బిల్లును వ్యతిరేకించినంత మాత్రాన.. కేకే కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఢిల్లీ సర్వీస్ బిల్లు.. రాజ్యసభలో ఆమోదం పొందింది. రాత్రి 10 గంటలకు ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. దీనికి అనుకూలంగా 131, ప్రతికూలంగా 102 ఓట్లు పోల్ అయ్యాయి.
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తటస్థ వైఖరిని అనుసరిస్తూ వస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు అనుకూలంగా ఓటు వేసింది. వైసీపీకి చెందిన తొమ్మిది మంది బిల్లుకు మద్దతు ఇచ్చారు. రాజ్యసభలో టీడీపీకి చెందిన ఒకే ఒక్క సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ కూడా ఎన్డీఏ వైపే మొగ్గు చూపారు.

ఈ బిల్లు ఇదివరకే లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నెల 3వ తేదీన లోక్‌సభలో అధికార పార్టీ.. ప్రవేశపెట్టగా అలవోకగా ఆమోదం లభించింది. పెద్దలసభతో పోల్చుకుంటే లోక్‌సభలో బీజేపీ, దాని మిత్రపక్షాల బలం ఎక్కువ కావడం వల్ల సులువుగానే ఢిల్లీ సర్వీస్ బిల్లు పాస్ అయింది.
రాజ్యసభలో మాత్రం బిల్లుపై రాజముద్ర పడటానికి మిత్రపక్షాలతో పాటు వైఎస్ఆర్సీపీ, బిజూ జనతాదళ్ వంటి తటస్థ రాజకీయ పార్టీల అవసరం కూడా బీజేపీకి ఏర్పడింది. ఇవ్వాళ సభలో ఈ బిల్లుపై వాడివేడిగా చర్చలు సాగాయి. వైఎస్ఆర్సీపీ సహా అన్ని పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

అనంతరం వాటన్నింటికీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌ను ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చిందనే విషయాన్ని వివరించారు. ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలతో చెలరేగారు. కాంగ్రెస్‌ను ఎదిరించి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు అదే కాంగ్రెస్ మద్దతును కూడగట్టిందని ఎద్దేవా చేశారు.
అమిత్ షా ప్రసంగం ముగిసిన అనంతరం బిల్లు ఆమోదం కోసం ఓటింగ్ నిర్వహించారు. మూజువాణి పద్ధతిలో ఓటింగ్ సాగింది. దీనికి అనుకూలంగా 131, ప్రతికూలంగా 102 ఓట్లు పోల్ అయ్యాయి. దీనితో బిల్లు సభామోదం పొందినట్లు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు.
ఈ బిల్లును భారత్ రాష్ట్ర సమితి వ్యతిరేకించింది. తాము అనుకూలంగా ఓటు వేయలేదని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, కే కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డి తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించినంత మాత్రాన తాము ప్రతిపక్షాల సంకీర్ణ కూటమి ఇండియాలో భాగస్వామిగా ఉన్నట్లు కాదని స్పష్టం చేశారు.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ లేదా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు చెందిన ఇండియా కూటమిలో తాము భాగస్వామ్యం కాదని తేల్చి చెప్పారు. దేశ ప్రజల శ్రేయస్సు, ప్రజాస్వామ్య విలువలను దృష్టిలో పెట్టుకుని అంశాలవారీగా పార్లమెంట్‌లో తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఢిల్లీ సర్వీస్ బిల్లును అధికార పార్టీ రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications