? లేదంటే వేరే సురక్షిత ప్రాంతాలకు వాటికి తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా?

ఈ విషయంలో 2013లోనే సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మనం వాటిని పాటించకపోతే.. సుప్రీం కోర్టును అగౌరవపరిచినట్లే.

ఒకవేళ చీతాలను కూనోకు తీసుకొచ్చినప్పటికీ, సింహాలను గుజరాత్ నుంచి వేరే ప్రాంతాలకు తరలించే మార్గంపైనా మనం దృష్టి పెట్టాలి.

2013లోనే ఆరు నెలల్లోనే సింహాలను వేరే ప్రాంతాలకు తీసుకెళ్లాలని సుప్రీం కోర్టు సూచించింది. కానీ, ఇప్పటికి తొమ్మిదేళ్లు గడిచాయి. నిజానికి సింహాలను కేవలం పొరుగునున్న గుజరాత్ నుంచి తీసుకొస్తే చాలు. మనం వాటినేమీ ఖండాలు దాటించాల్సిన పనిలేదు.

కానీ, చీతాలపై ఆదేశాలు జనవరి 2020లో వచ్చాయి. రెండేళ్లలోనే వాటిని ఆఫ్రికా నుంచి ఇక్కడకు దించుతున్నారు.

సింహాలను తీసుకొస్తారని చెప్పి కూనోలో 1,600 గిరిజన కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించారు. చాలా కష్టం మీద వారు ఇతర ప్రాంతాల్లో జీవిస్తున్నారు. వారికి ఇప్పుడు ఎవరు సమాధానం చెబుతారు.

ఇక్కడ జంతువుల పరిరక్షణతోపాటు చట్టాలను పక్కాగా అమలు చేయడంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bringing cheetahs from Africa is endangering the survival of lions in India.. Why the protest to the cheetah project
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X