స్టాలిన్ ఆగ్రహం.. గంటల్లోనే విజయ్ యూటర్న్..!
తమిళనాడులో ప్రభుత్వాన్ని నడుపుతోంది విజయా లేక స్టాలినా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే విపక్ష నేత కూడా కాని స్టాలిన్ ఆగ్రహం నేపథ్యంలో ఇప్పటికే తన ఆస్దాన జ్యోతిష్యుడిని ఓఎస్డీని చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకున్న విజయ్ (Vijay)..ఇప్పుడు అలాంటిదే మరో నిర్ణయం తీసుకున్నారు. అదేంటో, దానికి దారితీసిన కారణాలేంటో, డీఎంకే అధినేత (MK stalin) ఆగ్రహం ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఈ నెల 19న తమిళనాడు గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన టెండర్ వివాదాస్పదమైంది.కాంచీపురం జిల్లాలో 30,000 లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం ఉద్దేశించిన ఈ కాంట్రాక్టు విలువ ₹16.83 లక్షలు. టెండర్‌ను ఉదయం 9 గంటలకు విడుదల చేసి, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా బిడ్‌లు సమర్పించాలని కోరారు. కేవలం ఆరు గంటల స్వల్ప గడువును చూసి జనం ఆశ్చర్యపోయారు. వాస్తవానికి బిడ్‌లు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తెరవాల్సి ఉంది. ఈ టెండర్ వివరాల స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పారదర్శకత లోపించిందని, ఒకానొక కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చే ప్రయత్నమని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. డీఎంకే రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ అముతరాసన్, ఆరు గంటల్లో డీపీఆర్ తయారు చేసి, అన్ని లాంఛనాలను పూర్తి చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అముతరాసన్ తన సోషల్ మీడియా పోస్టులో, "ఇది పాలనా వేగం కాదు. ఇది ముందస్తు ప్రణాళికతో కూడిన కాంట్రాక్ట్ రాజకీయం" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మంత్రి ఎన్.ఆనంద్‌ను లక్ష్యంగా చేసుకుంటూ, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంత తొందరపాటు ఎందుకని నిలదీశారు. సోషల్ మీడియాలో కూడా విమర్శలు పెరగడంతో, విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వం అదే రోజు సాయంత్రం టెండర్‌ను రద్దు చేసింది. దీని వెనుక పరిపాలనా కారణాలు ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ, ఈ చర్య రాజకీయ దుమారాన్ని తగ్గించలేకపోయింది.













Click it and Unblock the Notifications